అగ్ని కీలలు
బుట్టాయగూడెం :అడవిలో కార్చిచ్చు రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అగ్ని కీలలు అరణ్యాన్ని భస్మీపటలం చేస్తున్నాయి. మూడు రోజులుగా దొరమామిడి, అలివేరు, పందిరి మామిడిగూడెం, కామవరం, గొట్టాలరేవు, చింతకొండ, ముంజులూరు, పులిరామన్నగూడెం, గోగుమిల్లి తదితర గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో అగ్నికీలలు ఎగసి పడుతున్నాయి. పచ్చదనంతో కళకళలాడే ఎత్తైన కొండలను సైతం మంటలు చుట్టుముడుతున్నాయి. బయటి ప్రాంతం నుంచి చూస్తే కొండలు, గుట్టల మీదుగా తెల్లటి పొగలు మేఘాలు కమ్మే శాయి. రాత్రి వేళ మంటలు కనిపిస్తున్నాయి. విలువైన అటవీ సంపద దహనమవుతున్నా అటవీ, అగ్నిమాపక శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా.. వేసవిలో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణమని చెప్పుకొస్తున్నారు. వెదురు తోపుల్లోని బొంగులు రాసుకోవడం వల్ల మంటలు రేగాయని అంటున్నారు.
ఫైర్ వాచర్స్ ఏరీ !
బుట్టాయగూడెం మండలంతోపాటు జీలుగువిుల్లి, పోలవరం మండలాల్లో అటవీ ప్రాంతం ఉంది. ఏటా వేసవిలో ఏదో ఒక మూల అగ్నికీలలు చెలరేగి అడవిని కాల్చేస్తున్నాయి. విలువైన అటవీ సంపద తుడిచిపెట్టుకుపోవడంతోపాటు మూగజీవాలు సైతం మృత్యువాత పడుతున్నాయి. అడవిని పరిరక్షించేందుకు ఫైర్ వాచర్స్‌ను నియమించాల్సి ఉండగా.. అటవీ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.