వైద్యం కోసం రోగిని డోలీలో తరలిస్తున్న గిరిజనులు
మన్యసీమ మృత్యు సీమగా మారింది. ఏ పల్లె చూసినా, ఏ ఇల్లు చూసినా ఏదో విషాదంతో ముడిపడే ఉంటోంది. ఈ లోకంలోకి కన్ను తెరిచేలోగా కొందరు.. తెరిచాక మరికొందరు చిన్నారులు కన్ను మూస్తున్నారు. అమ్మ పొత్తిళ్లలోనే అసువులు బాస్తున్న శిశువులు.. వారిని చూడకుండానే తనువు చాలిస్తున్న తల్లులు విశాఖ మన్యంలో కోకొల్లలు.. ఇలా గడచిన ఐదున్నరేళ్లలో విశాఖ ఏజెన్సీలో 2,210 మంది నవజాత శిశువులు, 150 మంది గర్భిణులు, బాలింతలు మృత్యువాత పడటం అక్కడ దయనీయ పరిస్థితికి దర్పణం పడుతోంది. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ బారినపడి ఏటా వందల సంఖ్యలో గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు.
సాక్షి, విశాఖపట్నం/పాడేరు: వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం విశాఖ ఏజెన్సీలోని 3,574 గ్రామాల్లో 6,04,047 మంది గిరిజన జనాభా ఉంది. వీరికి వైద్య సేవలందించేందుకు పాడేరు, అరకుల్లో ఏరియా ఆస్పత్రులు, 36 పీహెచ్‌సీలు, 199 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటిలో పూర్తి స్థాయిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది లేకపోవడంతో గిరిజనులకు అరకొర వైద్యమే అందుతోంది. మంజూరైన పోస్టుల్లో 10 శాతానికి మంచి రెగ్యులర్ వైద్యులు, సిబ్బంది లేరు. దీంతో ప్రభుత్వం ఆ ఖాళీల్లో కాంట్రాక్టు వైద్యులు, సిబ్బందిని నియమించి కాలక్షేపం చేస్తోంది. ఈ ఏరియా ఆస్పత్రులకు పీహెచ్‌సీల మాదిరిగా ఒక్కో అంబులెన్స్ మాత్రమే ఉంది. దీంతో అత్యవసర రోగుల తరలింపులో జాప్యం జరిగి ప్రాణ నష్టం వాటిల్లుతోంది. మారుమూల గ్రామాల నుంచి వైద్యం కోసం కేజీహెచ్‌కు వెళ్లేందుకు గిరిజనులు చాలా వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. రవాణా సేవలు విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. కొండకోనల్లో రోగులను కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రులకు తరలించేందుకు ఇప్పటికీ డోలీ మోతే శరణ్యమవుతోంది. చాలా గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు అందుబాటులో లేవు. దీనివల్ల గిరిజనులకు గెడ్డ నీరే గతి అవుతోంది. ఫలితంగా టైఫాయిడ్, డయేరియా, చర్మవ్యాధులకు గురవుతున్నారు.
పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేసినా..
2018 జనవరి నుంచి ఏజెన్సీలోని 36 పీహెచ్‌సీలను 24–7 ఆస్పత్రులుగా ప్రభుత్వం మార్పు చేసింది. వీటిలో చాలా పీహెచ్‌సీలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పీహెచ్‌సీల చెంతన డాక్టర్లు, వైద్య సిబ్బందికి నివాస గృహాలు లేవు. దీంతో నామమాత్రంగానే ఈ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలోని పాడేరు కేంద్రం గా జిల్లా మలేరియా శాఖతో పాటు అదనపు వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయాలు ఉన్నాయి. వీటికి జిల్లా మలేరియా అధికారి, జిల్లా అదనపు వైద్యాధికారిని కూడా నియమించారు. కానీ ఏజెన్సీలో వైద్య సేవల పర్యవేక్షణకు వీరికి వాహనాల్లేవు. పాడేరులో మలేరియా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు 2014లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు.
పిట్టల్లా రాలిపోతున్నా..
మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ప్రసవ వేదనకు గురవుతున్న గర్భిణులు తీవ్ర నరకయాతను ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు పరిస్థితి విషమంగా ఉన్న సమయాల్లో నెలలు నిండని గర్భిణులను చివరి నిమిషాల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ఐదున్నరేళ్ల వ్యవధిలో ఏజెన్సీలో 2210 మంది నవజాత శిశువులు, మరో 155 మంది గర్భిణులు, బాలింతలు మృతి చెందారు. ఈ ఏడాది మే నుంచి జూలై వరకు డెంగ్యూ లక్షణాలతో 8 మంది చనిపోయారు. కానీ వైద్య ఆరోగ్యశాఖ ఒక్కటి కూడా నమోదు చేయడం లేదు.
వైద్యనిపుణులులేకపోవడమూ శాపమే..
ఏజెన్సీ వ్యాప్తంగా పీహెచ్‌సీలు, ప్రాంతీయ ఆస్పత్రుల్లోనూ నేటికీ పూర్తి స్థాయి వైద్య నిపుణులు (గైనకాలజిస్టు, పిల్లలు, మత్తు వైద్య నిపుణులు) లేకపోవడంతో శాపంగా మారింది. ఏజెన్సీ 11 మండలాలకు సంబంధించి ఒక వంద పడకల ఆస్పత్రి, ఒక ఏరియా ఆస్పత్రి, రెండు సామాజిక ఆస్పత్రులు, 36 పీహెచ్‌సీల పరిధిలో 202 సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు పాడేరు, అరకు, చింతపల్లి, జి.మాడుగుల, హుకుంపేట మండలాల్లో ప్రసూతి కేంద్రాలు, పాడేరులో ఒక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలున్నాయి. గర్భిణులు, బాలింతలతో పాటు మిగిలిన గిరిజనులు వైద్య చికిత్సల కోసం ఆయా ఆస్పత్రులకు వస్తారు.
Comments
Please login to add a commentAdd a comment