నామమాత్రంగా ఐటీడీఏ సమావేశం
గిరిజన సమస్యలపై సాగని చర్చ
మన్యంలో అభివృద్ధి పనుల తీరుపై
పాడేరు, అరకు ఎమ్మెల్యేల అసంతృప్తి
పాడేరు: ఈ ఏడాది గత రెండుసార్లు బాక్సైట్ రభసతో ర ద్దయిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఈసారి కొనసాగినప్పటికీ నామమాత్రంగా జరిగింది. జిల్లా కలెక్టర్ ఎన్.యువరాజ్ అధ్యక్షతన సోమవారం వైటీసీ కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి పాలకవర్గ సభ్యులుగా ఉన్న గిరిజన సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు, అరకు ఎంపీ కొత్తపల్లి గీతతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం హాజరుకాలేదు. గిరిజన సమస్యలపై పూర్తిస్థాయి చర్చ కొనసాగలేదు. 25 అజెండా అంశాలపై చర్చ సాదాసీదాగా సాగిపోయింది. నాలుగు గంటల వ్యవధిలోనే సమావేశం ముగిసిపోయింది. ప్రధానంగా విద్య, వైద్యం, ఇంజనీరింగ్ శాఖల పథకాలపై చర్చ కొనసాగింది. ఏజెన్సీలో నత్తనడకన సాగుతున్న ప్రగతిపై పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వివిధ పథకాల కింద 2012-13 నుంచి ఇప్పటి వరకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌శాఖ కు 2162 పనులు మంజూరైతే 1285 పనులు మాత్రమే పూర్తికావడం, 194 పనులు ప్రారంభించకపోవడం, పీఆర్ ఇంజనీరింగ్‌లో 2876 పనులు మంజూరైతే నేటికీ 980 పనులు చేపట్టకపోవడం, 621 పనులు ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏజెన్సీలో అంగన్‌వాడీ భవనాలు, రోడ్ల నిర్మాణం, చెక్‌డ్యాం మరమ్మతు పనులు స్తంభించాయని, వీటిని త్వరితగతిన పూర్తి చేయాలని గిరిజన సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు పలు ప్రతిపాదనలు చేశారు. పాడేరు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మండల కేంద్రంలో వికలాంగుల కోసం సదరం క్యాంపులు ఏర్పాటు చేయాలని, గిరిజనుల్లో రక్తహీనతపై వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని, జననీ సురక్ష ప్రోత్సాహక సొమ్ము చెల్లింపు, సీఆర్టీలకు కనీస వేతనాల మంజూరు, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఏజెన్సీలో గ్రావిటీ పథకాలు సరిగా పని చేయడం లేదని, కాంట్రాక్టర్ల కోసమే ఈ పథకాలు కొనసాగుతున్నాయని, పనుల్లో నాణ్యత లేదని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఏజెన్సీలోని ఏరియా ఆస్పత్రులలో గైనకాలజిస్ట్, చిల్డ్రన్ స్పెషలిస్ట్‌ల నియామకం, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎం/హెల్త్ అసిస్టెంట్లను నియమించాలని, కేజీహెచ్‌లోని ఎస్టీసెల్‌లో పనిచేసే గిరిజన కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, పీహెచ్‌సీలో తాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్, పీవోల దృష్టికి తీసుకువచ్చారు. వైద్య ఆరోగ్యశాఖలో చాలా పోస్టులు ఖాళీ ఉంటున్నాయని, వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదించాలన్నారు. సీసీడీపీ పనుల్లో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతోందని, పనులు పూర్తికాకపోతే టెండర్లు రద్దు చే యాలన్నారు.
మన్యంలో కనీస సౌకర్యాల కల్పనపై దృష్టి
పాడేరు: ‘రాష్ట్రంలో పాడేరు ఐటీడీఏ అతి పెద్దది.. నేటికీ విశాఖ ఏజెన్సీలో 1336 గ్రామాలకు ప్రభుత్వ పథకాలు చేర్చడం సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయి.. దీన్ని అధిగమించేందుకు రోడ్డు నిర్మాణం, తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు దృష్టి పెడుతున్నాం’ అని కలెక్టర్ ఎన్.యువరాజ్ చెప్పారు. సోమవారం ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలో 11 మండలాల్లో అభివృద్ధి పథకాల పర్యవేక్షణకు ఏడాదికి రెండుసార్లు జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ ఆదేశించారు. 3 నెలలకు ఒకసారి నిర్వహించే ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి జిల్లాస్థాయి అధికారులంతా కచ్చితంగా హాజరుకావాలని చెప్పారు. డ్వామా, ఆర్టీసీ, జీసీసీ, టూరిజం శాఖలను ఐటీడీఏ పాలకవర్గంలో సభ్యులుగా చేర్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. అటవీ నిబంధనల కారణంగా నిలిచిపోయిన 28 రోడ్లకుగాను 16 రోడ్లను పూర్తి చేసేందుకు అనుమతి లభించిందన్నారు. విద్యుత్ కనెక్షన్లు కారణంగా ప్రారంభానికి నోచోకోని 10 మంచినీటి పథకాల కోసం రూ.10 లక్షలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అటవీ ఉత్పత్తుల కొనుగోలు, డీఆర్ డిపోల డీలర్ల నియామకాలు గిరిజన అభ్యర్థులతో భర్తీకి జీసీసీ ఎండీ రవిప్రకాష్ దృష్టికి తీసుకు వెళ్లి ప్రభుత్వానికి తగు చర్యల కోసం ప్రతిపాదిస్తామని కలెక్టర్ వెల్లడించారు.
ఐటీడీఏ పీఓ ఎం.హరినారాయణన్ మాట్లాడుతూ ఏజెన్సీలో పనులు చేపట్టి పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపుల కోసం రూ.23 కోట్లు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఆశ్రమాల్లోని 50 వేల మంది విద్యార్థులకు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తహీనతకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి తగిన వైద్యసేవలందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమావేశంలో సబ్ కలెక్టర్ ఎల్.శివశంకర్, ప్రత్యేక ఉప కలెక్టర్ వెంకటేశ్వరరావు, ఐటీడీఏ ఏపీఓ ఎస్‌విఎస్‌ఎస్ కుమార్, గిరిజన సంక్షేమ, పంచాయితీరాజ్, ఎస్‌ఎంఐ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అన్నిశాఖల డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
మంత్రి, ఎంపీ డుమ్మా
Published Tue, Dec 29 2015 1:00 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement