Did Pratap Kill Family Members In Tarnaka Deaths Incident - Sakshi
Sakshi News home page

తార్నాకలో ప్రైవేట్‌ ఉద్యోగి ఘాతుకం.. కాపాడాల్సినవాడే.. కడతేర్చాడు

Published Mon, Jan 16 2023 6:53 PM | Last Updated on Tue, Jan 17 2023 8:47 AM

Did Pratap Kill Family Members In Tarnaka Deaths Incident - Sakshi

కంటికిరెప్పలా ఇంటిల్లిపాదినీ కాపాడేవాడే, కుటుంబానికి అండగా ఉండాల్సినవాడే దారుణానికి ఒడిగట్టాడు. కన్నతల్లిని, కట్టుకున్న ఇల్లాలిని, అభమూ శుభమూ లియని కన్న కూతురునూ కడతేర్చాడు. కడకు తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్‌ పరిధిలో  ఘోరం జరిగింది. తనతో చెన్నై రావడానికి నిరాకరించిన భార్యతో పాటు కుమార్తెను, కన్నతల్లిని చంపేశాడు. ఆపై తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ప్రైవేట్‌ ఉద్యోగి.  సోమవారం మధ్యాహ్నం ఈ విషాద ఉదంతం వెలుగులోకి వచి్చంది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. చెన్నైకి చెందిన ప్రతాప్‌ (34) అక్కడి ఓ కార్ల కంపెనీలో డిజైన్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.

ఈయనకు దాదాపు ఎనిమిదేళ్ల క్రితం తార్నాక ప్రాంతానికి చెందిన సింధూర (32)తో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఆద్య ఉంది. సింధూరకు రెండు నెలల క్రితం హిమాయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో ఉద్యోగం వచి్చంది. దీంతో ఆమెతో పాటు ఆద్య, ప్రతాప్‌ తల్లి రాజతి నగరానికి వచ్చారు. తార్నాకలోని రూపాలీ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. చెన్నైలోనే ఉద్యోగం చేస్తున్న ప్రతాప్‌ వారాంతాల్లో ఇక్కడికి వచ్చి వెళ్తుండేవాడు. చెన్నై వెళదామనే విషయంపై కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 
 
బెడ్రూంల్లో నిద్రిస్తుండగా..  
చెన్నైలో స్థిరపడటానికి ఉద్యోగం వదిలి రావాలంటూ భార్య సింధూరపై ప్రతాప్‌ ఒత్తిడి తెస్తున్నాడు. దీనికి ఆమె అంగీకరించడంపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదాలు, గొడవలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ వీకెండ్‌లో రావడంతో శుక్రవారం ప్రతాప్‌ నగరానికి వచ్చాడు. చెన్నై వెళ్లే విషయమై రెండు రోజులుగా వీరి మధ్య గొడవలు జరిగి ఆదివారం రాత్రి తారస్థాయికి చేరింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రతాప్‌.. కుటుంబాన్ని హతమార్చి తానూ తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున ప్రధాన బెడ్రూంలో నిద్రిస్తున్న భార్య, కుమార్తెను, కొద్దిసేపటి తర్వాత పక్కనే మరో బెడ్రూంలో పడుకుని ఉన్న తల్లినీ చంపివేశాడు. హాల్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కు తాను ఉరి వేసుకుని ఆత్మహత్య 
చేసుకున్నాడు.  

సింధూర సహోద్యోగులు ఫోన్‌ చేయడంతో..  
సింధూర సోమవారం విధులకు హాజరుకావాల్సి ఉంది. ఆమె బ్యాంక్‌కు రాకపోవడంతో ఆరా తీసేందుకు సహోద్యోగులు ఫోన్‌ చేశారు. సింధూర నుంచి స్పందన రాకపోవడంతో మధ్యాహ్నం వరకు ప్రయత్నించారు. చివరకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో సింధూర అపార్ట్‌మెంట్‌కు వచ్చారు. ఎంత పిలిచినా లోపల నుంచి స్పందన లేకపోవడంతో పక్కన అపార్ట్‌మెంట్‌లో నివసించే సింధూర తల్లి జమునను తీసుకువచ్చారు.

వీరికి ఫ్లాట్‌లోకి హాల్‌లో ఫ్యాన్‌కు వేలాడుతున్న ప్రతాప్‌ మృతదేహం కనిపించింది. బెడ్స్‌పై ఉన్న సింధూర, ఆద్యలను పరిశీలించారు. సింధూర కొన ఊపిరితో ఉండటంతో సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించి డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. చికిత్స ప్రారంభించడానికి ముందే ఆమె తుది శ్వాస విడిచింది. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం మార్చురీకి తరలించారు. సింధూర తల్లి జమున ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు: సింధూర తల్లి జమున  
‘ప్రతాప్‌ మాకు దగ్గరి బంధువు హైదరాబాద్‌ నుంచి చెన్నై షిఫ్ట్‌ కావాలనే విషయంపై భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. కానీ.. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు’ అని జమున మీడియాతో అన్నారు. రాజతి మెడపై ఉన్న గుర్తుల్ని బట్టి ఉరి బిగించి లేదా గొంతు నులిమి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. సింధూర, ఆద్యల మృతికి కారణాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. పోస్టుమార్టం పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందని ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.రమేష్‌ నాయక్‌ తెలిపారు.

ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సింధూర కోసం వాళ్ల ఆఫీస్‌ వారు వచ్చి చూసేదాకా ఇంతటి ఘోరం జరిగిందని నాకు తెలియదు. ఆమె ఫోన్‌ ఎత్తట్లేదు అని ప్రతాప్‌ కూడా స్పందించట్లేదని కంగారు పడుతూ వచ్చి చెప్పారు. ఎంత కొట్టినా తలుపులు కూడా తీయట్లేదని ఆందోళన చెందారు. అప్పుడు వచ్చి చూస్తే ఈ ఘోరం కనిపించింది. మేం పక్క అపార్ట్‌మెంట్లో ఉంటాం. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మా దగ్గరికి వస్తే సరిపోయేది కదా. ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement