సీతంపేట : ఒకపక్క ఈ-ఔషధి అంటూ హడావుడి చేస్తున్న ప్రభుత్వం మరోవైపు మారుమూల ప్రాంతాలకు అవసరమైన ఔషధ కేంద్రాలను మూసివేస్తూ గిరిజనులకు మందులు అందకుండా చేస్తోంది. సీతంపేట ఐటీడీఏ పరిధిలోని 29 పీహెచ్‌సీలకు మందులు సరఫరా చేసే బ్రాంచ్ డ్రగ్ స్టోర్‌కు మంగళం పాడేయడమే దీనికి నిదర్శనం. వారం రోజుల క్రితమే గుట్టుచప్పుడు కాకుండా దీన్ని ఎత్తివేయడంతో ప్రాథిమిక ఆరోగ్య కేంద్రాలకు మందులు ఎలా అందుతాయనేది ప్రశ్నార్థకమైంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలకు ఎటువంటి కొరత లేకుండా సకాలంలో మందులు అందించేందుకు ఎనిమిదేళ్ల క్రితం సీతంపేట 30 పడకల ఆస్పత్రి ప్రాంగణంలో బ్రాంచ్‌డ్రగ్ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి అన్ని రకాల మందులను తెప్పించి, ఇక్కడి నుంచి పీహెచ్‌సీలకు సరఫరా చేసేవారు. సాధారణ మందులతో పాటు సీజనల్ వ్యాధులకు అవసరమైన మందులు, కుక్కకాటు, పాముకాటు ఇంజక్షన్లను కూడా ఇక్కడి నుంచే పంపిణీ చేసేవారు.
మారుమూల పీహెచ్‌సీల పరిస్థితి ఏమిటి?
మర్రిపాడు, దోనుబాయి, కుశిమి వంటి పీహెచ్‌సీలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. వీటికి మందులు కావాలంటే వెంటనే సీతంపేట వచ్చి తీసుకెళ్లేవారు. అయితే ఇక్కడి డ్రగ్ స్టోర్ మూసివేయడంతో ఇక నుంచి జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది కష్టతరమైన పని. ముందుగా పలానా మందులు కావాలని ఆర్డర్ పెడితే.. తర్వాత ఎప్పటికో వాటిని పీహెచ్‌సీలకు పంపిణీ చేస్తారు. ఐటీడీఏ పరిధిలో 10 నుంచి 15 పీహెచ్‌సీలు మారుమూల ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటన్నింటికి సకాలంలో ఇక మందులు అందే పరిస్థితి కనిపించడం లేదు. బ్రాంచ్ డ్రగ్ స్టోర్ స్థానంలో పోస్టల్ శాఖ ద్వారా ఇక నుంచి మందులు సరఫరా అవుతాయని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే మారుమూల ప్రాంతాలకు ఇవి ఎలా వెళతాయన్నది స్పష్టం కావడంలేదు. ఈ విషయమై స్థానిక ఎస్‌పీహెచ్‌వో ఎం.రాంబాబు వద్ద ప్రస్తావించగా అన్ని ఐటీడీఏల్లో బ్రాంచ్‌డ్రగ్ స్టోర్‌లను ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఎత్తివేశారని తెలిపారు. పోస్టల్ ద్వారా మందులు సరఫరా చేస్తారని తెలిపారు.
ఏజెన్సీ డ్రగ్ స్టోర్‌కు ఎసరు
Published Sun, Apr 19 2015 4:33 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement