పద్మకు పుట్టిన ఆడ బిడ్డ , జర్త పద్మ(ఫైల్)
మాతృత్వం కోసం ఆ తల్లి ఎంతో పరితపించింది. నాలుగు సార్లు గర్భం దాల్చగా రెండు సార్లు అబార్షన్ అయింది. మూడో సారి బిడ్డపుట్టి చనిపోయింది. నాల్గో సారి గర్భం దాల్చడంతో ఎన్నో కలలుకంది. తనకు పుట్టబోయే బిడ్డకోసం ఎన్నో ఊహించుకుంది. బోసి నవ్వులు చూడాలని పరితపించింది. తన చేయి పట్టుకుని బిడ్డ బుడిబుడి అడుగులు వేస్తుంటే అడుగులో అడుగు కలిపి మళ్లీ నడకనేర్చుకోవాలని ఆశపడింది. అమ్మా అనే మాటను చెవులారా వినాలని ఎదురుచూసింది . అయితే ఆమె ఆశను పురిటిలోనే తుంచేసింది మృత్యుదేవత. అమ్మా అనే పిలుపునకు నోచుకోకుండానే ఆ ఆభాగ్యురాలు మృత్యువాత పడింది. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ కురుకూరుకు చెందిన ఓ బాలింత ఆడ బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది. మరిది పెళ్లి సమయంలో ఈ విధంగా జరగడంతో ఆ ఇంట విషాదం నెలకొంది.
కొయ్యూరు(పాడేరు): మండలంలో బూదరాళ్ల పంచాయతీ కునుకూరుకులో ఏడో నెలలో ఆడబిడ్డను ప్రసవించిన జర్త పద్మ(29) అనే బాలింత ప్రసవ సమయంలో కన్నుమూయడంతో గ్రామంలో విషాదం అలముకుంది. ఇది వరకు మూడుసార్లు గర్భం దాల్చిన ఆమెకు రెండుసార్లు అబార్షన్ అయింది. మరోసారి బిడ్డ పుట్టి మరణించింది.నాల్గో ప్రసవంలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చి మరణించింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి మృతురాలి మరిదికి వివాహం జరిగింది. దీంతో తీరిక లేకుండా పెళ్లి పనులు చేసింది. ఆదివారం తెల్ల్లవారు జాము వరకు పనిచేసింది. తరువాత ఆమెకు తీవ్రమైన తలనొప్పి వచ్చింది. అనంతరం ప్రసవ నొప్పులు రావడంతో ఇంటి వెనుకకు వెళ్లింది.
అక్కడ ఎవరి సహాయం లేకుండానే ఆడబిడ్డను ప్రసవించింది. ఆమెకు ప్రసవం జరిగిన విషయం ఎవరికీ తెలియలేదు. చివరకు బిడ్డ ఏడుపు గమనించిన ఆమె నాన్నమ్మ వెళ్లి చూడగా తల్లీబిడ్డ పక్క పన్కనే ఉన్నారు. బంధువులంతా ఆమెను బిడ్డతో సహా ఇంటిలోకి తీసుకువచ్చారు. అలా తీసుకువచ్చిన కొద్దిసేపటికే పద్మ మరణించింది.బిడ్డ క్షేమంగా ఉంది. పద్మ మరణించడంతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. అంతవరకూ ఎంతో హుషారుగా తిరిగిన ఆమె అంతలోనే మృత్యువాత పడడాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు తట్టుకోలేకపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పద్మ మృతి సమాచారం తెలుసుకున్న వైద్యాధికారి శ్యామల సోమవారం కునుకూరు వెళ్లారు. వివరాలు తెలుసుకున్నారు. నెలలు నిండక ముందు ప్రసవం జరగడం, మేనరికపు వివాహం వల్లే ఈ విధంగా జరిగిందని ఆమె తెలిపారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మన్యంలో మాతా శిశు మరణాలు ఆగకపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment