అమ్మ ప్రేమతో ‘గోరుముద్ద’ | Implementation of midday meal in more than 44 thousand govt schools | Sakshi
Sakshi News home page

అమ్మ ప్రేమతో ‘గోరుముద్ద’

Published Mon, Jul 31 2023 3:48 AM | Last Updated on Mon, Jul 31 2023 6:45 PM

Implementation of midday meal in more than 44 thousand govt schools - Sakshi

అనకాపల్లి జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాన్ని ఆనుకుని ఉండే నాతవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మూడు నుంచి 10వ తరగతి వరకు 590 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంకా ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం 9.30  గంటలకల్లా ఆన్‌లైన్‌లో విద్యార్థుల హాజరు  పూర్తి చేశారు. ఆ వెంటనే అందుకు తగ్గ ట్టుగా నిర్దేశిత కొలత ప్రకారం మంగళవారం మెనూ అనుసరించి రాగి పిండి, చింతపండు పులిహోర కోసం బియ్యం, ఇతర సరుకు­లను వంట సిబ్బందికి అందజేశారు.

ఉదయం 10.20 గంటలకు బెల్లంతో చేసిన రాగిజావ ఇచ్చారు. మధ్యాహ్నం 12.20కి పులిహోర, దొండకాయ చట్నీ, ఉడికించిన గుడ్డు అందించారు. ఆరోజు బడికి హాజరైన 500 మంది విద్యార్థులు బడిలో అందించిన ఆహారాన్నే తీసుకున్నారు. మండల విద్యాశాఖాధికారి అమృత కుమార్‌ పులిహోరను రుచి చూసి పిల్లల అభిప్రాయం తెలుసుకుని రిజిస్టర్‌లో నమోదు చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ పాఠశాలల్లో ‘జగనన్న గోరుముద్ద’ కింద పోషక విలువలతో కూడిన రుచికరమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. విద్యార్థులు ఉదయం బడికి రాగానే హాజరు తీసుకుని అందుకు అనుగుణంగా ఆహా­రాన్ని సిద్ధం చేసేందుకు మెనూ సరుకులు అందచే­సు­్తన్నారు. పిల్లల అభిప్రాయాలను అడిగి తెలుసు­కుంటూ అందుకు తగ్గట్టు వంట చేస్తున్నారు. వివరాలను పారదర్శకంగా రిజిస్టర్‌లో నమోదు చేస్తూ పిల్లలకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు.

వారంలో ఆరు రోజులు రోజుకో మెనూ చొప్పున దాదాపు 37,63,698 మంది విద్యార్థులకు ఆహారాన్ని సమకూరుస్తున్నారు. ఉపాధ్యాయుల వద్దనున్న మొబైల్‌ యాప్‌లో విద్యార్థుల హాజరుతో పాటు భోజనం చేసేవారి సంఖ్యను తెలుసుకునేలా ‘ఇంటిగ్రేటెడ్‌ మానిటరింగ్‌ స్టిస్టమ్‌ ఫర్‌ మిడ్‌ డే మీల్స్‌ అండ్‌ శానిటేషన్‌’ (ఐఎంఎంఎస్‌) యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.

ఇందులో ప్రతిరోజు బడిలో ఉన్న సరుకుల స్టాక్‌తో పాటు భోజనం వివరాలను ఫొటోలతో సహా అప్‌లోడ్‌ చేస్తున్నారు. జగనన్న గోరుముద్ద పథకం అమలు కోసం ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం రూ.1,689 కోట్లు కేటాయించిందంటే పిల్లలకు పౌష్టికాహారం పంపిణీకి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు. 

ఫోర్టిఫైడ్‌ సార్టెక్స్‌ బియ్యం.. 
పిల్లల్లో రక్తహీనతను తగ్గించేందుకు వారంలో మూడు రోజులు బెల్లంతో చేసిన రాగిజావ, మరో మూడు రోజులు చిక్కీ ఇస్తున్నారు. వారంలో ఐదు రోజులు ఉడికించిన గుడ్డు తప్పనిసరి. సోమవారం వేడి పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్‌ పలావ్, గుడ్డు కూర, చిక్కీ, మంగళవారం ఉదయం 10.20కి రాగిజావ, మధ్యాహ్నం 12.20కి చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు, బుధవారం వెజిటేబుల్‌ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ, గురువారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్‌బాత్‌ లేదా నిమ్మకాయ పులిహోర, టొమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డు, శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ, శనివారం ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్‌ పొంగల్‌ మెనూగా అందిస్తున్నారు.

విద్యార్థుల్లో రక్తహీనతను నివారించేందుకు ఫోర్టిఫైడ్‌ సార్టెక్స్‌ బియ్యాన్నే వాడుతున్నారు. ప్రతి గురువారం స్థానిక ప్రభుత్వ వైద్యశాల, విలేజ్‌ క్లినిక్‌ సిబ్బంది పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్త హీనత నివారణ మాత్రలు అందించడంతోపాటు మోతాదు ప్రకారం తీసుకునేలా పర్యవేక్షిస్తున్నారు.
 
రాగి జావ చాలా బాగుంటుంది 
వారంలో మూడురోజులు ఉదయం ఇంటర్వెల్‌ టైంలో బెల్లంతో చేసిన రాగిజావను వేడివేడిగా ఇస్తారు. బడిలో అందరం తీసుకుంటాం. చాలా బాగుంటుంది. ఎంత కావాలన్నా ఇస్తారు. మధ్యాహ్నం భోజనం కూడా వేడిగా కావాల్సినంత పెడతారు. మా బడిలో ఎవరూ ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకోరు. అందరూ ఇక్కడ వండిందే తింటారు. టీచర్లు కూడా ప్రతిరోజు మాతో కలిసి భోజనం చేస్తారు.  – ఏ.కిరణ్‌కుమార్, రామ్‌ప్రసాద్, చిట్టినాయుడు (పదో తరగతి, సెక్షన్‌ ‘సి’), నాతవరం జెడ్పీహెచ్‌ఎస్‌

ఇంట్లో తిన్నట్టుగానే 
స్కూల్లో వండే ఆహారం ఇంట్లో ఉన్నట్టుగానే రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఇక్కడే తింటా. అన్నం తినేటప్పుడు ఎలా ఉందని మా మాస్టారు రోజు అడుగుతారు. బాగో లేకపోతే అదే విషయం చెబుతాం. దాన్ని రిజిస్టర్‌లో రాస్తారు. మాతో కూడా రాయిస్తారు. – వి.స్నేహశ్రీ, 9వ తరగతి బి–సెక్షన్, నాతవరం జెడ్పీహెచ్‌ఎస్‌

మా పిల్లలూ ఇక్కడే..
మా పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు. మా బిడ్డలకు వండినట్లే అందరు పిల్లలకు వండి పెడుతున్నాం. గతంలోనూ మధ్యాహ్నం బడిలో భోజనం పెట్టినా ఇంత చక్కగా పెట్టడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. పిల్లలు ఇష్టంగా తినడం చూస్తుంటే మాకూ ఆనందం కలుగుతుంది.  – దుర్గాభవాని, మిడ్‌ డే మీల్స్‌ తయారీదారు, నాతవరం జెడ్పీహెచ్‌ఎస్‌

టీచర్లకూ అదే భోజనం..
ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు అద్భుతంగా ఉన్నాయి. సరిపడినంత మంది ఉపాధ్యాయులు, వసతులను ప్రభుత్వం కల్పించింది. నిజంగా ఇదో గొప్ప మార్పు. మా స్కూల్లో 590 మంది పిల్లలు, 21 మంది ఉపాధ్యాయులున్నారు. మా పర్యవేక్షణలోనే వంటలు చేస్తారు. ప్రతిరోజు ముగ్గురు టీచర్లు ఇక్కడ వండిన ఆహారమే తింటారు. ఏనాడూ బాగోలేదన్న ఫిర్యాదు రాలేదు.  – ఎస్‌.శాంతికుమారి, నాతవరం జెడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం

నచ్చకపోతే ‘బ్యాడ్‌’ అని రాస్తాం
స్కూల్లో వండిన ఆహారం ఎప్పుడూ బాగుంటుంది. మాకు నచ్చినట్టుగానే వంట చేస్తారు. తిన్న తర్వాత ఎలా ఉందో ప్రతి రోజు మా టీచర్లు అడుగుతారు. నిర్భయంగా చెప్పమంటారు. బాగుంటే ‘గుడ్‌’ అని బాగో లేకపోతే ‘బ్యాడ్‌’ అని రిజిస్టర్‌లో రాస్తాం. ఒకసారి అలా రాస్తే మెనూ మార్చారు.  – కె.మహేశ్వరి, (పదో తరగతి), అల్లిపూడి జెడ్పీ హైస్కూల్‌

ప్రతి విషయంలో ప్రభుత్వం జాగ్రత్తలు
గత నాలుగేళ్లుగా ప్రభుత్వం పలు విద్యా సంస్కరణలు అమలు చేస్తోంది. ఉపాధ్యాయుల నుంచి పిల్లల చదువు, ఆహారం, ఆరోగ్యం వరకు అన్ని అంశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. నిజంగా ఇది ఓ విప్లవమనే చెప్పాలి. ప్రతిరోజు ఒక మెనూ అమలు చేస్తూ తిన్నాక అభిప్రాయాన్ని తెలుసుకోవడం గొప్ప విషయం. పిల్లల అభిప్రాయాల మేరకే గతంలో మెనూ మార్చారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో చెప్పడానికి ఇది చాలు.  – ఎన్‌.వై.నాయుడు పీఎస్‌ టీచర్, అల్లిపూడి జెడ్పీహెచ్‌ఎస్‌

కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 104 కాగా బుధవారం రోజు 86 మంది హాజరయ్యారు. మెనూ ప్రకారం కూరగాయల అన్నం, బంగాళాదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ విద్యార్థులకు ఇవ్వాలి. 10 గంటలకల్లా సరుకులు తీసుకున్న వంట సిబ్బంది పాఠశాల ప్రాంగణంలోని కిచెన్‌లో 12.15 గంటలకు భోజనాన్ని రెడీగా ఉంచారు.

తెలుగు ఉపాధ్యాయుడు గోవిందు భోజనాన్ని రుచి చూసి విద్యార్థుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. వారు సంతృప్తి వ్యక్తం చేశాక మరో ఉపాధ్యాయుడు ఎన్‌వై నాయుడు వేడివేడి భోజనం ఫొటోను ఐఎంఎంఎస్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసి విద్యార్థుల సంఖ్యను కూడా నమోదు చేశారు. 


- అల్లిపూడి, నాతవరం నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement