చండూరులో భారీ వర్షం
► పొంగిన వాగులు, వంకలు
► రాకపోకలకు అంతరాయం
► అతలాకుతలమైన జనజీవనం
చండూరు : చండూరులో బుదవారం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొగిపొర్లుతున్నాయి. మూడు రోజులుగా ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 29 తేదిన 29.8మి.మీ. వర్షం పాతం నమోదుకాగా 30న 11.4మి.మీ, 31న 4సెం.మీల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమై జనం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇళ్లలోకి నీరు చేరింది.
చండూరు–మునుగోడు, చండూరు– శిర్దేపల్లి, గట్టుప్పల–బంగారిగడ్డ, చండూరు చిట్టి వాగులు పొంగి పొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆర్టీసీ బస్సులు సైతం రెండు గంటలకుపైగా ఆగాయి. శిర్దేపల్లి వాగు పారడంతో ఎంపీడీఓ శైలజకు సైతం ఇబ్బంది తప్పలేదు. ఉడతలపల్లి కుంట తెగడం తో నీరంత వృథాగా పోతోంది. బీసీ బాలికల వసతి గృహం, పోలీస్‌స్టేషన్‌లోకి భారీగా నీరు చేరింది. ప్రభుత్వ పాఠశాలలోకి నీరు చేరడంతో విద్యార్థులు వెళ్లడానికి తిప్పలు పడాల్సి వచ్చింది.