చిన్నారి మృతదేహాన్ని తీసుకుని వెళుతున్న తండ్రి పండుదొర
రంపచోడవరం: ఏజెన్సీలో పసిపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా రంపచోడవరం ఐటీడీఏ మొద్దు నిద్ర వదలడం లేదు. ప్రతిరోజూ వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. శుక్రవారం సైతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వచ్చిన మారేడుమిల్లి మండలం శ్రీపురానికి చెందిన తొమ్మిది నెలల మడకం వెంకన్నదొర విగతజీవిగా మారాడు. ప్రాణాలు పోయిన పసివాడి తల్లిదండ్రులు కన్నీటితో తల్లడిల్లినా ఐటీడీఏ అధికారులు కనీసం కన్నెత్తి చూడలేదు.
మూడు రోజులు నుంచి అనారోగ్యంతో..
మారేడుమిల్లి మండలం శ్రీపురం గ్రామానికి చెందిన మడకం పండుదొర, రాజమణిల తొమ్మిది నెలల కుమారుడు వెంకన్నదొర మూడు రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్నాడు. స్థానిక వాడపల్లిలో జరిగే సంతలో ఆర్‌ఎంపీ వైద్యం చేయించారు. ఫలితం లేకపోవడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చిన తరువాత వైద్య సేవలు అందేలోపే మృతి చెందాడు. దీంతో తండ్రి బాలుడు మృతదేహాన్ని భుజంపై వేసుకుని తమ ఊరుకు వెళ్లే ఆటో స్టాండ్‌కు చేరుకున్నాడు. అయితే ఇక్కడ గ్రామస్థాయిలో ప్రభుత్వ వైద్య సేవలు సక్రమంగా లేకపోవడంతో గిరిజనులకు కష్టాలు తప్పడం లేదు.
పిల్లల ఆరోగ్యంపై కానరాని శ్రద్ధ
గత ఏడాది రాజవొమ్మంగి, గంగవరం మండలాల్లో గిరిజన చిన్నారులు అనేక మంది మృత్యువాత పడినా ఐటీడీఏ నేటికీ సరైన కార్యచరణ ప్రణాళిక రూపొందిచలేదు. పౌష్టికాహారం అందించి చిన్నారుల ఆరోగ్యం మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోలేదు. గిరిజన చిన్నారులుకు పౌష్టికాహారమే ప్రధాన శుత్రువుగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment