రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని, జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కష్టపడి పనిచేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశం హాల్‌లో సోమవారం ఎస్పీ సతీష్, జేసీ ధనంజయ్, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలంతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీలో పనిచేసే అధికారులు, సిబ్బంది వారి ప్రధాన కేంద్రాల్లో నివాసముండాలని ఆదేశించారు.
మండల, డివిజన్ స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. జిల్లాలో 200 నుంచి 300 గ్రామాలకు పక్కా రోడ్లు నిర్మించనున్నట్టు తెలిపారు. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమశాఖ ఇంజినీర్లతో ఏజెన్సీలోని రోడ్ల పరిస్థితిపై సమీక్షించారు. ఏజెన్సీలో ఆస్పత్రులు, వాటిలో అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. రేషన్‌కార్డు, పింఛన్ల సమస్యలు ఉంటే పూర్తిస్థాయిలో పరిష్కరించే బాధ్యత ఆయా శాఖ అధికారులపై ఉందన్నారు. ప్రతి వారం నిర్వహించే స్పందనకు అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు.ఏజెన్సీలో లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు.గిరిజనులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులకు కలెక్టర్ సూచించారు.
గిరిజనులకు సేవ చేయడం అదృష్టం
జిల్లా ఎస్పీ సతీష్ మాట్లాడుతూ ఏజెన్సీలో గిరిజనులకు సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించారు.సమావేశంలో ఏపీవో సీఎస్ నాయుడు, డీడీ ముక్కంటి, ఈఈ డేవిడ్‌రాజు, ఐ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment