గంగవరం ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులు
తూర్పుగోదావరి, రంపచోడవరం: పదో తరగతి ఫలితాల్లో గత ఏడాది రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్న జిల్లా ఈ ఏడాదీ ఆ స్థానాన్ని పదిలం చేసుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తోంది. కానీ ఏజెన్సీలో పరిస్థితి ఆ స్థాయిలో లేదు. అక్కడి విద్యా వ్యవస్థ తీరు పరిశీలిస్తే గత ఏడాది ఏజెన్సీలో 91 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఆ స్థాయి ఉత్తీర్ణతకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఉంది. రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో నాలుగు రకాల యాజమాన్యాలకు చెందిన 73 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 11 మండలాల పరిధిలో జెడ్పీ, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 3647 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వీరిలో సగం మంది సి, డి గ్రేడుల్లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా అన్ని యాజమాన్య పాఠశాలల్లో దాదాపు 44 శాతం మంది పదో తరగతి విద్యార్థులు చదువులో బాగా వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీలో పదో తరగతి ఉత్తీర్ణత శాతం పడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
గత ఏడాది జిల్లా ఉత్తీర్ణత శాతం కంటే తక్కువగా ఉన్న ఏజెన్సీ ఫలితాలు ఈ విద్య సంవత్సరంలోనైనా మెరుగు పరిచేందుకు ఐటీడీఏ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు ఎలా సమాయత్తం అవుతున్నారో అనే దానిపై పాఠశాల స్థాయిలో ఐటీడీఏ విద్యా శాఖ ఎలాంటి సమీక్షా నిర్వహించలేదు. రంపచోడవరం ఐటీడీఏ ఏజెన్సీ విద్యాఖాధికారి పోస్టు కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్నప్పటికీ అటు గిరిజన సంక్షేమ శాఖ కానీ, ఇటు విద్యా శాఖ కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ఇక అంతా పరీక్ష కాలమే..
పదో తరగతి విద్యార్థులకు ఈ నెల 24 నుంచి మార్చి 8వ తేదీ వరకూ ప్రీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం మార్చి 15 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతాయి. అన్ని యాజమాన్య పాఠశాలల్లో విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. వారిని పరీక్షలకు సిద్ధం చేసేందుకు సమయమూ లేదు.
మెటీరియల్ సరఫరా చేశాం
ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ సరఫరా చేశాం. రెండు మార్కులు, ఒక మార్కు, మ్యాప్ పాయింటింగ్, సైన్సు డ్రాయింగ్‌పై ఎక్కువ శ్రద్ధ చూపేందుకు చర్యలు తీసుకున్నాం. సబ్జెక్టు రివిజన్ ప్రారంభమైంది. టెస్ట్‌లు పెడుతున్నారు. నూరు శాతం ఫలితాల కోసం కృషి చేస్తున్నాం. – సరస్వతి, జిల్లా గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment