ప్రభుత్వ వైఫల్యం వల్లే మరణాలు
ప్రభుత్వ వైఫల్యం వల్లే మరణాలు
Published Tue, Jun 27 2017 11:17 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
ఏజెన్సీలో మలేరియా వ్యాప్తి
వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
కాకినాడరూరల్ / కరప : ప్రభుత్వం వైఫల్యం వల్లే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆకలి చావులు సంభవిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాఅధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. కరప మండలం నడుకుదురులో ఈ నెల 29న జరిగే జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశం ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా మంగళవారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఏజెన్సీలోని గిరిజనులు నేటికీ పనస గింజల జావతో కడుపు నింపుకుంటున్నారంటే ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఏజెన్సీ అంతా మలేరియా వ్యాపించి ఉంటే, ప్రభుత్వం లేదనడం విడ్డూరంగా ఉందన్నారు. కలుషిత ఆహారం తినడం వల్ల, కలుషితమైన నీరు తాగడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని అధికారులు చెప్పడం పూర్తిగా బాధ్యతారాహిత్యమంటూ మండిపడ్డారు. పౌష్టికాహార లోపం, రక్తహీనత వల్ల బలహీన పడిపోయి చిన్నపాటి జ్వరానికి కూడా మరణాలు సంభవిస్తున్నాయని కన్నబాబు ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడి వ్యక్తుల్లో మూడు, నాలుగు శాతానికి మించి రక్తం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి యుద్ధప్రాతిపదికన వైద్యపరీక్షలు చేయించి, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కన్నబాబు డిమాండ్ చేశారు. గిరిజనుల ఆరోగ్య సమస్యలను పరిశీలించేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలోనే ఏజెన్సీలో పర్యటించనున్నట్టు తెలిపారు. ఎప్పుడు పర్యటించేదీ త్వరలోనే ప్రకటిస్తామని కన్నబాబు వివరించారు.
మంత్రి వాఖ్యలు బాధ్యతారాహిత్యం
చాపరాయి మరణాలపై మంత్రి కామినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని కన్నబాబు విమర్శించారు. అక్కడ నివశించే ప్రజలు పౌరులు కాదా అని ప్రశ్నించారు. గ్రామంలో 60 మంది ఉంటే ప్రజలకు ఏం సేవలు అందిస్తామని మంత్రి ప్రకటించడం దారుణమన్నారు. తక్కువ ప్రజలు ఉన్న గ్రామాలకు ప్రభుత్వ సేవలు అందించదా అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మంత్రి కామినేని గిరిజన ప్రజలను చులకన చేసి మాట్లాడడం తగదన్నారు. ప్రజలు బాధల్లో ఉంటే మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని కన్నబాబు అన్నారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, పెండెం దొరబాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా యువజన అధ్యక్షులు అనంత ఉదయ్‌భాస్కర్, పెద్దాపురం, రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, గిరజాల బాబు, రాష్ట్ర ప్రచారవిభాగం ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర వాణిజ్య విభాగం నాయకులు కర్రి పాపారాయుడు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement