‘ఫణి’ దూసుకొస్తోంది | తుపానుగా మారి ఆంధ్రా వైపు పయనం | Cyclone Pani Updates in Telugu - Sakshi
Sakshi News home page

‘ఫణి’ దూసుకొస్తోంది

Published Fri, Apr 26 2019 3:47 AM | Last Updated on Fri, Apr 26 2019 11:41 AM

 Cyclone imminent; Met warns southern coastal regions of rain, wind - Sakshi

సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ప్రస్తుత సీజనులో తొలిసారిగా హిందూ మహా సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. కొద్ది గంటల్లోనే అది తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. ఈ నేపథ్యంలో తీవ్ర అల్పపీడనం శుక్రవారం నాటికి దక్షిణ బంగాళా ఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం శనివారం నాటికి తుపానుగా మారనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు ఐఎండీ విశాఖపట్నం, హైదరాబాద్‌ కేంద్రాలు గురువారం రాత్రి బులెటిన్‌ విడుదల చేశాయి. తుపానుగా మారిన తర్వాత 72 గంటలు శ్రీలంక తూర్పు తీర ప్రాంతం వెంబడి వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 30వ తేదీన ఉత్తర తమిళనాడు–దక్షిణ కోస్తాంధ్రల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. తొలుత ఈ తుపాను తమిళనాడు వద్ద తీరం దాటవచ్చని భావించింది. మారిన పరిస్థితులనేపథ్యంలో ఇది శ్రీలంక తూర్పు తీరం వెంబడి వాయవ్య దిశగా పయనించి దక్షిణ కోస్తాంధ్ర–ఉత్తర తమిళనాడు మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. 

ఈదురు గాలులు.. భారీ వర్షాలు 
తుపాను ప్రభావం ఈ నెల 28వ తేదీ నుంచి స్వల్పంగా మొదలై క్రమంగా పెరగనుంది. 28వ తేదీ నుంచి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో ఈదురు గాలులు ప్రారంభమై ఉధృతమవుతాయి. 28వ తేదీన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. 29వ తేదీన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. భారీ ఈదురుగాలులూ వీస్తాయి. అదే సమయంలో అక్కడక్కడా పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 30వ తేదీన తుపాను తీరం దాటే నాటికి తీవ్రత మరింత పెరిగి, పెనుగాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

తమిళనాడు, పాండిచ్చేరి తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు 
తుపాను ప్రభావం వల్ల ఈ నెల 29వ తేదీన తమిళనాడు, పాండిచ్చేరి తీర ప్రాంతాల్లోని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ప్రకటించింది. ‘‘30వ తేదీన పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మే 1వ తేదీన కూడా తమిళనాడు, పాండిచ్చేరిలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 29వ తేదీన దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. 30వ తేదీన కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి’’ అని ఐఎండీ ప్రకటించింది. 

మత్స్యకారులకు హెచ్చరిక 
వాయుగుండం, తుపాను నేపథ్యంలో బలమైన గాలులు వీస్తూ సముద్రం అలజడిగా మారనున్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది. ఈ నెల 30వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులకు సూచించింది. 

తుపానుకు ఫణిగా నామకరణం  
ఈ తుపానుకు బంగ్లాదేశ్‌ సూచించిన ‘ఫణి’ పేరును ఖరారు చేయనున్నారు. దీనికి ముందు 2018 డిసెంబర్‌ మూడో వారంలో తుపాను ఏర్పడింది. ఆ తుపానుకు పెథాయ్‌ పేరును థాయ్‌లాండ్‌ సూచించింది. ఆ తర్వాత క్రమంలో బంగ్లాదేశ్‌ సూచించిన ‘ఫణి’ని ప్రకటించనున్నారు. నిబంధనల ప్రకారం తుపానుగా మారాకే పేరు పెడతారు. ఆ లెక్కన ఇప్పుడు ఏర్పడబోయే తుపానుకు ‘ఫణి’గా శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు. 

కోస్తాంధ్రలో జల్లులు.. సీమలో ఎండలు 
‘‘మరఠ్వాడా నుంచి దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక వరకు ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకూ ప్రస్తుతం ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇంటీరియర్‌ ఒడిశాను, దానిని ఆనుకుని ఉన్న చత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం వల్ల రాగల మూడు రోజులు కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం ఉంటుంది’’ అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర కంటే రాయలసీమలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి. అక్కడ సాధారణం కంటే 2–4 డిగ్రీలు, కోస్తాంధ్రలో 1–2 డిగ్రీలు ఎక్కువగా రికార్డు కానున్నాయి. గురువారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా అనంతపురం జిల్లా గుంతకల్లులో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement