ఏటూరునాగారం : రాష్ట్రంలోని ఏజెన్సీ మండలాలు, గ్రామాల్లో ఉత్పత్తి అయ్యే స్థానిక పంటలతో ఆహార వస్తువులను తయారు చేసే యూనిట్లను పెట్టేందుకు ట్రైకార్, గిరిజన సహకార సంస్థ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఉట్నూరు. భద్రాచలం, ఏటూరునాగారం ఐటీడీఏల పరిధిలో అక్కడ ఉన్న గిరిజనులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మినీ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలని ప్రణాళికలను సిద్ధం చేయడానికి ట్రైకార్ స్టేట్ మిషన్ మేనేజర్ లక్ష్మీప్రసాద్, జీసీసీ డీజీఎం విజయ్‌కుమార్, ఇతర అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఎక్కువగా లభించే పప్పు ధాన్యాలు, పసుపు, తేనేను ఆసరాగా చేసుకొని అక్కడ ఉన్న ఉప్పత్తులను బట్టి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల పెట్టుబడితో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఏ పంట పండుతుందని అక్కడ ఉన్న హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులతో ట్రైకార్, జీసీసీ అధికారులు సమావేశమై ఇన్‌పుట్స్‌ను సేకరిస్తున్నారు. సమగ్రంగా నివేదికను తయారు చేసి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు అందజేయనున్నారు.
ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోమిర్చి, పసుపు యూనిట్లు
ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాంతంలో ఏటా సుమారు 17,500 క్వింటాల మేర మిర్చి ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మిర్చితో కారం పొడిని తయారు చేసి స్థానిక గిరిజన విద్యాసంస్థలకు జీసీసీ ద్వారా సరఫరా చేస్తే బాగుటుందని ప్రణాళికలను రూపొందించారు. దీనిద్వారా స్థానిక గిరిజన ప్రజలకు ఉపాధి లభించే అవకాశం ఉందని, ఆర్థికంగా అభివృద్ధి కూడా చెందుతారని చర్చించారు. కారం పొడిని నాణ్యంగా తయారు చేసి ఈ ఉత్పత్తిని ప్రైవేటు మార్కెట్‌లోకి జీసీసీ ద్వారా ప్రవేశపెడితే మరింత డిమాండ్ వచ్చే అవకాశం ఉంది.
భద్రాద్రి కొత్తగూడ జిల్లాలోని ఇల్లందులో జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన కారం, పసుపు యూనిట్లు ఉన్నాయి. దీనిద్వారా మూడు ఐటీడీఏల పరిధిలోని గిరిజన విద్యాసంస్థలు, సహకార సంస్థలకు కారం, పసుపు రవాణా చేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. ఇదే తరహాలో ఐటీడీఏ ప్రాంతాల్లో కూడా ఇలాంటి యూనిట్లు పెట్టి గిరిజన ప్రజలకు ఉపాధి కల్పించాలని గిరిజన సంక్షేమ కమిషనర్ క్రిస్టియానా భావిస్తున్నట్లు సమాచారం. దీంతో సుమారు ఆరు వేల మంది గిరిజనులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని అధికారులు టార్గెట్లను కూడా రూపొందించారు.
ట్రైకార్ ద్వారా గతంలో ఎకానమికల్ సపోర్ట్ స్కీమ్(ఈఎస్‌ఎస్) కింద 175 రకాల యూనిట్లను అందజేసేవారు. ఇప్పుడు నేరుగా ట్రైకార్ యూనిట్‌ను ఏర్పాటు చేసి గిరిజన మహిళలతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి ఆ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ కొనసాగించాలనే ఉద్దేశంతో అర్హులైన మహిళా సంఘాల జాబితాను కూడా పరిశీలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పితే గిరిజన ప్రజలకు ఉపాధి లభించి ఆర్థికంగా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment