చోడవరం,న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాను వర్షం ముంచెత్తింది. దాదాపు అన్ని మండలాల్లోనూ పడింది. తుమ్మపాలలో పిడుగుపడి మహిళ మృతి చెందింది. నాతవరం మండలం కె.శరభవరంలో పాడిగేదె దుర్మరణం చెందింది. అనకాపల్లి, చోడవరం ప్రాంతాల్లో సుమారు గంటన్నరపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 98 మిల్లీమీటర్లు నమోదైంది.
తాండవ నదిలోకి అధిక స్థాయిలో నీరు వచ్చి చేరింది. దీంతో గన్నవరం వద్ద గెడ్డ ఉప్పొంగి ప్రవహించింది. సాయంత్రం నాలుగున్నర నుంచి ఏడు గంటల వరకు తుని- నర్సీపట్నం రహదారిలో సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. అనకాపల్లి-చోడవరం రహదారిలో భారీ వృక్షం నేలకొరిగింది. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాపిక్ నియంత్రణకు సుమారు ఐదు గంటలు పట్టింది.చోడవరంలో లోతట్టులో ఉన్న బాలాజీ నగర్, కో-ఆపరేటివ్‌కాలనీ, రెల్లివీధి, బానీకోనేరు, ఆంధ్రాబ్యాంక్ రోడ్డు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడటంతో తీగలు తెగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ప్రభుత్వ ఉన్నతపాఠశాల, సాయిబాబా ఆలయం కూడా నీట మునిగాయి. బాలాజీ నగర్‌లో ఇళ్లల్లోకి నీరు చేరింది. రోడ్లపై మూడు అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్దచెరువు, తామచెరువుల్లో భారీ ఎత్తున నీరు వచ్చి చేరింది. గోవాడ, వెంకన్నపాలెం, అడ్డూరు, ఏటవతల గ్రామాలు, బుచ్చెయ్యపేట మండలంలో కూడా భారీ వర్షం కురిసింది. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పొలాలు నీటమునగగా చెరకు తోటల్లో నీరు చేరింది. ఏజెన్సీలోనూ ఎడతెరపిలేకుండా వర్షం కురిసింది. మత్స్యగెడ్డ, రాళ్లగెడ్డ, కోడిమామిడి, దేవునిగెడ్డ, పోతురాజుగెడ్డ, తదితర కొండగెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నర్సీపట్నం,రాంబిల్లి,నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లోని పలు గ్రామాల్లో తేలికపాటి వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లోని పంటలకు ఈ వర్షం అనుకూలమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పిడుగుపడి మహిళ మృతి
అనకాపల్లిరూరల్ : అనకాపల్లి మండలం తుమ్మపాలకు చెందిన పీలా సత్యవతి (55) పొలం పనులు చేస్తుండగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది. బొజ్జన్నకొండ సమీపంలోని పొలాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం దట్టమైన మేఘాలు అలుముకొని ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసిం ది. మృతురాలికి బంధువులు లేకపోవడంతో గ్రామస్తులే అంత్యక్రియలు నిర్వహించారు.
పాడిగేదె దుర్మరణం
నాతవరం : పిడుగుపాటుకు గేదె మృతిచెందింది. భారీవర్షంతోపాటు ఈ ప్రాంతంలో పిడుగులు పడ్డాయి. మండలంలోని కె.శరభవరం గ్రామానికి చెందిన జి.నూకరాజు పాడిగేదె పిడుగుపాటుకు చనిపోయింది. దీని విలువ రూ.50 వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరాడు.
జలదిగ్బంధంలో చోడవరం
Published Sun, Sep 8 2013 1:24 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement