పినపాక : ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంతంగా ఉండాల్సిన గ్రామాలు గంజాయి మత్తులో ఊగుతూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. జిల్లాలో రోజురోజుకు పరిశ్రమల నిర్మాణాలు పెరుగుతుండడంతో వాటి పనులు చేసేందుకు పలు రాష్ట్రాల నుంచి కూలీలు వలస వస్తున్నారు. కాగా ఆయా ప్రాంతాల్లో గంజాయికి అలవాటు పడిన కార్మికులు.. ఇక్కడ కూడా వారు పని చేసే ప్రాంతాల్లో గంజాయి వినియోగానికి మార్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలో పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్న మణుగూరు, పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం, టేకులపల్లి ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా పినపాక నియోజకవర్గంలో భద్రాద్రి పవర్‌ప్లాంట్, సీతారామ, మిషన్ భగీరథ ప్రాజెక్టులు నిర్మించే ప్రాంతాలతో పాటు అశ్వాపురం మండల కేంద్రం, ఐటీసీ పరిశ్రమ ఉన్న సారపాక, భద్రాచలం తదితర ఏరియాల్లో గంజాయి వాడకం పెరుగుతోంది. వారం రోజుల వ్యవధిలోనే బూర్గంపాడు మండలంలో రెండు సార్లు గంజాయి విక్రయదారులను అరెస్ట్ చేసి, ఇంట్లో నిల్వ చేసిన గంజాయిని పట్టుకోవడం గమనార్హం.
పారిశ్రామిక ప్రాంతాలే ప్రధాన అడ్డాలు...
జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలే ప్రధాన అడ్డాలుగా గంజాయి వ్యవహారం సాగుతోంది. ఆయా ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకుని గంజాయి అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం. భద్రాద్రి, పాల్వంచ పవర్ ప్లాంట్ విస్తరణ పనుల్లో పాల్గొనేందుకు ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కార్మికులు వేల సంఖ్యలో వచ్చి మణుగూరు, పాల్వంచ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరికి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు తెలిసింది. చింతూరు, భద్రాచలం మీదుగా పాల్వంచకు తరలిస్తుండగా, అక్కడి నుంచి భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం నుంచి పినపాక మండలానికి రవాణా చేస్తున్నట్లు సమాచారం.
బానిసవుతున్న యువకులు...
గంజాయి అమ్మకాలు ఎక్కువ కావడంతో జిల్లాలోని విద్యార్థులు, యవకులు, కార్మికులు బానిసలుగా మారుతున్నారు. గ్రామాల్లోకే గంజాయి అందుబాటులోకి వస్తుండటంతో యువకులు గంజాయి పీల్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. వలస కార్మికులే లక్ష్యంగా రవాణా చేస్తున్నప్పటికీ.. స్థానిక విద్యార్థులు, యువకులు కూడా ఈ మత్తుకు అలవాటుపడుతున్నారు.
అన్ని ధరల్లో ప్యాకెట్లు లభ్యం...
ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉండే కొందరిని ఎంచుకొని వారికి కొంత కమీషన్ ఇస్తూ గంజాయి రవాణా, అమ్మకాలు సాగుతున్నాయి. భద్రాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణ ప్రాంతాల్లో గల లేబర్ కాలనీల్లో, పాల్వంచ పవర్‌ప్లాంట్ విస్తరణ పనులు చేస్తున్న కాలనీల్లో గుట్కా ప్యాకెట్లలో పెట్టి గంజాయిని హోటళ్లు, కిరాణా దుకాణాల్లోనూ విక్రయిస్తున్నారు. ఖైనీ ప్యాకెట్ల రూపంలో గంజాయిని ప్యాక్ చేసి అమ్ముతున్నారు. రూ.20, 30, 60, 120, 200, 300, 500 ఇలా అన్ని ధరల్లో అందుబాటులో ఉండేలా ప్యాకెట్లు తయారుచేసి విక్రయిస్తున్నారు. ఏటూరునాగారం నుంచి మణుగూరు, పినపాకకు, భద్రాచలం నుంచి పాల్వంచ, సారపాకకు వారానికి ఒకసారి ఆటోల ద్వారా గంజాయి తరలిస్తున్నారు. కాగా ఈ అమ్మకాలు రోజువారీగా గ్రామాల్లో సాగుతున్నా సంబంధిత అధికారులు నిఘా ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నా యి. దీనిపై మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబాను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ సి.నర్సింహారెడ్డిని వివరణ కోరగా గంజాయి రవాణాపై రెండు నెలలుగా నిఘా పెట్టామని చెప్పారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రవాణాను అరికడతామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment