traibal candidates
-
ఎస్ఐ నోటి దురుసుపై ఆందోళన
సాక్షి, భీమ్‌గల్: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీధర్ రెడ్డి నోటి దురుసుతో కాంగ్రెస్ పార్టీ, గిరిజన నాయకులు నిరసనకు దిగారు. వారిపై చేసిన దూషణలకు నిరసనగా శుక్రవారం భీమగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గిరిజనులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలివచ్చి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. గురువారం స్థానిక యూత్ కాంగ్రెస్ నాయకుడు బదావత్ గోపాల్ నాయక్‌కు మరో గిరిజనుడితో జరిగిన ఘర్షణ విషయంలో ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తనను, కాంగ్రెస్ పార్టీని పరుష పదజాలంతో దూషించాడని మండల పార్టీ నాయకులకు తెలిపాడు. దీంతో మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధికార ప్రతినిధి మానాల మోహన్ రెడ్డి, భీమ్‌గల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మూడెడ్ల జితేందర్, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చంద్రూనాయక్, టీపీసీసీ సెక్రెటరీ ముస్సావీర్ ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు గిరిజనులతో కలిసి నినాదాలు చేస్తూ పీఎస్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై బైటాయించి ఎస్ఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకుని సీఐ సైదయ్య, ఎస్ఐ శ్రీధర్ రెడ్డితో పాటు మరి కొందరు ఎస్ఐలు, సిబ్బంది తరలివచ్చారు. వీరితో మానాల మోహన్ రెడ్డి, చంద్రునాయక్, కన్నె సురేందర్‌లు వాగ్వాదానికి దిగారు. రాజకీయ ఒత్తిళ్లతో తమ నాయకులపై అణిచివేత చర్యలకు దిగడం తగదన్నారు. ఎస్ఐకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రెట్టించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఒక వైపు చెబుతూనే ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సబబన్నారు. ఎస్ఐ పరుష పదజాలంతో ఎందుకు దూషించాడని ప్రశ్నించారు. ఒక దశలో గిరిజన మహిళలు ఎస్ఐని చుట్టుముట్టారు. సీఐ సైదయ్య ఆందోళనకారులకు ఎంత నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. దీంతో ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పడంతో వారు శాంతించి ఆందోళనను విరమించారు. నిరసనలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లిక గంగాధర్, రత్నయ్య, కర్నె గంగయ్య, పర్స అనంతరావ్, యూత్ కాంగ్రెస్ పార్లమెంటరీ సెక్రెటరీలు ఆరె రవీంధర్, బొదిరె స్వామి, ఉపాధ్యక్షుడు నాగేంద్ర, మండల కన్వీనర్ వాకా మహేష్, కనికరం మధు, సుర్జీల్ గిరిజనులు, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధికి ఊతం
ఏటూరునాగారం : రాష్ట్రంలోని ఏజెన్సీ మండలాలు, గ్రామాల్లో ఉత్పత్తి అయ్యే స్థానిక పంటలతో ఆహార వస్తువులను తయారు చేసే యూనిట్లను పెట్టేందుకు ట్రైకార్, గిరిజన సహకార సంస్థ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఉట్నూరు. భద్రాచలం, ఏటూరునాగారం ఐటీడీఏల పరిధిలో అక్కడ ఉన్న గిరిజనులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మినీ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పాలని ప్రణాళికలను సిద్ధం చేయడానికి ట్రైకార్ స్టేట్ మిషన్ మేనేజర్ లక్ష్మీప్రసాద్, జీసీసీ డీజీఎం విజయ్‌కుమార్, ఇతర అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఎక్కువగా లభించే పప్పు ధాన్యాలు, పసుపు, తేనేను ఆసరాగా చేసుకొని అక్కడ ఉన్న ఉప్పత్తులను బట్టి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల పెట్టుబడితో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇందుకోసం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఏ పంట పండుతుందని అక్కడ ఉన్న హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులతో ట్రైకార్, జీసీసీ అధికారులు సమావేశమై ఇన్‌పుట్స్‌ను సేకరిస్తున్నారు. సమగ్రంగా నివేదికను తయారు చేసి గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు అందజేయనున్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోమిర్చి, పసుపు యూనిట్లు ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాంతంలో ఏటా సుమారు 17,500 క్వింటాల మేర మిర్చి ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మిర్చితో కారం పొడిని తయారు చేసి స్థానిక గిరిజన విద్యాసంస్థలకు జీసీసీ ద్వారా సరఫరా చేస్తే బాగుటుందని ప్రణాళికలను రూపొందించారు. దీనిద్వారా స్థానిక గిరిజన ప్రజలకు ఉపాధి లభించే అవకాశం ఉందని, ఆర్థికంగా అభివృద్ధి కూడా చెందుతారని చర్చించారు. కారం పొడిని నాణ్యంగా తయారు చేసి ఈ ఉత్పత్తిని ప్రైవేటు మార్కెట్లోకి జీసీసీ ద్వారా ప్రవేశపెడితే మరింత డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడ జిల్లాలోని ఇల్లందులో జీసీసీ ద్వారా ఏర్పాటు చేసిన కారం, పసుపు యూనిట్లు ఉన్నాయి. దీనిద్వారా మూడు ఐటీడీఏల పరిధిలోని గిరిజన విద్యాసంస్థలు, సహకార సంస్థలకు కారం, పసుపు రవాణా చేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. ఇదే తరహాలో ఐటీడీఏ ప్రాంతాల్లో కూడా ఇలాంటి యూనిట్లు పెట్టి గిరిజన ప్రజలకు ఉపాధి కల్పించాలని గిరిజన సంక్షేమ కమిషనర్ క్రిస్టియానా భావిస్తున్నట్లు సమాచారం. దీంతో సుమారు ఆరు వేల మంది గిరిజనులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని అధికారులు టార్గెట్లను కూడా రూపొందించారు. ట్రైకార్ ద్వారా గతంలో ఎకానమికల్ సపోర్ట్ స్కీమ్(ఈఎస్ఎస్) కింద 175 రకాల యూనిట్లను అందజేసేవారు. ఇప్పుడు నేరుగా ట్రైకార్ యూనిట్‌ను ఏర్పాటు చేసి గిరిజన మహిళలతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి ఆ ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ కొనసాగించాలనే ఉద్దేశంతో అర్హులైన మహిళా సంఘాల జాబితాను కూడా పరిశీలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పితే గిరిజన ప్రజలకు ఉపాధి లభించి ఆర్థికంగా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
గిరిజన అభ్యర్థులకు శిక్షణ
బుట్టాయగూడెం : బుట్టాయగూడెం మండలం కేఆర్ పురం ఐటీడీఏలో గిరిజన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు పీవో ఎస్.షణ్మోహన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సీఏడీ / సీఏఎం అభ్యర్థులకు బుధవారం నుంచి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు 19 నుంచి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. సీఏడీ/ సీఏఎం శిక్షణకు అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణలై వయసు 18 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. కానిస్టేబుల్ శిక్షణకు ఇంటర్ ఉత్తీర్ణత సాధించాలని, 18 నుంచి 26 ఏళ్ల వయసు ఉండాలని తెలిపారు. శిక్షణ కాలం రెండు నెలలు ఉంటుందని పేర్కొన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆధార్ కార్డు, దరఖాస్తు చేసుకున్న రసీదు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో శిక్షణకు హాజరుకావాలని సూచించారు. వివరాలకు 99595 36789, 89856 17583, 94933 20944లో సంప్రదించాలని కోరారు.