పెదబయలు మండలం రంగలోయలో వరి నాట్లపై నుంచి వరద ప్రవాహం
మన్యాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో గెడ్డలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఏజెన్సీలోని అరకులోయ, పాడేరు నియోజకవర్గాలలోని దాదాపు అన్ని మండలాలలోను ఇదే పరిస్థితి.
పెదబయలు (అరకులోయ): మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ డ్యాం నీటి మట్టం బుధవారం ప్రమాద స్థాయికి చేరుకుంది. రెండు రోజుల నుంచి ఆంధ్ర ఎగువన ఉన్న గిరిజన ప్రాంతాల్లో, అలాగే ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాల్లో విస్తా్తరంగా వర్షాలు కురుస్తుండడంతో అధికంగా నీరు డ్యావ్‌ుకు నీరు వచ్చి చేరుతోంది. దీంతో డుడుమ జలశాయానికి నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. డుడుమ డ్యాం 2590 అడుగుల సామర్థ్యం ఉండగా, బుధవారం 2590.9 అడుగుల నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో డ్యావ్‌ు ఐదు గేట్లు ద్వారా 18 వేల క్యూసెస్సుల నీటికి బలమెల రిజర్వాయర్‌కు దిగువన విడుదల చేస్తున్నామని ప్రాజెక్ట్ సిబ్బంది తెలిపారు. నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తు అప్రమత్తంగా ఉన్నామని సిబ్బంది తెలిపారు.
అరకులోయ: ఏజెన్సీలోని అరకులోయ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోను మంగళవారం రాత్రి నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రధాన గెడ్డలు, వాగులలో వరదనీటి ఉధృతి ప్రమాదకరంగా ఉంది. మత్స్యగెడ్డలో వరదనీరు పోటెత్తడంతో నాటుపడవల ప్రయాణాన్ని నిలిపివేశారు. జోలాపుట్టు రిజర్వాయర్‌లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరడంతో మూడు గేట్ల నుంచి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. డుడుమ డ్యామ్‌లోను ఇదే పరిస్థితి నెలకొంది, మారుమూల గ్రామాలకు పోయే దారుల్లో గెడ్డలు పొంగి ప్రవహిస్తుండడంతో రవాణా సౌకర్యాలు నిలిచిపోయి, మారుమూల గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.హుకుంపేట,డుంబ్రిగుడ,అనంతగిరి,అరకులోయ ప్రాంతంలోను బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుండపోతగా వర్షం కురిసింది.ప్రధాన గెడ్డలన్ని ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సమీప గ్రామాల గిరిజనులు తమ గ్రామాలకే పరిమితమయ్యారు. వర్షాలతో అనంతగిరి, బొర్రా, అరకులోయ,చాపరాయి వంటి పర్యాటక ప్రాంతాలు బోసిపోయాయి. హుకుంపేట మండలంలోని మత్స్యగుండం మీదుగా మత్స్యగెడ్డ నీరు పొంగి ప్రవహిస్తుండడంతో మత్స్యదేవతల దర్శనాన్ని రెండు రోజులుగా నిలిపివేశారు.
పాడేరు: మన్యం జలమయమైంది. అల్పపీడన ప్రభావం మన్యంలో అధికంగా ఉంది. మంగళవారం సాయంత్రం నుంచి వర్షం కుమ్మరిస్తోంది. రెండు రోజులుగా తెరిపివ్వకుండా వర్షం కురుస్తుండడంతో గెడ్డలు, వాగులు, పంట పొలాలు జలం నిండుగా మారాయి. రహదారులు, లోతట్టు ప్రదేశాలు జలమయమయ్యాయి. ఆగకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. కాస్తంత కూడా వాన తెరిపివ్వకపోవడంతో బుధవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కూడా అంతరాయం కలిగింది. రాయిగెడ్డ, కోడాపల్లి, పెదకోడాపల్లి, మత్స్యగెడ్డ పరీవాహక ప్రాంతాల్లో వాన జోరు వల్ల గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వంతెన పైనుంచి కూడా నీరు ప్రవహిస్తోంది. ముంచంగిపుట్టు, హుకుంపేట, పెదబయలు మండలాల్లో వానజోరు ఎక్కువగా ఉంది. ముంచంగిపుట్టు మండలంలో 74.2 మిల్లీమీటర్లు, పెదబయలు 54.6 మి,మీ, హుకుంపేట 68.8మి.మీ, డుంబ్రిగుడ 48.0మి,మీ, జి.మాడుగుల 36.4మి,మీ, జీకే వీధి 30.2మి,మీ, అరకు 32.6మి,మీ, పాడేరు 29మిమీ, చింతపల్లి 22.4మిమీ కొయ్యూరు 9మి,మీ, అనంతగిరి 20.4 మిమీ.ల వర్షపాతం నమోదైంది. మన్యం అంతటా ముసురు వాతావరణం అలముకుంది. బుధవారం రాత్రి వర్షం కొంత తెరిపిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment