వీడని మిస్టరీ..! | Mother And Child Death Case Mystery Still Pending in Prakasam | Sakshi
Sakshi News home page

వీడని మిస్టరీ..!

Published Thu, Dec 5 2019 12:44 PM | Last Updated on Thu, Dec 5 2019 12:44 PM

Mother And Child Death Case Mystery Still Pending in Prakasam - Sakshi

మృతుల వివరాలు తెలుసుకునేందుకు బుధవారం పోలీసులు విడుదల చేసిన పోస్టర్‌

ఒంగోలు/మద్దిపాడు:తల్లీబిడ్డ హత్యకేసు మిస్టరీ వీడలేదు. రెండు రోజులు గడిచినా మృతుల వివరాలు తెలియరాలేదు. మద్దిపాడు మండలం మారెళ్లకుంటపాలెం సమీప పొలాల్లో మంగళవారం రాత్రి తల్లీబిడ్డను హతమార్చి, పెట్రోలుపోసి దహనం చేసిన ఘటన సంచలనం కలిగించిన విషయం విధితమే. ఈ ఘటనలో మృతుల వివరాలు తెలిస్తేనే హంతకుడు దొరికే అవకాశం ఉందని భావించిన పోలీసులు మృతుల ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌ నేతృత్వంలో 14 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. మృతురాలి వేలి ముద్రలను హైదరాబాద్‌లోని అడిషనల్‌ జనరల్‌ ఆఫ్‌ ఆధార్‌కు పంపారు. ఆమె ధరించిన చెప్పులు, దుస్తులు సేకరించి ఒంగోలు నగరంలోని చెప్పుల షాపులు, రెడిమేడ్‌ షాపుల్లో సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. పెద్దకొత్తపల్లి, పేర్నమిట్ట గ్రామాలతోపాటు ఒంగోలు నగరంలోని జాతీయ రదారిపై ఉన్న పెట్రోలు బంకుల్లో సీసీ ఫుటేజ్‌లను సేకరించే పనిలో పడ్డారు. మృతదేహాల ఫొటోలతో కరపత్రాలు ముద్రించి వాటిని గ్రామాల్లో పంచుతూ వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. తల్లీబిడ్డలకు సంబంధించిన వివరాల కోసం అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎమ్‌ల ద్వారా విచారణ చేయిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఓ బృందాన్ని ఉంచి అటుగా వెళ్తున్న రైతులు, పాదచారులను ఆరా తీస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదా రుల జాబితాను పరిశీలిస్తున్నారు.

ఘటనా స్థలం వద్ద బుధవారం వాహన చోదకులను విచారిస్తున్న సీఐ జ్యోతిరాణి
ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా దర్యాప్తు వేగవంతం: ప్రత్యక్ష సాక్షులుగా భావిస్తున్న పలువురిని పోలీసులు గుర్తించారు. మంటలను గమనించిన పేర్నమిట్టవాసితోపాటు అతను అందించిన సమాచారంతో అక్కడకు వెళ్లిన వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో శివమాల ధరించిన భక్తులు ఇద్దరు బిడ్డతో ఉన్న ఓ మహిళతో 32 ఏళ్ల వ్యక్తి మారెళ్ళగుంట పొలాల వద్ద గొడవ పడుతుండటం తాము గమనించామని, అతడు తాము భార్యాభర్తలమని బదులిచ్చాడని పోలీసులకు తెలిపారు. నీలిరంగు గ్లామర్‌ బైక్‌పై వారు వచ్చినట్టు చెప్పారు. ఆ తర్వాత గంటలోపే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు గుర్తించారు. ఈ వివరాల ఆధారంగా ఆ మార్గంలో సీసీ కెమెరా పుటేజిని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అటువైపుగా వచ్చే వాహనచోదకులను మహిళా సిఐ జ్యోతిరాణి, ఎస్సై సాంబయ్యలు ఆరా తీస్తున్నారు.  సీడీఎస్‌ ప్రాజెక్టు ఆధికారిణి చిలకా భారతి అంగన్‌వాడీ సూపర్‌ వైజర్లతో కలిసి సంతనూతలపాడు, చీమకుర్తి, మద్దిపాడు ప్రాంతాలలో బుధవారం విచారించారు. పోలీసులు మాత్రం గ్రామాలలో జల్లెడ పడుతున్నారు. సోమ, మంగళవారాల్లో ఈ ప్రాంతంలో వర్షం కురిసిన కారణంగా పోలీసు జాగిలం కూడా మృతురాలి చుట్టే తిరుగాడింది. ఘటనా స్థలంలో పొగ రావడం గమనించి అక్కడకువెళ్లిన పెదకొత్తపల్లి గ్రామానికి చెందిన, బేల్దారి పనులు చేసే వ్యక్తిని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. పెదకొత్తపల్లి గ్రామంలోని ఒక నాయకుడి గోడౌన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పేర్నమిట్ట ఒంగోలు సమీపంలోని పీర్లమాన్యం తదితర ప్రాంతాలలో ఇతర జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటూ జీవిస్తున్న వారిని విచారిస్తే ఏమైనా వాస్తవాలు బయటకు రావచ్చనే కోణంలోనూ విచారణ చేయాల్సిన అవసరం ఉంది.

మృతుల ఆచూకీ కోసం గ్రామాల్లో విచారిస్తున్న పోలీసులు
నిందితుడి నేరప్రవృత్తిపై సందేహాలు..
జరిగిన ఘటనపై మీడియాలో ఫొటోలతో సహా వార్తలు వచ్చాయి. అయినా పోలీసులకు కనీస సమాచారం అందలేదు. మృతురాలు ధరించిన చెప్పులు, దుస్తుల ఆధారంగా ఆమె ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళ అయి ఉండవచ్చనే భావన వ్యక్తమవుతోంది. బైకు మీద వచ్చిన ఇద్దరు దంపతులే అయితే నిర్మానుష్య ప్రాంతంలోకి ఆమె ఎందుకొచ్చిందనే అంశం అనుమానాలకు తావిస్తోంది. త్రోవగుంట నుంచి దగ్గర దారి అని నమ్మించి చీమకుర్తి వైపు తీసుకువెళ్లేందుకు నిందితుడు ప్రయత్నం చేసి ఉండొచ్చని భావించి గ్రానైట్‌ ఫ్యాక్టరీలలో పనిచేసే ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు, ఫ్యాక్టరీ యజమానులను సైతం పోలీసులు విచారిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా మిస్సింగ్‌ కేసు నమోదైనా లేక ఫిర్యాదు వచ్చినా తక్షణమే తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ బుధవారం రాత్రి తన చాంబరులో దర్యాప్తు అధికారులకు సూచించారు. నిందితుడు పెట్రోలు సీసా, కత్తి వెంట తీసుకొచ్చాడు. బండరాయితో మహిళను హతమార్చాడు. కత్తితో చిన్నారి గొంతు కోశాడు. ఇద్దరిపై పెట్రోలు పోసి తగులబెట్టాడు. ఈ అంశాలను పరిశీలిస్తే నిందితుడు తీవ్రమైన నేరప్రవృత్తి గలవాడనే సందేహాలు కలుగుతున్నాయి.

పోస్టర్లతో ఆరా..
తల్లిని దారుణంగా కొట్టి చంపి, పసిబిడ్డ గొంతు కోసి హతమార్చిన దారుణ ఘటనకు  ఆనవాళ్లు గురిస్తే పోలీసుశాఖకు తెలియజేసి దర్యాప్తుకు సహకరించాలని జిల్లా ఎస్పీ సిద్థార్థ కౌశల్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఆనవాళ్లను తెలిపే బ్రోచర్‌ను ఆయన బుధవారం రాత్రి విడుదల చేశారు. మృతుల ఆనవాళ్లు గుర్తిస్తే ఒంగోలు డీఎస్పీ 9121102120, రూరల్‌ సీఐ 9121102130, మద్దిపాడు ఎస్సై 9121102133 నంబర్లకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.

మహిళ ఆనవాళ్లు..
20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు మహిళ ఎత్తు సుమారు 5అడుగులు, చామనచాయ రంగులో ఉంటుంది. గులాబీరంగు పంజాబీ డ్రస్సు, దానిపై తెలుపురంగులో ఎంబ్రాయిడరీ పువ్వు డిజైన్‌ ఉంది. లెగ్గిన్, చున్నీ తెలుపురంగులో ఉండి కాలిపోయాయి. మెడలో ఉన్న నైలాన్‌ పసుపు తాడులో నల్లపూసలు, ఒక ఎర్రపూస ఉన్నాయి. తాడు కాలిపోయింది. రెండు కాలివేళ్లకు రెండు జతల మెట్టెలున్నాయి. రెండు కాళ్లకు గులాబీరంగు గూడ చెప్పులు ఉన్నాయి. 

చంటిబిడ్డ ఆనవాళ్లు..
బిడ్డ వయస్సు 6 నెలల నుంచి ఏడాది ఉండవచ్చు. 2.25 అడుగుల ఎత్తు, చామన చాయగా ఉంటుంది. గులాబీరంగు డ్రాయర్, తెలుపు గోధుమరంగు అడ్డ నిలువు గీతల బనియన్‌ ధరించి ఉంది. రెండు కాళ్లకు నల్లని మొలతాడు కట్టి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement