సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. నేటితో ప్రచారానికి కూడా తెరపడనుంది. మైకులు మూగబోగనున్నాయి. తెలంగాణలోని 13 స్థానాల్లో సాయంత్రం నాలుగు గంటలకు, 106 స్థానాల్లో సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియనుంది. ఇక, ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణకు సెంట్రల్ ఫోర్స్ కూడా చేరుకుంది.
వివరాల ప్రకారం.. తెలంగాణలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈనెల 30న ఎన్నికలు పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికల విధుల్లో లక్ష మంది పోలీసు సిబ్భంది ఉన్నారు. రాష్ట్ర పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు కూడా విధుల్లో ఉండనున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్ ఫోర్స్ కూడా తెలంగాణకు చేరుకుంది. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు ఫోర్స్‌ను కేటాయించారు.
ఫుల్ అలర్ట్..
తెలంగాణ ఎన్నికల విధుల్లో 375 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల 655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక.. 4,400 సమస్యాత్మక ప్రాంతాలకు అదనంగా సిబ్బందిని కేటాయించారు. ఎన్నికల విధుల్లో అస్సాం రైఫిల్స్, బోర్డర్స్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ , సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. ఇక, ఎన్నికల విధుల్లో 65వేల మంది తెలంగాణ పోలీసులు ఉన్నారు. 18వేల మంది హోంగార్డులు కూడా పనిచేయనున్నారు. ఇప్పటికే ఎన్నికలు బహిష్కరణకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
మూడు కమిషనరేట్లలో భద్రత పెంపు..
మరోవైపు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మూడు కమిషనరేట్స్ పరిధిలో 70 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి. పోలింగ్ బూత్ ఫోర్స్, రూట్ మొబైల్, పెట్రోలింగ్ టీమ్స్, బ్లూ కోట్స్‌తో పాటు ఏసీపీ, డీసీపీ స్థాయి అధికారులతో క్విక్ రెస్పాన్స్ బృందాలను రెడీ చేశారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 30వేల మందికిపైగా బందోబస్తులో ఉంటారు.
అమలులోకి 144 సెక్షన్..
బుధవారం సాయంత్రం నుండి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఐదు అంచల భద్రతను ఏర్పాటు చేశారు. మూడు కమిషనరేట్స్ పరిధిలో వెయ్యి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బుధవారం సాయంత్రం నుంచి డిసెంబర్ ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకుమించి గుమ్మిగూడరాదు. పోలింగ్ కేంద్రాల సమీపంలో ప్రచారాలు నిషేధం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment