మంచమెక్కిన మన్యం
ఏజెన్సీలో ఏ పల్లె చూసినా జ్వరపీడితులే
ప్రతీ ఇంటా ఇద్దరు... ముగ్గురు బాధితులు
సర్కారు మందు బిళ్లలతో నయం కాని వైనం
ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్న గిరిజనం
వ్యాధి ముదిరితే ఇక మరణమే శరణ్యం
సాలూరురూరల్:జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతీ ఇంటా రోగులు దుప్పట్లు ముసుగేసుకుని మూలుగుతున్నారు. ముఖ్యంగా సాలూరు మండలం గంజాయిభద్ర పంచాయతీ ధూళిభద్ర, పనికి, ఎగువశెంబి తదితర గిరిశిఖర గ్రామాల్లో ప్రజలు ఎక్కువగా ఈ జ్వరాలతో బాధపడుతున్నారు. ధూళిభద్ర గ్రామంలో చోడిపల్లి శామియేలు, చోడిపల్లి దాసయ్య, లుంబే, గమ్మెల ఆనంద్, గమ్మెలసుకరి, గమ్మెలవట్రి, గమ్మెల అజయ్.
గమ్మెల దన్ను, తాడంగి బిరుమ, తాడంగి సోమి, గమ్మెల బిహును తదితరులు, పనికి గ్రామంలో కొర్ర గాసి, కొర్ర హిందు, కొర్ర గిత్త, గమ్మెల రుపిణి తదితరులు, ఎగువశెంబిలో తాడంగి చిరంజీవి, తాడంగి రంజి, తాడంగి సితాయి, తాడంగి టికామో, తాడంగి కామేష్ తదితరులు జ్వరాలతో బాధపడుతున్నారు. చలిజ్వరాలతో దుప్పట్లు కప్పుకొని ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక్కోఇంటిలో ఇద్దరి నుంచి నలుగురు జ్వరాలతో బాధపడుతున్నారు.
వీరిలో అధికంగా చిన్నారులే ఉన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎమ్‌లు, హెల్త్ అసిస్టెంట్లు తరచూ గ్రామానికి వచ్చి రోగులకు పారాసిట్‌మాల్ మాత్రలు ఇచ్చి వెళ్తున్నారనీ.. అయినా తగ్గుముఖం పట్టడంలేదని బాధితులు చెబుతున్నారు. ఇక తప్పని సరి పరిస్థితుల్లో స్థానిక ఆర్‌ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తున్నామని వారు చెబుతున్నారు. కేవలం జ్వరం తగ్గడానికే సుమారు మూడువేల వరకు ఖర్చుచేస్తున్నట్టు వారు పేర్కొంటున్నారు.
కష్టంగా మారిన జీవనం
రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద గిరిజనులకు వైద్యంకోసం పెద్ద మొత్తం వెచ్చించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనికి వెళ్తేనే రోజు గడుస్తుందనీ లేకపోతే పస్తుతో ఉంటున్న తమ జీవితాలను ఈ జ్వరాలు అతలాకుతలం చేస్తున్నాయని వాపోతున్నారు. వారాల తరబడి మంచమెక్కడంతో పనులు చేసుకోలేక ఇల్లు గడవడం లేదని బాధపడుతున్నారు. జ్వరం తగ్గిన తరువాత కూడా దాదాపు నెలరోజులపాటు కాళ్లు... ఒళ్లు నొప్పులు తగ్గడం లేదని చెబుతున్నారు.
చిన్నారులతో తల్లడిల్లుతున్న తల్లులు
చంటి బిడ్డలు జ్వరాలతో బాధపడడంతో వారి కన్నతల్లులు తల్లడిల్లుతున్నారు. పిల్లలు తమను అంటిపెట్టుకునే ఉండటంతో ఏ పనికీ బయటకు వెళ్లలేకపోతున్నట్టు చెబుతున్నారు. అధికారులు స్పందించి జ్వరాలతో బాధపడుతున్న సమయంలో తమకు ఖరీదైన మందులు అందించడంతోపాటు ఆ రోజుల్లో జీవనం గడిచేందుకు ఏమైనా ఆర్థిక సహాయం చేయాలని అధికారులను కోరుతున్నారు.