సాక్షి, హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), గ్రూప్–4, మండల ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ తదితర పోస్టులకు ప్రభుత్వం పదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ శనివారం రాత్రి జారీ చేసిన నోటిఫికేషన్లలో పేర్కొంది. వయోపరిమితి లెక్కింపునకు 2018 జూలై 1వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించింది. జనరల్ అభ్యర్థులకు సాధారణ గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుకాగా.. తాజా సడలింపుతో 44 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి వర్తిస్తుంది. దీనికి ఆయా రిజర్వేషన్ల మేరకు అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మన్‌లకు మూడేళ్లు, ఎన్‌సీసీ వారికి మూడేళ్లు, వికలాంగులకు పదేళ్ల మేర అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది. అయితే ఆర్టీసీలోని 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రం సాధారణ గరిష్ట వయోపరిమితికి, ప్రభుత్వం ఇచ్చిన సడలింపు కలుపుకొని జనరల్ అభ్యర్థులకు 40 ఏళ్లు గరిష్ట వయోపరిమితి ఉంటుందని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. దీనికి అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మన్‌కు మూడేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుందని వెల్లడించింది. మొత్తంగా ఆర్టీసీలోని పోస్టులకు 45 ఏళ్లు దాటినవారు మాత్రం అనర్హులని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment