సాక్షి, విశాఖపట్నం: ఆదివారం ఉదయం 11 గంటలు దాటింది... ఎత్తైన కొండలు.. దట్టమైన అటవీ ప్రాంతం...15 నుంచి 20 మంది మావోయిస్టులు కిందకి దిగుతున్నారు. ఇదే క్రమంలో కూంబింగ్ పార్టీలు కొండ ఎక్కేందుకు సిద్ధమవుతున్నాయి. అంతే ఒక్కసారిగా కాల్పులమోతతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ హఠాత్పరిణామానికి మిగతా మావోయిస్టులు చెల్లాచెదురైపోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలున్నట్లు సమాచారం. ఈ ఘటన గుమ్మిరేవుల పంచాయతీ అన్నవరం, మాదిగమల్లు అటవీ ప్రాంతం బొడ్డమామిడి కొండల్లో జరిగింది. మృతుల్లో గాలికొండ ఏరియా కార్యదర్శి హరి, మావోయిస్టు చలపతి భార్య అరుణ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఏవోబీలో యుద్ధమేఘాలు
పాడేరు: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాలు ఏ క్షణంలో రాజుకుంటాయో తెలియని నిప్పు రవ్వల్లా ఉన్నాయి. ఓవైపు మావోయిస్టుల సంచారం కొనసాగుతూ ఉంటే.. మరోవైపు వారి ఏరివేతే లక్ష్యంగా కేంద్ర పోలీసు బలగాల గాలింపు ఉధృతంగా సాగుతూ ఉండడంతో ఏవోబీలో గ్రామాలు, అటవీ ప్రాంతాలు లోలోన రగులుతున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా మన్యంలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పోలీసు పార్టీలు అధికంగా సంచరిస్తున్నప్పటికీ మావోయిస్టులు తమ కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.
ఇటీవల ఏవోబీలోని మూడు చోట్ల మావోయిస్టులు గిరిజనులతో భారీ బహిరంగ సభలు నిర్వహించి, పోలీసు బలగాలకు సవాల్ విసిరారు. దీంతో ప్రత్యేక పోలీసు బలగాలు, స్థానిక పోలీసు దళాలు కూంబింగ్‌లను మరింత మమ్మురం చేశాయి. పోలీసు పార్టీలు, మావోయిస్టుల సంచారంతో సరిహద్దు గ్రామాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పచ్చని అడవులు ఇరువర్గాల బూట్ల చప్పుళ్లతో ప్రతిధ్వనిస్తున్నాయి. అడవిలో పోలీసులు, మావోయిస్టులు ఎదురుపడితే తుపాకుల మోత మోగుతోంది.
తాజాగా ఆదివారం జి.కే.వీధి మండలం, గుమ్మిరేవుల పంచాయతీలోని మాదిమల్లు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య చోటుచేసుకున్న ఎదురుకాల్పుల ఘటనలో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. ఈ ప్రాంతంతో పాటు, ఏవోబీ వ్యాప్తంగా పోలీసుల కూంబింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ముందస్తుగానే పోలీసుల వ్యూహం
మావోయిస్టు పార్టీ ఆవిర్భావ ఉత్సవాలతో అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ, ఒడిశా,ఆంధ్రా రాష్ట్రాల పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక ఆదేశాలిచ్చింది. ఏవోబీ వ్యాప్తంగా విస్తృత కూంబింగ్ ఆపరేషన్‌లలో కేంద్ర పోలీసు బలగాలు నిమగ్నమయ్యాయి. విశాఖ ఏజెన్సీలోని కొయ్యూరు, జి,కే.వీధి, చింతపల్లి, జి.మాడుగుల, అన్నవరం, ముంచంగిపుట్టు, పెదబయలు పోలీసు స్టేషన్లతో పాటు, అవుట్ పోస్టులు ఉన్న రాళ్లగెడ్డ, నుర్మతి, రూడకోట ప్రాంతాల్లో కూడా ప్రత్యేక పోలీసు పార్టీలను రంగంలోకి దింపారు. ప్రత్యేక పోలీసు పార్టీలు వారం రోజుల నుంచి ఏవోబీ వ్యాప్తంగా కూంబింగ్‌ను విస్తృతం చేశాయి.
నిర్బంధం బేఖాతరు
ఏవోబీలో కాస్త పుంజుకున్న మావోయిస్టు పార్టీ, పోలీసు నిర్బంధాన్ని ఖాతరు చేయడం లేదు. ఇటీవల కాలంలో తమ కార్యక్రమాలను మరింత విస్తృతపరిచింది. ఏవోబీలోని మావోయిస్టు పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర నాయకత్వం యువకులను రంగంలోకి దింపినట్లు సమాచారం. మావోయిస్టు ఉద్యమాన్ని విస్తృతం చేస్తున్న యువరక్తం ఆధ్వర్యంలో ఇటీవల ఏవోబీ వ్యాప్తంగా ప్రజలతో కీలక సమావేశాలు నిర్వహించినట్టు పోలీసుశాఖ దృష్టికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మావోయిస్టు పార్టీలో కీలకమైన క్యాడర్ గత మూడు నెలల కాలంలో పోలీసులకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసింది. మావోయిస్టుల వరుస లొంగుబాట్లతో పోలీసు యంత్రాంగం సంతోషపడింది. అయితే బలమైన క్యాడర్ ఏవోబీలో లేనప్పటికి స్థానిక క్యాడర్‌తో మావోయిస్టు పార్టీ బలం పుంజుకుంటుందన్న సమాచారంతో పోలీసుశాఖ భారీ కూంబింగ్‌లకు వ్యూహత్మంగా వ్యహరిస్తోంది. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి.
మృతుల్ని గుర్తించాల్సి ఉంది
జీకేవీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిని గుర్తించాల్సి ఉంది. మృతదేహాలను కొండ కిందకు తీసుకువచ్చాక వారిని గుర్తించి అప్పుడు వారు ఎవరనేది ప్రకటిస్తాం.
– సతీష్‌కుమార్, ఏఎస్పీ, చింతపల్లి
Comments
Please login to add a commentAdd a comment