వైద్యం అందకే మృత్యువాత పడుతున్న గిరిజనం
రాజవొమ్మంగి (రంపచోడవరం): ఏజెన్సీ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలపై జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అదుపులోకి రాని ఏజెన్సీ మరణాలకు క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణాలోపమే కారణమని సంఘం సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని రాష్ట్రమానవహక్కుల సంఘం దృష్టికి తీసుకొనివెళతామన్నారు. బుధవారం సాక్షిలో వచ్చిన మలేరియా మరణాల వార్తకు స్పందించిన పరిరక్షణ సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు నూతనపాటి అప్పలకొండ, మాచరి నాగమృత్యుంజయ మరికొంత మంది సంఘం సభ్యులు మంగళవారం రాజవొమ్మంగి మండలం సింగంపల్లి గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. జీజీహెచ్‌లో సెలిబ్రల్ మలేరియాకు చికిత్స పొందుతూ సింగంపల్లి గ్రామానికి చెందిన లోతా వెంకటరెడ్డి మరణించారు. ఈ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళిన సంఘ సభ్యులకు మృతుని భార్య కుమారి (21)కూడా మలేరియాతో మంచానడి మృత్యువుతో పోరాడుతూ కనుపించడం కలిచివేసింది. సింగంపల్లి గ్రామంలో నెలకొన్న అనారోగ్యకర పరిస్థితులపై వెంటనే జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓ స్పందించాలని డిమాండ్ చేశారు. గత వారంరోజులుగా నాలుగు మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కాగా చికిత్స పొందుతున్నారని గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తున్న ఎంపీడీఓ కేఆర్ విజయ, జిల్లా పారా మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్రావు విలేకరులకు తెలిపారు. మృతుని భార్య కుమారిని మెరుగైన చికిత్సకోసం ఎంపీడీఓ రాజవొమ్మంగి తరలించారు. స్థానిక సీఐ వెంకటత్రినా«థ్, ఎస్సై రవికుమార్ తమ సిబ్బందితోపాటు సింగంపల్లి తరలివచ్చారు. స్థానిక సర్పంచి ఆగూరి శుభలక్ష్మి వారివెంట ఉన్నారు.
.