
ఆగమేఘాల మీద ‘63’ ఏళ్ల ఫైలు
♦ చీఫ్ సెక్రటరీ చెంతకు వైద్య ఆరోగ్యశాఖలో పదవీ విరమణ వయసు పెంపు ఫైలు
♦ గుంటూరు పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ కోసమే ఇదంతా!
♦ ఆయన కోసం ఆస్పత్రికి విరాళమిచ్చిన పారిశ్రామికవేత్త ఒత్తిడి
♦ కొత్త నియామకాలు, పదోన్నతులు చేయకుండా ఎలా పెంచుతారు
♦ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసిన ప్రభుత్వ వైద్యుల సంఘం
సాక్షి, అమరావతి
రిటైర్ కాబోతున్న ఓ ఉద్యోగిని పదవిలో కొనసాగించేందుకు పదవీ విరమణ వయసునే ప్రభుత్వం పెంచాలనుకోవడం ఆ శాఖ ఉద్యోగుకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దేశ చరిత్రలోనే ప్రప్రథమమని భావిస్తున్న ఈ చర్య రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో చోటుచేసుకుంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసును 60 ఏళ్లకు పెంచింది. అయితే నాలుగు రోజుల క్రితం బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యుల పదవీ విరమణ వయసును 63 ఏళ్లకు పెంచాలని మళ్లీ ఫైలు సిద్ధం చేశారు. ఆగమేఘాల మీద ఈ ఫైలును రెడీ చేసి ఈనెల 26న చీఫ్ సెక్రటరీకి పంపించారు. పదవీ విరమణ వయసు పెంచాలని ఎలాంటి విజ్ఞప్తులూ లేవు, లేఖా రాయలేదు, పైగా వైద్య సంఘాలు వ్యతిరేకిస్తున్నా ఒక వ్యక్తిని పదవిలో మరింతకాలం కూర్చోబెట్టేందుకు తీసుకున్న నిర్ణయమంటూ వైద్య వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.
పెంపు వెనుక అసలు కథ ఇదీ
ఈ నెల 31న గుంటూరు పెద్దాసుపత్రి సూపరింటెండెంట్ డా. రాజునాయుడు రిటైర్ కాబోతున్నారు. ఆయనను మరింత కాలం కొనసాగించాలని అదే ఆస్పత్రికి రూ. 20 కోట్లు పైగా విరాళం ఇచ్చిన ఓ పారిశ్రామిక వేత్త నిర్ణయించి.. ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో తక్షణమే 63 ఏళ్ల పెంపు ఫైలు రెడీ చేసి పేషీకి పంపించాలని వైద్య విద్యా సంచాలకులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశించారు. ఈ ఆదేశాలతో ఫైలును ఒక్కరోజులో రెడీ చేసి పంపించారు. దీనికి వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆమోద ముద్ర వేసి ఈనెల 26న చీఫ్ సెక్రటరీకి ఫైలు పంపించారు. నేడో రేపో జీవో వస్తుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.
నియామకాలు, పదోన్నతుల సంగతేమిటి?
ప్రస్తుతం బోధనాసుపత్రుల్లో 600కు పైగా ఖాళీలున్నాయి. వీటిని రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ప్రభుత్వం సుముఖత చూపడం లేదు. అలాగే ఏళ్ల తరబడి ప్రభుత్వ వైద్యుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. కనీసం సీని యర్ రెసిడెంట్‌లకు సకాలంలో గౌరవ వేతనం కూడా ఇవ్వకపోవడంతో సమ్మె నోటీసు ఇచ్చారు. ఇక హౌస్ సర్జన్‌లకు, పీజీ స్టూడెంట్‌లకు ఇచ్చే స్టయిఫండ్ గత మూడేళ్లుగా పెంచలేదు. ఇలాంటి సమస్యలు బోధనాసుపత్రుల్లో ఉండగా పదవీ విరమణ పెంపుపై నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
పాత సమస్యలు పరిష్కరించకుండా ఇదేంటి?
పదవీ విరమణ వయసు 63 ఏళ్లకు పెంపు నిర్ణయంపై ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ నిర్ణయంపై వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు ఈనెల 25న సంఘం లేఖ రాసింది. ముందుగా రోగులకు సరిపడా యూనిట్లు లేవని, వాటిని ఏర్పాటు చేయకుండా, సకాలంలో పదో న్నతులు ఇవ్వకుండా, పేస్కేళ్లు ఇవ్వకుండా 60 ఏళ్లు దాటినా తిరిగి వారినే కొనసాగించడమేమిటని లేఖలో ప్రశ్నించారు. పదవీ విరమణ వయసు పెంచాలని ఏ ప్రభుత్వ డాక్టరు అడగడం లేదని, గతంలో ఉన్న సమస్యలను ముందు పరిష్కరించాలని లేఖలో కోరింది. లేదంటే ఆందోళనకు సిద్ధం కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.