mother and child deaths
-
విషాదం: కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య
సాక్షి బళ్లారి: పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిని ఆర్థిక సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో ఘోర నిర్ణయం తీసుకుంది. మహిళా రైతు ఇద్దరు కూతుర్లతో పొలంలోని ఫారంపాండ్‌లో దూకి ఆత్మహత్య చేసుకొంది. ఈ విషాదం జిల్లాలోని సిరుగుప్ప తాలూకాలో చోటు చేసుకుంది. గురువారం సిరుగుప్ప తాలూకా శాలిగనూరు గ్రామానికి చెందిన నాగరత్న (40), ఆమె కుమార్తెలు శృతి (12), గిరిజ (8)లతో కలిసి తమ పొలంలోని నీటి గుంతలో దూకి ప్రాణాలు తీసుకున్నారు. రూ.20 లక్షలకు పైగా రుణాలు నాగరత్నమ్మకు భర్త వీరేశగౌడతో కలిపి 3 ఎకరాల చేను ఉంది. పంటల సాగు కోసం బ్యాంకులో దాదాపు రూ.6 లక్షలు, ప్రైవేటు వ్యక్తులతో రూ.15 లక్షల రుణాలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఒక ఎకరా అమ్మి కొంత అప్పులు తీర్చారు. అయినప్పటికీ అప్పుల బాధను తాళలేక ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలుస్తోంది. గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి. సీఐ పవార్, ఎస్ఐ రంగయ్య ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం సిరుగుప్ప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అమ్మా .. మన్నించు!
మచిలీపట్నం: తల్లీ బిడ్డల ఆరోగ్య పరిరక్షణ కోసమని ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. కానీ జిల్లాలో మాతా– శిశు మరణాలు ఏటేటా పెరుగుతూనే ఉన్నాయి. 2019 సంవత్సరంలో 801 శిశు మరణాలు నమోదయ్యా యి. ఒక్క జనవరి నెలలోనే 57 మంది పసికందులు మృత్యువాతపడ్డారు. అదే విధంగా వివిద కారణాలతో పురిటి నొప్పులతో (మెటర్నల్ డెత్)ఈ ఏడాది కాలంలో 57 మంది తల్లులు చనిపోయారు. శిశు మరణాల నమోదులో రాష్ట్ర సూచికలో జిల్లా నాల్గో స్థానంలో నిలిచింది. జిల్లాలో మాతా శిశు మరణాల తీవ్రతకు అద్దం పడుతోంది. అందుబాటులో ఆస్పత్రులు ఉన్నప్పటికీ జిల్లాలో మాతా–శిశు మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతుండటం, 18 ఏళ్ల వయస్సు లోపు గర్భం దాల్చుతుంటం ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. గర్భం దాల్చిన సమయంలో సరైన పౌష్టికాహారం అందటం లేదు. రక్తహీనత వల్లనే మాతృ మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొంతమంది ప్రైవేటు వైద్యులు గర్భిణులతో మోతాదుకు మించి మందులు మింగిస్తుండటం మరణాలకు కారణంగా నిలుస్తోంది. ఆస్పత్రులకు పరీక్షల కోసమని వచ్చే ప్రతీ సందర్భంలో అవసరం లేకున్నా మందులు సిఫార్సు చేస్తుండటం వల్ల కూడా తల్లితోపాటు, కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణు లు చెబుతున్నారు. ఇటువంటి తరుణంలో అప్రమత్తం కావాల్సిన వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మధ్య సరైన సమన్వయ లేకపోవటం వల్లనే పరిస్థితి చేయిదాటిపోతోందనే విమర్శలు ఉన్నాయి. నమోదులో ఎందుకీ నిర్లక్ష్యం గర్భం దాల్చిన మహిళకు టీకాలు వేసేందుకు వైద్య సిబ్బంది, పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీల్లో సమగ్ర వివరాలను సకాలంలో నమోదు చేయాలి. కానీ వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమశాఖల మధ్య సమన్వయ లోపం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. 2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకు జిల్లాలో 74,054 గర్భిణులను నమోదు కాగా, ఇందులో 65,085 మంది ఆసుపత్రుల్లో ప్రసవించారు. అలాగే 2019 ఏఫ్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు జిల్లాలో 58,404 గర్భిణుల నమోదు జరుగగా, 52,010 ప్రసవాలు ఆసుపత్రుల్లో జరిగాయి. ఈ లెక్కన చాలా మంది ఇంటివద్దనే ప్రసవిస్తున్నట్లుగా తెలుస్తోంది. 2019 సంవత్సరంలో జిల్లాలో 55,617 జననాలుకు గాను ప్రసవ సమయంలో 53,004 మందిని నమోదు చేశారు. ముప్పై రోజుల తరువాత 772 మంది, ఒక ఏడాది లోపు 1,522 జననాల నమోదు జరిగింది. ఈ కారణంగా చాలా మంది మహిళలకు గర్భిణీ, ప్రసవానంతరం సకాలంలో సరైన వైద్యం అందటం లేదనేది తేటతెల్లమౌంది. అంగన్వాడీల్లో అలసత్వం వీడాల్సిందే అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు సరైన పౌష్టి కాహారం అందటం లేదు. గర్భిణులు కేంద్రానికి వచ్చి ఫీడింగ్ తీసుకోవటం లేదని అంగన్వాడీ కార్యకర్తలు చెబుతున్న మాట. ఇటువంటప్పుడు గర్భిణులకు తగిన అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎవరిది..? ఈ విషయంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. మాతా– శిశు మరణాల నివారణ కోసమని వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి, హైరిస్క్ ఉన్న గర్భిణులకు తగిన వైద్య పరీక్షలు, అవగాహన కోసమని ప్రతీ నెల 9న ప్రధాన మంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ (పీఎంఎస్ఎంఏ) పథకం క్రింద లక్షలాది రూపాయలు ఖర్చు చేసి శిబిరాలను నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ కార్యక్రమాలు విజయంతమైతే, మన జిల్లా మాతృమరణాల నమోదులో రాష్ట్ర సూచికలో ఎందుకు పైపైకి వెళ్తుందనేది అధికారులకే తెలియాల్సి ఉంది.జిల్లా ఉన్నతాధికారులు ఇటువంటి సమస్యలపై తక్షణమే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరణాలు లేకుండా అప్రమత్తం మాతా, శిశు మరణాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. భవిష్యత్‌లో మాతా– శిశు మరణాలు లేకుండా ప్రత్యేక సాంకేతితకను వినియోగిస్తున్నాం. ప్రత్యేక యాప్ ద్వారా గర్భిణికి సంబంధించిన వివరాలను నమోదు చేస్తున్నాము. దీనివల్ల గర్భిణికి తగిన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ ఉంటుంది. –డాక్టర్ టీఎస్ఆర్ మూర్తి, డీఎంహెచ్ఓ -
ప్రాణం తీసిన వైద్యం
పెద్దవడుగూరు: వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సిన ప్రసవాన్ని ఓ ఏఎన్ఎం చేయడంతో తల్లీ, బిడ్డ మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే... పెద్దవడుగూరు మండల పరిధిలోని భీమునిపల్లి గ్రామానికి చెందిన చిన్న కంబన్న, లక్ష్మమ్మల చిన్న కుమార్తె నాగేశ్వరమ్మను గత ఏడాది యాడికి మండలం కోన ఉప్పలపాడుకు చెందిన మద్దిలేటిస్వామికి ఇచ్చి వివాహం జరిపించారు. నాగేశ్వరమ్మ గర్భం దాల్చడంతో వారి కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషించారు. 5 నెలలు నిండగానే నాగేశ్వరమ్మ తల్లితండ్రుల ఇంటికి వచ్చింది. అప్పటి నుండి క్రిష్టిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటోంది. ఈనెల 10వ తేదీని డెలివరీ డేట్‌గా చెప్పారు. ఇందులో భాగంగానే శనివారం ఉదయం 11 గంటలకు ప్రసవం కోసం క్రిష్టిపాడు ఆస్పత్రికి వెళ్ళారు. అక్కడి వైద్య సిబ్బంది పరీక్షలు చేసి నొప్పులు రావడం కోసం మాత్ర ఇచ్చారు. రాత్రి 7 గంటల సమయంలో పురిటి నొప్పులు రావడంతో ఏఎన్ఎం జ్యోతి ప్రసవం చేసింది. 7:20 నిమిషాలకు నాగేశ్వరమ్మ మగ్గ బిడ్డకు జన్మనిచ్చింది. శిశువు ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని వెంటనే తాడిపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో నాగేశ్వరమ్మను ఆస్పత్రిలోనే ఉంచి బిడ్డను మాత్రం తాడిపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే బిడ్డ మృతి చెందాడని చెప్పడంతో వెనుతిరిగి వచ్చారు. అయితే అప్పటికే నాగేశ్వరమ్మకు అ«ధిక రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమెను కూడా గుత్తికి తీసుకెళ్ళాలని వైద్యసిబ్బంది చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను గుత్తి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు నాగేశ్వరమ్మ పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు చెప్పడంతో వారి కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరయ్యారు. ఏఎన్‌ఎంతోనే కాన్పులు డ్యూటీకి సక్రమంగా చేయని వైద్యుడు శ్రీనివాసరెడ్డి తన పబ్బంగడుపుకునేందుకు ఓ ఏఎన్ఎం చేతనే కాన్పులను చేయిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఎవరు కాన్పుకు వచ్చినా సరే ఈ వైద్యుడు అందుబాటులో ఉండడని స్థానిక సీపీఐ నాయకులు చెబుతున్నారు. పైగా ఏఎన్ఎంపై ఒత్తిడి తెచ్చి కాన్పులు చేయిస్తూ వస్తున్నాడని అంటున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ తల్లీ, బిడ్డ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయమే వైద్యుడి ప్రత్యక్షం నాగేశ్వరమ్మ ఆమె బిడ్డ మృతి చెందిన విషయం తెలుసుకున్న వైద్యుడు శ్రీనివాసరెడ్డి ఆదివారం ఉదయమే ఆస్పత్రిలో ప్రత్యక్షం కావడం విశేషం. తల్లీ,బిడ్డ మృతికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, సీపీఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వైద్యుడి నిర్వాకంతోనే... కిష్టపాడు ఆరోగ్య కేంద్రంలో వైద్యుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి నిర్లక్ష్యం కారణంగానే తల్లీ, బిడ్డ మృతి చెందారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నాగేశ్వరమ్మకు 10వ తేదీని డెలివరీ డేట్‌గా ముందుగానే నిర్ణయించారు. అయినా కూడా వైద్యుడు అందుబాటులో ఉండకుండా ఏఎన్ఎం చేత ప్రసవం చేయించడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని అంటున్నారు. శ్రీనివాసరెడ్డి విధులను కూడా సక్రమంగా నిర్వర్తించడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఉదయం 11 గంటలకు డ్యూటీకి వచ్చి రెండు గంటలలోపే వెళ్లిపోతున్నాడని అంటున్నారు. షాక్‌లో కుటుంబ సభ్యులు గంట వ్యవధిలోనే నాగేశ్వరమ్మతో పాటు బిడ్డ ప్రాణాలు పోవడంతో ఆ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ బిడ్డను ఎంతో అపురూపంగా పెంచుకున్నామని తల్లీబిడ్డతో ఇంటికి వెళ్దామనుకుంటే వారి శవాలను తీసుకెళ్ళాల్సి వస్తుందనుకోలేదంటూ కన్నీరు మున్నీరయ్యారు. దీంతో భీమునిపల్లిలో విషాదఛాయలు అలముకున్నారు. కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ కిష్టపాడు ఆస్పత్రిలో ఏఎన్ఎం ఆధ్వర్యంలోనే ప్రసవాలు జరుగుతున్నాయని అందరికీ తెలిసినా వైద్యశాఖ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్న నేటి కాలంలోనూ సరైన వైద్యసేవలు అందక రెండు నిండు ప్రాణాలు పోవడం బాధాకరం. -
వీడని మిస్టరీ..!
ఒంగోలు/మద్దిపాడు:తల్లీబిడ్డ హత్యకేసు మిస్టరీ వీడలేదు. రెండు రోజులు గడిచినా మృతుల వివరాలు తెలియరాలేదు. మద్దిపాడు మండలం మారెళ్లకుంటపాలెం సమీప పొలాల్లో మంగళవారం రాత్రి తల్లీబిడ్డను హతమార్చి, పెట్రోలుపోసి దహనం చేసిన ఘటన సంచలనం కలిగించిన విషయం విధితమే. ఈ ఘటనలో మృతుల వివరాలు తెలిస్తేనే హంతకుడు దొరికే అవకాశం ఉందని భావించిన పోలీసులు మృతుల ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ నేతృత్వంలో 14 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. మృతురాలి వేలి ముద్రలను హైదరాబాద్‌లోని అడిషనల్ జనరల్ ఆఫ్ ఆధార్‌కు పంపారు. ఆమె ధరించిన చెప్పులు, దుస్తులు సేకరించి ఒంగోలు నగరంలోని చెప్పుల షాపులు, రెడిమేడ్ షాపుల్లో సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. పెద్దకొత్తపల్లి, పేర్నమిట్ట గ్రామాలతోపాటు ఒంగోలు నగరంలోని జాతీయ రదారిపై ఉన్న పెట్రోలు బంకుల్లో సీసీ ఫుటేజ్‌లను సేకరించే పనిలో పడ్డారు. మృతదేహాల ఫొటోలతో కరపత్రాలు ముద్రించి వాటిని గ్రామాల్లో పంచుతూ వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. తల్లీబిడ్డలకు సంబంధించిన వివరాల కోసం అంగన్వాడీలు, ఏఎన్ఎమ్ల ద్వారా విచారణ చేయిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఓ బృందాన్ని ఉంచి అటుగా వెళ్తున్న రైతులు, పాదచారులను ఆరా తీస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదా రుల జాబితాను పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద బుధవారం వాహన చోదకులను విచారిస్తున్న సీఐ జ్యోతిరాణి ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా దర్యాప్తు వేగవంతం: ప్రత్యక్ష సాక్షులుగా భావిస్తున్న పలువురిని పోలీసులు గుర్తించారు. మంటలను గమనించిన పేర్నమిట్టవాసితోపాటు అతను అందించిన సమాచారంతో అక్కడకు వెళ్లిన వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో శివమాల ధరించిన భక్తులు ఇద్దరు బిడ్డతో ఉన్న ఓ మహిళతో 32 ఏళ్ల వ్యక్తి మారెళ్ళగుంట పొలాల వద్ద గొడవ పడుతుండటం తాము గమనించామని, అతడు తాము భార్యాభర్తలమని బదులిచ్చాడని పోలీసులకు తెలిపారు. నీలిరంగు గ్లామర్ బైక్‌పై వారు వచ్చినట్టు చెప్పారు. ఆ తర్వాత గంటలోపే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గుర్తించారు. ఈ వివరాల ఆధారంగా ఆ మార్గంలో సీసీ కెమెరా పుటేజిని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అటువైపుగా వచ్చే వాహనచోదకులను మహిళా సిఐ జ్యోతిరాణి, ఎస్సై సాంబయ్యలు ఆరా తీస్తున్నారు. సీడీఎస్ ప్రాజెక్టు ఆధికారిణి చిలకా భారతి అంగన్వాడీ సూపర్ వైజర్లతో కలిసి సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు ప్రాంతాలలో బుధవారం విచారించారు. పోలీసులు మాత్రం గ్రామాలలో జల్లెడ పడుతున్నారు. సోమ, మంగళవారాల్లో ఈ ప్రాంతంలో వర్షం కురిసిన కారణంగా పోలీసు జాగిలం కూడా మృతురాలి చుట్టే తిరుగాడింది. ఘటనా స్థలంలో పొగ రావడం గమనించి అక్కడకువెళ్లిన పెదకొత్తపల్లి గ్రామానికి చెందిన, బేల్దారి పనులు చేసే వ్యక్తిని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. పెదకొత్తపల్లి గ్రామంలోని ఒక నాయకుడి గోడౌన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పేర్నమిట్ట ఒంగోలు సమీపంలోని పీర్లమాన్యం తదితర ప్రాంతాలలో ఇతర జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ జీవిస్తున్న వారిని విచారిస్తే ఏమైనా వాస్తవాలు బయటకు రావచ్చనే కోణంలోనూ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. మృతుల ఆచూకీ కోసం గ్రామాల్లో విచారిస్తున్న పోలీసులు నిందితుడి నేరప్రవృత్తిపై సందేహాలు.. జరిగిన ఘటనపై మీడియాలో ఫొటోలతో సహా వార్తలు వచ్చాయి. అయినా పోలీసులకు కనీస సమాచారం అందలేదు. మృతురాలు ధరించిన చెప్పులు, దుస్తుల ఆధారంగా ఆమె ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళ అయి ఉండవచ్చనే భావన వ్యక్తమవుతోంది. బైకు మీద వచ్చిన ఇద్దరు దంపతులే అయితే నిర్మానుష్య ప్రాంతంలోకి ఆమె ఎందుకొచ్చిందనే అంశం అనుమానాలకు తావిస్తోంది. త్రోవగుంట నుంచి దగ్గర దారి అని నమ్మించి చీమకుర్తి వైపు తీసుకువెళ్లేందుకు నిందితుడు ప్రయత్నం చేసి ఉండొచ్చని భావించి గ్రానైట్ ఫ్యాక్టరీలలో పనిచేసే ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు, ఫ్యాక్టరీ యజమానులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా మిస్సింగ్ కేసు నమోదైనా లేక ఫిర్యాదు వచ్చినా తక్షణమే తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బుధవారం రాత్రి తన చాంబరులో దర్యాప్తు అధికారులకు సూచించారు. నిందితుడు పెట్రోలు సీసా, కత్తి వెంట తీసుకొచ్చాడు. బండరాయితో మహిళను హతమార్చాడు. కత్తితో చిన్నారి గొంతు కోశాడు. ఇద్దరిపై పెట్రోలు పోసి తగులబెట్టాడు. ఈ అంశాలను పరిశీలిస్తే నిందితుడు తీవ్రమైన నేరప్రవృత్తి గలవాడనే సందేహాలు కలుగుతున్నాయి. పోస్టర్లతో ఆరా.. తల్లిని దారుణంగా కొట్టి చంపి, పసిబిడ్డ గొంతు కోసి హతమార్చిన దారుణ ఘటనకు ఆనవాళ్లు గురిస్తే పోలీసుశాఖకు తెలియజేసి దర్యాప్తుకు సహకరించాలని జిల్లా ఎస్పీ సిద్థార్థ కౌశల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఆనవాళ్లను తెలిపే బ్రోచర్‌ను ఆయన బుధవారం రాత్రి విడుదల చేశారు. మృతుల ఆనవాళ్లు గుర్తిస్తే ఒంగోలు డీఎస్పీ 9121102120, రూరల్ సీఐ 9121102130, మద్దిపాడు ఎస్సై 9121102133 నంబర్లకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. మహిళ ఆనవాళ్లు.. 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు మహిళ ఎత్తు సుమారు 5అడుగులు, చామనచాయ రంగులో ఉంటుంది. గులాబీరంగు పంజాబీ డ్రస్సు, దానిపై తెలుపురంగులో ఎంబ్రాయిడరీ పువ్వు డిజైన్ ఉంది. లెగ్గిన్, చున్నీ తెలుపురంగులో ఉండి కాలిపోయాయి. మెడలో ఉన్న నైలాన్ పసుపు తాడులో నల్లపూసలు, ఒక ఎర్రపూస ఉన్నాయి. తాడు కాలిపోయింది. రెండు కాలివేళ్లకు రెండు జతల మెట్టెలున్నాయి. రెండు కాళ్లకు గులాబీరంగు గూడ చెప్పులు ఉన్నాయి. చంటిబిడ్డ ఆనవాళ్లు.. బిడ్డ వయస్సు 6 నెలల నుంచి ఏడాది ఉండవచ్చు. 2.25 అడుగుల ఎత్తు, చామన చాయగా ఉంటుంది. గులాబీరంగు డ్రాయర్, తెలుపు గోధుమరంగు అడ్డ నిలువు గీతల బనియన్ ధరించి ఉంది. రెండు కాళ్లకు నల్లని మొలతాడు కట్టి ఉంది. -
ఎన్ని ఆరోపణలు వచ్చినా..నిర్లక్ష్యపు రోగం
సాక్షి, నంద్యాల : నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అత్యాధునిక పరికరాలు ఉన్నా..చికిత్స అందనంత దూరంలో ఉంటోంది. సరైన సమయానికి వైద్యులు రాక గర్భిణులు క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. గుండెకు సంబంధించిన ఈసీజీ పరీక్ష కేంద్రం వద్ద రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఫిజియోథెరపీ వార్డును మూసివేసి తలుపులు తెరవడం లేదు. నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి ప్రతి రోజు 1200 మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ఆసుపత్రిలో మొత్తం 300 పడకలు ఉన్నాయి. ఇన్ పేషంట్లు పెరగటంతో 350 పడకలపై చికిత్స అందిస్తున్నారు. అత్యవసర కేసులు వస్తే అత్యాధునిక పరికరాలు లేవంటూ ఎక్కువగా కర్నూలుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.1.8 కోట్లతో నూతనంగా 20 పడకల ఐసీయూ ఏర్పాటు చేశారు. ఐసీయూ ఏర్పాటు చేసినా అత్యవసర కేసులు మాత్రం కర్నూలుకు తరలించటం ఆనవాయితీగా వస్తోంది. రూ.6 కోట్లతో ఎమ్మారై స్కానింగ్ ఉన్నా.. బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మేల్, ఫిమేల్ వార్డుల్లో 60 మందికి ఒకే స్టాఫ్ నర్సు ఉండటంతో రోగులకు సరైన సమయంలో చికిత్స అందడంలేదు. గాలిలో దీపంలా మాతా శిశు సంరక్షణ మాతా శిశు మరణాలు తగ్గించడం కోసం మాతా శిశువైద్యశాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రతిరోజు 10 నుంచి 12 ప్రసవాలు జరుగుతుంటాయి. వైద్యుల నిర్లక్ష్యంతో కొంత కాలంగా గర్భిణులు, శిశువులు మృత్యువాత పడుతున్నారు. కాన్పుకోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణుల పట్ల ఆసుపత్రి సిబ్బంది దురుసుగా ప్రవరిస్తున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. జూన్ నెలలో వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. సిబ్బంది తీరులో ఎటువంటి మార్పులేదు. నీటి కోసం ఇక్కట్లు.. ఆసుపత్రిలో రోగులు వారి సహాయకులకు మొత్తం కలిపి దాదాపు 2 లక్షల లీటర్ల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం 70 వేల లీటర్లు మాత్రమే ఆసుపత్రి వర్గాలు అందిస్తున్నాయి. ఆసుపత్రికి ప్రత్యేకంగా పైప్‌లైన్ నిర్మాణం కోసం మున్సిపాలిటీకి రూ.1.53 లక్షలు చెల్లించినా ఫలితం లేకుండా పోయింది. డయాలసిస్ రోగులకు చికిత్స కోసం ప్రతిరోజు 6 వేల లీటర్ల మినరల్ వాటర్ అవసరం. నీటి కొరత ఉండటంతో బయటి నుంచి మినరల్ వాటర్ కొనుగోలు చేస్తూ రూ.3 వేలు ప్రతి రోజూ ఖర్చు చేస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు క్యూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పీపీ యూనిట్ వైద్యుల తీరుతో గర్భవతులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు వచ్చే బాలింతలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రతి గురువారం పరీక్షల కోసం గర్భిణులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం మూడు నెలల నుంచి ప్రదక్షిణలు చేస్తున్నా వైద్యులు పట్టించుకోవటం లేదని బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నెలకు 70 నుంచి 80 కు.ని. ఆపరేషన్లు చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో 20 ఆపరేషన్లు మాత్రమే చేస్తున్నారు. గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది ఉదయం 9 గంటల నుంచి ఆసుపత్రిలోనే ఉన్నా. వైద్యుల కోసం గంటకుపైగా ఎదురుచూస్తున్నా రాలేదు. ప్రతి నెలా ఇలాగే ఉంది. నాతో పాటు 20 మంది గర్భిణులు వైద్యులకోసమే వేచి చూస్తున్నారు. వారు ఎప్పుడొస్తారాని సిబ్బందిని అడిగితే సరైన సమాధానం ఇవ్వడం లేదు. – హసీనా, అయ్యలూరు -
కాన్పు సమయంలో తల్లీబిడ్డ మృతి
కనిగిరి: కాన్పు సమయంలో వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి, బిడ్డ మరణించారంటూ కనిగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద మృతుల బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే మండలంలోని చాకిరాలకు చెందిన ఎమేలమ్మ (25) నిండు గర్భిణి. మొదటి కాన్పునకు పట్టణంలోని పామూరు బస్టాండ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు నార్మల్ డెలివరీ కోసం 24వ తేదీ నుంచి ఆస్పత్రిలోనే ఉంచి వేచి చూశారు. అయితే 26వ తేదీ శుక్రవారం అత్యవసర ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కానీ ఆపరేషన్ సమయంలో బాలింత, శిశువు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందంటూ ఎమేలమ్మ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పక్కనే ఉన్న వైద్యుని కారు అద్దాలు ధ్వంసం చేశారు. సంఘటనా స్థలం వద్దకు పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. అయితే పెద్ద మనుషుల జోక్యంతో ఇరువర్గాలు రాజీ పడినట్లు సమాచారం. ఈ మేరకు మృతదేహాన్ని బాధితులు ఇంటికి తీసుకెళ్లారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. వైద్యుల వైఫల్యమే కారణం: వైద్యుల వైఫల్యం వల్లనే తన కూతురు ఎమేలమ్మ, శిశువు మృతి చెందారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. ఆపరేషన్ ఫెయిల్ అవడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని వారు ఆరోపించారు. తల్లీబిడ్డ చనిపోయిన తర్వాత కూడా సీరియస్‌గా ఉందంటూ ఒంగోలుకు తరలించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వైద్యులు ఏమంటున్నారంటే.. దీనిపై డాక్టర్ మాట్లాడుతూ ప్రసవ సమయం దాటిన మూడు రోజుల తర్వాత ఎమేలమ్మను తన ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆపరేషన్ చేస్తేనే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని చేర్చుకునే రోజే మృతురాలి తల్లిదండ్రులకు చెప్పామన్నారు. కానీ వారు వినకుండా ఆపరేషన్ లేకుండా ప్రసవం చేయాలని పట్టుపట్టారన్నారు. 25వ తేదీ మధ్యాహ్నం పరిస్థితి బాగా లేదని ఆపరేషన్ చేయించుకోవాలని లేకుంటే ఎక్కడికైనా తీసుకెళ్లాలని చెప్పామన్నారు. అయినా వారు వినకుండా దేవుడిపై మాకు నమ్మకం ఉంది. నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి ఆస్పత్రిలోనే ఉంచారన్నారు. 26వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున ఉమ్మనీరు పోయి పరిస్థితి తీవ్రం కావడంతో.. వారి తల్లిదండ్రులను ఒప్పించి ఆపరేషన్ «థియేటర్‌కు తీసుకెళ్లామని, ఆ సమయంలో హార్ట్ కంప్లెంట్ వచ్చి, కోమాలోకి వెళ్లి బాలింత, శిశువు చనిపోయారని తెలిపారు. -
మాతా మన్నించు!
జిల్లాలో ప్రసవ సమయంలో మాతృ మరణాలు తగ్గడం లేదు. వైద్యులు, సిబ్బందితో పాటు పర్యవేక్షణాధికారుల కొరత, వసతుల లేమి, కొన్ని చోట్ల వైద్యుల నిర్లక్ష్యంతో ఈ మరణాల శాతం పెరుగుతోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణిలకు వైద్యపరీక్షలు మృగ్యమయ్యాయి. వారిని పట్టించుకునే దిక్కులేదు. ఆదోని డివిజన్లో చాలా చోట్ల ఇప్పటికీ ఇంటి వద్దే ప్రసవాలు జరుగుతున్నా స్థానిక వైద్యాధికారులు ఆ విషయాన్ని కప్పి పుచ్చుతున్నారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 20 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 20 అర్బన్‌హెల్త్ సెంటర్లు(ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు), ఒక జిల్లా ఆసుపత్రి (నంద్యాల), ఎమ్మిగనూరు, ఆదోనిలలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. వీటితో పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు 4 నుంచి 10 ప్రసవాలు జరుగుతుండగా, సీహెచ్‌సీల్లో 10 నుంచి 20లోపు, ఏరియా ఆసుపత్రుల్లో 30 నుంచి 60 ప్రసవాలు నిర్వహిస్తున్నారు. అధికంగా నంద్యాల, ఆదోని ఆసుపత్రుల్లో నెలకు 150 నుంచి 250 వరకు ప్రసవాలు జరుగుతుండగా ఒక్క కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనే ప్రతి నెలా వెయ్యికి పైగా ప్రసవాలు జరుగుతుండటం గమనార్హం. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో గర్భిణికి ఏ మాత్రం చిన్న సమస్య వచ్చినా వెంటనే కర్నూలుకు రెఫర్ చేస్తున్నారు. వీటికి తోడు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏదైనా సమస్య వస్తే పెద్దాసుపత్రికే రెఫర్ చేస్తున్నారు. చివరి సమయంలో చికిత్సకు వస్తుండటంతో ఇక్కడి వైద్యులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. ఫలితంగా ఈ ఆసుపత్రిలో మాతృమరణాల సంఖ్య అధికంగా కనిపిస్తోంది. గత జనవరి నుంచి ఇప్పటి వరకు 12 మంది మరణించినట్లు సమాచారం. గత నెలరోజుల వ్యవధిలోనే నలుగురు గర్భిణిలు ప్రసవ సమయంలో మరణించినట్లు తెలిసింది. పెద్దాసుపత్రిలోనూ సమస్యలు అధికం పెద్దాసుపత్రిలోని గైనకాలజీ విభాగంలో ఏడు యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌కు ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల చొప్పున 42 మంది వైద్యులు ఉండాలి. ఇందులో మూడు ప్రొఫెసర్ పోస్టులు, మూడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరో ముగ్గురు వైద్యులు ఇక్కడకు రాకుండానే సెలవు పెట్టి వెళ్లిపోయారు. కొత్తగా మంజూరైన మూడు యూనిట్లకు నర్సులు, పారామెడికల్ సిబ్బందిని, నాల్గవ తరగతి సిబ్బందిని నియమించలేదు. ఈ మేరకు పడకల సంఖ్యను, బడ్జెట్‌ను, మందులు, సర్జికల్ను పెంచలేదు. ఈ విభాగంలో అధికారికంగా 210 పడకలు ఉండగా, అనధికారికంగా రోగుల రద్దీ దృష్ట్యా మరో 150 పడకలు అదనంగా ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ 30 నుంచి 35 ప్రసవాలు జరుగుతున్నా వారికి అవసరమైన మందులు అందుబాటులో లేవు. ప్రస్తుతం డెలివరి కిట్స్ సైతం గర్భిణిల కుటుంబీకులే కొని తెచ్చుకోవాల్సి వస్తోంది. గైనిక్ విభాగంలో గర్భిణికి ఏదైనా సీరియస్‌గా మారితే అరకిలోమీటర్ దూరంలో ఉన్న క్యాజువాలిటీకి తీసుకెళ్లాల్సి వస్తోంది. అలాగాకుండా గైనిక్ విభాగంలోనే అవసరమైన వైద్యులు, సిబ్బందితో ఐసీయూ ఏర్పాటు చేయాలని వైద్యులు కోరుతున్నారు. గర్భిణిల్లో సగం మందికి రక్తహీనత పెద్దాసుపత్రికి వస్తున్న గర్భిణిల్లో సగం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రసవ సమయంలోనూ అధిక శాతం మందికి హెచ్‌బీ శాతం 8లోపే ఉంటోంది. క్షేత్రస్తాయిలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడం, అవసరమైన పరీక్షలు చేయకపోవడం, ఇంటింటికి తిరిగి గర్భిణిల యోగక్షేమాలు చూడాల్సిన ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు తప్పుడు లెక్కలు చూపడం వంటి కారణాలతో వాస్తవాలు బయటకు రావడం లేదు. అధికారులు మాత్రం జిల్లాలో మాతాశిశుమరణాలు గణనీయంగా తగ్గించినట్లు ప్రభుత్వానికి నివేదికలు పంపించి కితాబులు తీసుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాతృ మరణాలకు కొన్ని కారణాలు కర్నూలుతో పాటు ఆదోని, నంద్యాల ఆసుపత్రుల్లో వైద్యులు, పారామెడికల్, స్టాఫ్‌నర్సుల కొరత తీవ్రంగా ఉంది. దీనికితోడు వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, విధులకు డుమ్మా కొట్టడం పరిపాటిగా మారింది. అధిక శాతం రౌండ్ ది క్లాక్ పీహెచ్‌సీల్లో రాత్రి వేళల్లో వైద్యులు, స్టాఫ్‌నర్సులు సైతం ఉండటం లేదు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి లాంటి చోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాత పీజీలు, హౌస్సర్జన్లే పెద్దదిక్కుగా మారుతున్నారు. డ్యూటీలో ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్లు చాలా మంది సీరియస్ కేసు ఉంటే ఫోన్‌కాల్‌తో మాత్రమే విధులకు వస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. గర్భిణìలు రెగ్యులర్‌గా చెకప్ చేయించుకోకపోవడం, వైద్యుల సూచనలు పాటించకపోవడం, పోషకాహారలోపం వంటి కారణాలు మాతా మరణాలు పెరగడానికి కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఎమ్మిగనూరు మండలం కనకవీడు గ్రామానికి చెందిన మిథియాకు ముగితి గ్రామానికి చెందిన అనోక్లకు ఏడాది క్రితం వివాహమైంది. మిథియా గర్భం దాల్చి గురువారం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా అక్కడి వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ప్రసవం చేశారు. అయితే, అదే రోజు సాయంత్రం ఆమెకు ఆయాసం అధికం కావడం, బ్లడ్ ప్రెషర్లో సమస్యలు రావడంతో వెంటనే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. శుక్రవారం ఆమె చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించింది. సిజేరియన్ ఆపరేషన్ సమయానికి ఆమె హెచ్‌బీ శాతం 8గా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆమెను క్షేత్రస్థాయిలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశాలు ఎందుకు పట్టించుకోలేకపోయారో ఉన్నతాధికారులే చెప్పాలి. లేకపోతే ఎప్పటిలాగానే సాకులు చెబుతారో చూడాలి మరి. -
మాతృత్వం కోసం గిరి మహిళ.. అమ్మా అనే పిలుపు వినకుండానే
మాతృత్వం కోసం ఆ తల్లి ఎంతో పరితపించింది. నాలుగు సార్లు గర్భం దాల్చగా రెండు సార్లు అబార్షన్ అయింది. మూడో సారి బిడ్డపుట్టి చనిపోయింది. నాల్గో సారి గర్భం దాల్చడంతో ఎన్నో కలలుకంది. తనకు పుట్టబోయే బిడ్డకోసం ఎన్నో ఊహించుకుంది. బోసి నవ్వులు చూడాలని పరితపించింది. తన చేయి పట్టుకుని బిడ్డ బుడిబుడి అడుగులు వేస్తుంటే అడుగులో అడుగు కలిపి మళ్లీ నడకనేర్చుకోవాలని ఆశపడింది. అమ్మా అనే మాటను చెవులారా వినాలని ఎదురుచూసింది . అయితే ఆమె ఆశను పురిటిలోనే తుంచేసింది మృత్యుదేవత. అమ్మా అనే పిలుపునకు నోచుకోకుండానే ఆ ఆభాగ్యురాలు మృత్యువాత పడింది. కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ కురుకూరుకు చెందిన ఓ బాలింత ఆడ బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది. మరిది పెళ్లి సమయంలో ఈ విధంగా జరగడంతో ఆ ఇంట విషాదం నెలకొంది. కొయ్యూరు(పాడేరు): మండలంలో బూదరాళ్ల పంచాయతీ కునుకూరుకులో ఏడో నెలలో ఆడబిడ్డను ప్రసవించిన జర్త పద్మ(29) అనే బాలింత ప్రసవ సమయంలో కన్నుమూయడంతో గ్రామంలో విషాదం అలముకుంది. ఇది వరకు మూడుసార్లు గర్భం దాల్చిన ఆమెకు రెండుసార్లు అబార్షన్ అయింది. మరోసారి బిడ్డ పుట్టి మరణించింది.నాల్గో ప్రసవంలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చి మరణించింది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి మృతురాలి మరిదికి వివాహం జరిగింది. దీంతో తీరిక లేకుండా పెళ్లి పనులు చేసింది. ఆదివారం తెల్ల్లవారు జాము వరకు పనిచేసింది. తరువాత ఆమెకు తీవ్రమైన తలనొప్పి వచ్చింది. అనంతరం ప్రసవ నొప్పులు రావడంతో ఇంటి వెనుకకు వెళ్లింది. అక్కడ ఎవరి సహాయం లేకుండానే ఆడబిడ్డను ప్రసవించింది. ఆమెకు ప్రసవం జరిగిన విషయం ఎవరికీ తెలియలేదు. చివరకు బిడ్డ ఏడుపు గమనించిన ఆమె నాన్నమ్మ వెళ్లి చూడగా తల్లీబిడ్డ పక్క పన్కనే ఉన్నారు. బంధువులంతా ఆమెను బిడ్డతో సహా ఇంటిలోకి తీసుకువచ్చారు. అలా తీసుకువచ్చిన కొద్దిసేపటికే పద్మ మరణించింది.బిడ్డ క్షేమంగా ఉంది. పద్మ మరణించడంతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. అంతవరకూ ఎంతో హుషారుగా తిరిగిన ఆమె అంతలోనే మృత్యువాత పడడాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు తట్టుకోలేకపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పద్మ మృతి సమాచారం తెలుసుకున్న వైద్యాధికారి శ్యామల సోమవారం కునుకూరు వెళ్లారు. వివరాలు తెలుసుకున్నారు. నెలలు నిండక ముందు ప్రసవం జరగడం, మేనరికపు వివాహం వల్లే ఈ విధంగా జరిగిందని ఆమె తెలిపారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మన్యంలో మాతా శిశు మరణాలు ఆగకపోవడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. -
శిశు సురక్ష..వినియోగంలో వివక్ష
కర్నూలు(హాస్పిటల్): మాతాశిశు మరణాలు తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. వాటి ద్వారా నిధులు కూడా భారీగానే ఇస్తోంది. అయితే..క్షేత్రస్థాయిలో నిధుల వినియోగంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. జననీ శిశు సురక్ష కార్యక్రమం (జేఎస్ఎస్కే) కింద ప్రభుత్వాసుపత్రులకు విడుదల చేసిన నిధులను ఏమాత్రమూ ఖర్చు చేయడం లేదు. ఇవి మూలుగుతున్నా అధికారులు పట్టించుకోకుండా..ప్రసవాలకు వస్తున్న వారితోనే చేతి నుంచి ఖర్చు చేయిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉండేందుకు జననీ శిశు సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీని కింద ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టించకుండా చికిత్స అందించాలి. ఆసుపత్రికి రాను, పోను చార్జీలతో పాటు చికిత్సకు అవసరమయ్యే మందులు, వైద్యపరీక్షలు, రక్తనిధుల నుంచి తెచ్చే రక్తానికి సైతం జేఎస్ఎస్కే నిధులను ఖర్చు చేయాలి. ఈ మేరకు జిల్లాలోని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు నంద్యాలలోని జిల్లా ఆసుపత్రి, ఆదోనిలోని మాతాశిశు కేంద్రం, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 83 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోంది. జిల్లాలో అన్ని ఆసుపత్రులకు కలిపి రూ.1.50 కోట్లు విడుదల చేస్తోంది. కానీ ఈ నిధులను జిల్లాలోని అధిక శాతం ఆసుపత్రులు ఖర్చు చేయడం లేదు. ఇలాంటి నిధులు ఉన్నాయని కొంత మంది వైద్యాధికారులకు కూడా అవగాహన లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నంద్యాల జిల్లా ఆసుపత్రితో పాటు ఆదోని ఏరియా ఆసుపత్రి, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం ఈ పథకం పూర్తిగా అమలు కావడం లేదు. ప్రసవానికి రూ.5 వేల దాకా ఖర్చు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా ప్రసవాలు చేస్తామని అధికారులు ఊదరగొడుతుంటారు. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంటోంది. జిల్లాలోని 70 శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు ఒకటి నుంచి ఐదులోపే ప్రసవాలు జరుగుతున్నాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోనూ గైనకాలజిస్టులు, పీడియాట్రిస్ట్‌లు లేకపోవడంతో సిజేరియన్ అవసరమైతే నంద్యాల, కర్నూలు, ఆదోనిలకు రెఫర్ చేస్తున్నారు. ఫలితంగా అత్యధిక ప్రసవాలు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, ఆ తర్వాత నంద్యాల, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే జరుగుతున్నాయి. ప్రతి గర్భిణి ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లడానికి 108, ఆ తర్వాత ఆసుపత్రిలో ఉచితంగా ప్రసవం, ఇంటికి వెళ్లేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహన సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆసుపత్రిలో ప్రసవాలు మాత్రం ఉచితంగా జరగడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమై డిశ్చార్జ్ అయ్యే సమయానికి ఒక్కొక్కరు మందులు, రక్తం, వ్యాధినిర్ధారణ పరీక్షల పేరిట రూ.3 వేల నుంచి రూ.5వేల దాకా ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. ప్రసవాలకు అవసరమైన మందులు, వైద్యపరీక్షలు అన్నీ ఆసుపత్రిలోనే ఉచితంగా నిర్వహించాల్సి ఉన్నా.. అత్యవసరం పేరుతో బయటకు పంపి ఖర్చు చేయిస్తున్నారు. ఇలా ఖర్చు చేసిన మొత్తాన్ని రోగులకు వెనక్కివ్వడం లేదు. ఇప్పుడు వైద్యసేవ పేరుతో.. జననీ శిశు సురక్ష కార్యక్రమం అమలులో పూర్తిగా చేతులెత్తేసిన అధికారులు, వైద్యులు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) ద్వారా ఈ నెల ఒకటో తేదీ నుంచి ఉచితంగా ప్రసవాలు చేస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నారు. ఇప్పటికే పలు వ్యా«ధులకు ఆసుపత్రిలో ఈ పథకం అమలులో ఉన్నా.. ప్రతి రోగి డిశ్చార్జ్ అయ్యే సమయానికి రూ.5వేల నుంచి రూ.20వేల దాకా ఖర్చు చేస్తున్నారు. ఇలా ఖర్చు పెట్టిన మొత్తంలో 10 శాతం మాత్రమే వెనక్కి ఇస్తున్నారు. అయితే.. పథకం ద్వారా వచ్చే ప్రోత్సాహక నగదును మాత్రం అధికారులు, వైద్యులు, ఉద్యోగులు లెక్క తప్పకుండా పంచుకుంటున్నారు. ప్రసవాలకు సైతం ఎన్టీఆర్ వైద్యసేవ ఇదే రీతిన కొనసాగే అవకాశం ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి ప్రసవాలకు వచ్చిన వారికి ఉచితంగా వైద్యం అందించాలని గర్భిణులు, వారి కుటుంబీకులు కోరుతున్నారు. -
మన్యంలో మృత్యుఘోష!
మన్యసీమ మృత్యు సీమగా మారింది. ఏ పల్లె చూసినా, ఏ ఇల్లు చూసినా ఏదో విషాదంతో ముడిపడే ఉంటోంది. ఈ లోకంలోకి కన్ను తెరిచేలోగా కొందరు.. తెరిచాక మరికొందరు చిన్నారులు కన్ను మూస్తున్నారు. అమ్మ పొత్తిళ్లలోనే అసువులు బాస్తున్న శిశువులు.. వారిని చూడకుండానే తనువు చాలిస్తున్న తల్లులు విశాఖ మన్యంలో కోకొల్లలు.. ఇలా గడచిన ఐదున్నరేళ్లలో విశాఖ ఏజెన్సీలో 2,210 మంది నవజాత శిశువులు, 150 మంది గర్భిణులు, బాలింతలు మృత్యువాత పడటం అక్కడ దయనీయ పరిస్థితికి దర్పణం పడుతోంది. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ బారినపడి ఏటా వందల సంఖ్యలో గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. సాక్షి, విశాఖపట్నం/పాడేరు: వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం విశాఖ ఏజెన్సీలోని 3,574 గ్రామాల్లో 6,04,047 మంది గిరిజన జనాభా ఉంది. వీరికి వైద్య సేవలందించేందుకు పాడేరు, అరకుల్లో ఏరియా ఆస్పత్రులు, 36 పీహెచ్‌సీలు, 199 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. అయితే వీటిలో పూర్తి స్థాయిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది లేకపోవడంతో గిరిజనులకు అరకొర వైద్యమే అందుతోంది. మంజూరైన పోస్టుల్లో 10 శాతానికి మంచి రెగ్యులర్ వైద్యులు, సిబ్బంది లేరు. దీంతో ప్రభుత్వం ఆ ఖాళీల్లో కాంట్రాక్టు వైద్యులు, సిబ్బందిని నియమించి కాలక్షేపం చేస్తోంది. ఈ ఏరియా ఆస్పత్రులకు పీహెచ్‌సీల మాదిరిగా ఒక్కో అంబులెన్స్ మాత్రమే ఉంది. దీంతో అత్యవసర రోగుల తరలింపులో జాప్యం జరిగి ప్రాణ నష్టం వాటిల్లుతోంది. మారుమూల గ్రామాల నుంచి వైద్యం కోసం కేజీహెచ్‌కు వెళ్లేందుకు గిరిజనులు చాలా వ్యయప్రయాసలకు లోనవుతున్నారు. రవాణా సేవలు విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. కొండకోనల్లో రోగులను కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రులకు తరలించేందుకు ఇప్పటికీ డోలీ మోతే శరణ్యమవుతోంది. చాలా గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు అందుబాటులో లేవు. దీనివల్ల గిరిజనులకు గెడ్డ నీరే గతి అవుతోంది. ఫలితంగా టైఫాయిడ్, డయేరియా, చర్మవ్యాధులకు గురవుతున్నారు. పీహెచ్‌సీలను అప్‌గ్రేడ్ చేసినా.. 2018 జనవరి నుంచి ఏజెన్సీలోని 36 పీహెచ్‌సీలను 24–7 ఆస్పత్రులుగా ప్రభుత్వం మార్పు చేసింది. వీటిలో చాలా పీహెచ్‌సీలు మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పీహెచ్‌సీల చెంతన డాక్టర్లు, వైద్య సిబ్బందికి నివాస గృహాలు లేవు. దీంతో నామమాత్రంగానే ఈ ఆస్పత్రులు పనిచేస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలోని పాడేరు కేంద్రం గా జిల్లా మలేరియా శాఖతో పాటు అదనపు వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయాలు ఉన్నాయి. వీటికి జిల్లా మలేరియా అధికారి, జిల్లా అదనపు వైద్యాధికారిని కూడా నియమించారు. కానీ ఏజెన్సీలో వైద్య సేవల పర్యవేక్షణకు వీరికి వాహనాల్లేవు. పాడేరులో మలేరియా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు 2014లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. పిట్టల్లా రాలిపోతున్నా.. మారుమూల గిరిజన గ్రామాల్లో వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ప్రసవ వేదనకు గురవుతున్న గర్భిణులు తీవ్ర నరకయాతను ఎదుర్కొంటున్నారు. కొన్నిసార్లు పరిస్థితి విషమంగా ఉన్న సమయాల్లో నెలలు నిండని గర్భిణులను చివరి నిమిషాల్లో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ఐదున్నరేళ్ల వ్యవధిలో ఏజెన్సీలో 2210 మంది నవజాత శిశువులు, మరో 155 మంది గర్భిణులు, బాలింతలు మృతి చెందారు. ఈ ఏడాది మే నుంచి జూలై వరకు డెంగ్యూ లక్షణాలతో 8 మంది చనిపోయారు. కానీ వైద్య ఆరోగ్యశాఖ ఒక్కటి కూడా నమోదు చేయడం లేదు. వైద్యనిపుణులులేకపోవడమూ శాపమే.. ఏజెన్సీ వ్యాప్తంగా పీహెచ్‌సీలు, ప్రాంతీయ ఆస్పత్రుల్లోనూ నేటికీ పూర్తి స్థాయి వైద్య నిపుణులు (గైనకాలజిస్టు, పిల్లలు, మత్తు వైద్య నిపుణులు) లేకపోవడంతో శాపంగా మారింది. ఏజెన్సీ 11 మండలాలకు సంబంధించి ఒక వంద పడకల ఆస్పత్రి, ఒక ఏరియా ఆస్పత్రి, రెండు సామాజిక ఆస్పత్రులు, 36 పీహెచ్‌సీల పరిధిలో 202 సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు పాడేరు, అరకు, చింతపల్లి, జి.మాడుగుల, హుకుంపేట మండలాల్లో ప్రసూతి కేంద్రాలు, పాడేరులో ఒక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలున్నాయి. గర్భిణులు, బాలింతలతో పాటు మిగిలిన గిరిజనులు వైద్య చికిత్సల కోసం ఆయా ఆస్పత్రులకు వస్తారు. -
ఆగని హాహాకారాలు !
సాక్షి, గుంటూరు : ఆధునిక వైద్యం, శస్త్ర చికిత్సలు అందుబాటులోకి వచ్చినప్పటికీ మాతాశిశు మరణాలను నియంత్రించలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల అవగాహనారాహిత్యం, పౌష్టికాహారలోపం కలగలిపి మాతాశిశువుల ప్రాణాలకు ముప్పుతెస్తున్నాయి. వైద్య, స్త్రీ శిశు సంక్షేమ శాఖలు మాతాశిశు మరణాల రేటు తగ్గించేందుకు అమలు చేస్తున్న పథకాలు గ్రామీణ ప్రాంతాల దరి చేరడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రులు ఉన్నా వైద్యులు లేకపోవడం, ఆరోగ్య కార్యకర్తల చిత్తశుద్ధిలోపం తదితర కారణాల వల్ల గర్భిణులు, పుట్టినబిడ్డలకు సరైన వైద్యరక్షణ లభించడం లేదు. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది కొరతతో గర్భిణులకు వైద్యసేవలు సక్రమంగా అందడం లేదు. పుట్టిన బిడ్డ ఆరోగ్యం గా ఎదగడానికి ప్రభుత్వం చేపట్టిన వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం ఆచరణలో సరిగ్గా అమలు కావడం లేదు. మాతాశిశు మరణాల సంఖ్య అధికంగా ఉందని, తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఇటీవల విజయవాడలో కలెక్టర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబా బునాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రక్తహీనత వల్లే అధిక మరణాలు.. నాలుగేళ్లుగా జిల్లాలో జరిగిన మాతాశిశు మరణాలను పరిశీలిస్తే ఎక్కువమంది మహిళలు రక్తహీనతతో ప్రసవ సమయంలో మృతి చెందుతున్నట్లు ప్రభుత్వ డెత్ఆడిట్లో నమోదైంది. వాస్తవానికి జిల్లాలో మాతాశిశు మరణాలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖకు మాత్రం ఆ సమాచారం అందడం లేదు. మాతాశిశు మరణాల వివరాలను వైద్య,ఆరోగ్యశాఖకు నివేదిస్తే, సవాలక్ష విచారణలను ఎదుర్కొనవలసి వస్తోందని, సంజాయిషీలు చెప్పుకోవాల్సి ఉందనే భయంతో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది మృతుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. వాస్తవానికి ఈ సమాచారం జిల్లా ఉన్నతాధికారులకు అందినప్పుడే అందుకు అనుగుణ ంగా చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. మరణాలకు కారణాల్ని అన్వేషించి భవిష్య త్లో అటువంటివి తలెత్తకుండా జాగ్రత్త పడగలరు. క్షేత్రస్థాయిలో ఈ సమాచారం ప్రభుత్వ వైద్యసిబ్బంది చెప్పడం లేదనే కారణంతోనే ఆశ కార్యకర్తలను ఏర్పాటుచేసి సమాచారమిచ్చిన వారికి రూ. 50 చొప్పున పారితోషికం అందిస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. మరణాలు ఇలా... 2005-06లో శిశుమరణాలు 1027, మాతృమరణాలు 49. 2009-10లో శిశుమరణాలు అత్యధికంగా 1,710, మాతృమరణాలు 49. 2010-11లో శిశుమరణాలు 1299, మాతృమరణాలు 61 నమోదయ్యాయి. ఈ రెండేళ్లలో పరిశీలిస్తే జిల్లావ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 2013-14 సంవత్సరంలో 783 శిశు మరణాలు, 81 మాతృ మరణాలు జరగగా, 2014 డిసెంబర్ నెల వరకు 506 శిశు మరణాలు, 56 మాతృ మరణాలు నమోదయ్యాయి. అనధికారికంగా మృతుల సంఖ్య ఎక్కువే ఉన్నట్టు తెలుస్తోంది. తూతూ మంత్రంగా సమీక్షలు.. మాతా శిశుమరణాల రేటును తగ్గించేందుకు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నా క్షేత్ర స్థాయిలో ఫలితాలు మాత్రం ఆశించినంతగా లేకపోవడం గమనార్హం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో లేకపోవడమనే సమస్యపై జిల్లా అధికారులు చిత్తశుద్ధితో దృష్టి సారించడం లేదు. జననీ సురక్షయోజన, అంగన్వాడీ పథకం ద్వారా పోషకాహారం అందజేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. -
మాతాశిశు మరణాలను తగ్గించాలి
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : మాతాశిశు మరణాలను తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ సిస్టమ్ స్ట్రెంథింగ్ రాష్ట్ర టీం లీడర్ డేవిడ్ దమారా అన్నారు. బుధవారం ఆదిలాబాద్‌లోని టీటీడీసీలో అంగన్వాడీ సూపర్వైజర్లు, సీడీపీవోలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్ వాడీ కేంద్రాలను పటిష్టం చేయాలన్నారు. పరిస్థితిపై రోజూ ఆన్లైన్ రిపోర్టు పంపాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ప్రజలకు పోషక విలువలు, పరిశుభ్రతపై వివరించాలన్నారు. పిల్లలకు ఆటాపాటాలు నేర్పించాలన్నారు. బాలింతలు పిల్లలకు ఆరు నెలలపాటు ముర్రుపాలు తాగించేలా చూడాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ సిస్టమ్ స్ట్రెంథింగ్ రీజినల్ మేనేజర్ నర్సింహామూర్తి, సీడీపీవోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.