మృతురాలు ఎమేలమ్మ
కనిగిరి: కాన్పు సమయంలో వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి, బిడ్డ మరణించారంటూ కనిగిరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వద్ద మృతుల బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే మండలంలోని చాకిరాలకు చెందిన ఎమేలమ్మ (25) నిండు గర్భిణి. మొదటి కాన్పునకు పట్టణంలోని పామూరు బస్టాండ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు నార్మల్ డెలివరీ కోసం 24వ తేదీ నుంచి ఆస్పత్రిలోనే ఉంచి వేచి చూశారు. అయితే 26వ తేదీ శుక్రవారం అత్యవసర ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కానీ ఆపరేషన్ సమయంలో బాలింత, శిశువు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందంటూ ఎమేలమ్మ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పక్కనే ఉన్న వైద్యుని కారు అద్దాలు ధ్వంసం చేశారు. సంఘటనా స్థలం వద్దకు పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. అయితే పెద్ద మనుషుల జోక్యంతో ఇరువర్గాలు రాజీ పడినట్లు సమాచారం. ఈ మేరకు మృతదేహాన్ని బాధితులు ఇంటికి తీసుకెళ్లారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు.
వైద్యుల వైఫల్యమే కారణం:
వైద్యుల వైఫల్యం వల్లనే తన కూతురు ఎమేలమ్మ, శిశువు మృతి చెందారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. ఆపరేషన్ ఫెయిల్ అవడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని వారు ఆరోపించారు. తల్లీబిడ్డ చనిపోయిన తర్వాత కూడా సీరియస్‌గా ఉందంటూ ఒంగోలుకు తరలించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
వైద్యులు ఏమంటున్నారంటే..
దీనిపై డాక్టర్ మాట్లాడుతూ ప్రసవ సమయం దాటిన మూడు రోజుల తర్వాత ఎమేలమ్మను తన ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆపరేషన్ చేస్తేనే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని చేర్చుకునే రోజే మృతురాలి తల్లిదండ్రులకు చెప్పామన్నారు. కానీ వారు వినకుండా ఆపరేషన్ లేకుండా ప్రసవం చేయాలని పట్టుపట్టారన్నారు. 25వ తేదీ మధ్యాహ్నం పరిస్థితి బాగా లేదని ఆపరేషన్ చేయించుకోవాలని లేకుంటే ఎక్కడికైనా తీసుకెళ్లాలని చెప్పామన్నారు. అయినా వారు వినకుండా దేవుడిపై మాకు నమ్మకం ఉంది. నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి ఆస్పత్రిలోనే ఉంచారన్నారు. 26వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున ఉమ్మనీరు పోయి పరిస్థితి తీవ్రం కావడంతో.. వారి తల్లిదండ్రులను ఒప్పించి ఆపరేషన్ «థియేటర్‌కు తీసుకెళ్లామని, ఆ సమయంలో హార్ట్ కంప్లెంట్ వచ్చి, కోమాలోకి వెళ్లి బాలింత, శిశువు చనిపోయారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment