ఉప్పొంగిన కొండ వాగులు
ఉప్పొంగిన కొండ వాగులు
Published Tue, Aug 29 2017 10:53 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
ఇసుక కాల్వకు గండి
ముంపునకు గురైన పంటచేలు
పొంగిపారుతున్న కొత్తూరు కాల్వ
ఏజెన్సీలో రాకపోకలకు అంతరాయం
పోలవరం:
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాంతంలో కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షపాతం 77.8 మిల్లీమీటర్లుగా నమోదు అయ్యింది. కొత్తూరు, కొవ్వాడ, ఇసుక కాలువ, పేడ్రాల, నక్కలగొయ్యి కాలువలు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్తూరు కాలువ ఉధృతంగా ప్రవహించటంతో తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం వరకు ఏజన్సీ గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగు దాటేందుకు ఏజన్సీ వాసులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. కొత్తరామయ్యపేట పునరావాస కేంద్రం సమీపంలో ఇసుక కాలువ కుడి గట్టుకు 15 నుంచి 20 మీటర్ల పొడవున గండి పడింది. దీంతో పంట చేలు ముంపునకు గురయ్యాయి. కొంతమేరకు పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ఇసుక కాలువకు గండి పడటంతో రామయ్యపేట వాసులు బిక్కు,బిక్కు మంటూ కాలం గడిపారు. కాలువ నీరు గ్రామంపైకి వస్తుందని భయపడ్డారు. పేడ్రాల, నక్కలగొయ్యి, కొవ్వాడ కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నీరంతా పట్టిసీమ అవుట్‌ఫాల్ స్లూయిస్ ద్వారా గోదావరి నదిలో కలుస్తుంది. ఇసుక కాలువ గండిని పోలవరం తహసీల్దార్ ఎం.ముక్కంటి ఆర్‌ఐ ఆర్.నాగరాజు పరిశీలించారు. గండిని తాత్కాలికంగా పూడ్చి వేయాల్సిందిగా నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించినట్లు తహసీల్దార్ తెలిపారు.
Advertisement
Advertisement