సాక్షి, ఏలూరు ప్రతినిధి: ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నూతన జాతీయ రహదారి ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించి ఏజెన్సీ మీదుగా ప్రధాన రహదారుల మధ్య కనెక్టివిటీ పెంచే జాతీయ రహదారికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
తెలంగాణ నుంచి ఆంధ్రా మధ్య దూరాన్ని తగ్గించేలా హైవే ప్రణాళిక ఖరారు చేశారు. మొదటిసారిగా పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన పోలవరంలో అత్యధిక భాగం నాలుగు వరుసల రహదారి నిర్మాణం కానుండటం విశేషం. ఎన్‌హెచ్ 365 బీబీ రెండో ప్యాకేజీ పనులకు రూ.367.97 కోట్లు మంజూరు కావడం, భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో వచ్చే నెలాఖరు నాటికి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
సూర్యాపేట నుంచి పట్టిసీమను కలిపేలా..
సూర్యాపేట నుంచి ఖమ్మం, చింతలపూడి నియోజకవర్గం మీదుగా దేవరపల్లి జాతీయ రహదారికి ఇప్పటికే కనెక్టివిటీ పెంచేలా గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో పాటు ఏజెన్సీ ఏరియాలో పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్‌ఫీల్డ్ హైవేకు సమీపంలోనే జాతీయ రహదారి 365 బీబీ నిర్మాణ పనులకు ఆమోదం లభించింది.
సూర్యాపేట నుంచి కూసుమంచి, ఖమ్మం, వైరా, తల్లాడ, సత్తుపల్లి, అశ్వారావుపేట మీదుగా ఏపీలోని జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మీదుగా పోలవరం వద్ద పట్టిసీమ కలిపేలా రహదారిని డిజైన్ చేశారు. జీలుగుమిల్లి నుంచి పట్టిసీమ మీదుగా రాజమండ్రి వరకు మొత్తం 86.5 కిలోమీటర్ల మేర రహదారి ఉంది. ప్రస్తుతం ఉన్న రెండు వరుసల రోడ్డును నాలుగు వరుసల రహదారిగా నిరి్మంచడానికి వీలుగా టెండర్ ఖరారు చేశారు.
దీనిలో భాగంగా మొదటి విడతలో జీలుగుమిల్లి నుంచి పోలవరం వరకు 365 బీబీ నిర్మాణ పనులు మొదటి ప్యాకేజీలో భాగంగా జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం నుంచి జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం, కేఆర్ పురం, ఎల్‌ఎన్‌డీ పేట మీదుగా పట్టిసీమ వరకు 40.4 కిలోమీటర్ల మేర రహదారిని విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.367.97 కోట్లు మంజూరు చేశారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికే జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో 52.89 హెక్టార్ల భూమి అవసరమవుతుందని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసి గ్రామ సభ కూడా నిర్వహించారు. వచ్చే నెల రెండో వారానికి టెండర్లు పూర్తి చేసి నెలాఖరు నాటికి పనులు ప్రారంభించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment