మారేడుమిల్లిలో అత్యధికంగా 56.0 మి.మీ. వర్షపాతం
పొంగిన వాగులు, వంకలు
చింతూరు, వీఆర్‌పురం మధ్య నిలిచిన రాకపోకలు
మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో పడిన చెట్లు
ఏడు గంటలు నిలిచిన ట్రాఫిక్
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
సగటు వర్షపాతం 11.0 మి.మీ.
సాక్షి, రాజమహేంద్రవరం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా సోమవారం వర్షాలు కురిశాయి. మెట్ట, డెల్టాల కన్నా ఏజెన్సీ ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. ఫలితంగా ఏజెన్సీలోని పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా విలీన మండలాల్లోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీలోని మారేడుమిల్లిలో అత్యధికంగా 56.0 మిల్లీ మీటర్ల వర్షపాత నమోదైంది. విలీన మండలాలైన వీఆర్‌పురంలో 46.6 మి.మీ, ఏటపాకలో 33.3, చింతూరులో 30.0, కూనవరంలో 24.4 మి.మీ వర్షపాతం నమోదైంది. చింతూరు మండలం తిమ్మిరిగూడెం వద్ద అత్తాకోడళ్ల వాగు పొంగి రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండడంతో చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య పలుమార్లు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వరద పెరుగుతూ, తగ్గుతూ ఉండడంతో వాహనదారులు అప్రమత్తంగా వ్యహరించారు. విలీన మండలాల్లో విస్తారంగా వర్షాలు పడి వరదలు వస్తుండడంతో చింతూరు ఐటీడీవో కార్యాలయంలో కంట్రోల్ రూం, హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. ఐటీడీవో పీవో చినబాబు వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు నాలుగు మండలాల తహసీల్దార్లతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 08748–285259 నంబరు ద్వారా సంప్రదించాలని కోరారు. భద్రాచలం వెళ్లి గోదావరి వరద పరిస్థితిని తెలుసుకున్నారు. అకస్మాత్తుగా వచ్చే సబరి వరదపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మారేడుమిల్లి, చింతూరు మధ్య ఘాట్‌రోడ్డులోని టైగర్ క్యాంప్ వద్ద చెట్లు కూలి రహదారిపై పడ్డాయి. మధ్యాహ్నం నుంచి ఇరువైపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. రాత్రి తొమ్మిది గంటలకు చెట్లను తొలగించారు.
.
మైదాన ప్రాంతంలోనూ నిరంతరం వర్షం...
జిల్లాలోని మైదాన ప్రాంతాల్లో కూడా సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు కొద్దిపాటి వర్షం పడుతూనే ఉంది. మధ్య మధ్యలో తెరపిస్తున్న వరుణుడు మళ్లీ వర్షం కురిపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాలేదు. స్కూలు పిల్లలు పాఠశాల రాకపోకలు సమయంలో ఇబ్బందులు పడ్డారు. వ్యాపారులు లేక దుకాణాలు బోసిపోయాయి. చిరు వ్యాపారులు రోడ్లపైకి రాలేకపోయారు. ఏజెన్సీ తర్వాత జిల్లాలో అత్యధికంగా రాజమహేంద్రవరం నగరంలో 26.2 మి.మీ, సీతానగరంలో 25.2, రాజమహేంద్రవరం రూరల్‌లో 20.2, ఆత్రేయపురం మండలంలో 13.0, పెద్దాపురంలో 15.8, ముమ్మిడివరంలో 7.4, అమలాపురం, కాకినాడల్లో 7.0 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా తునిలో 1.0 మి.మీ వర్షపాతం నమోదవగా జిల్లా సగటు వర్షపాతం 11.0 మిల్లీ మీటర్లగా నమోదైంది.
మన్యంలో కుండపోత
Published Tue, Jul 18 2017 4:37 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement