- ముంపు పరిహారం కోసం...ఓటరు కార్డుల పరిహాసం
- రోజుల వ్యవధిలో ఓటరు ఐడీ కార్డుల జారీ
- పోలవరం ముంపు పరిహారం కోసం ‘నకిలీ’ సృష్టి
- టీడీపీ నేతల కనుసన్నల్లో నడుస్తున్న దందా
- వీఆర్‌పురం, కూనవరం మండలాల్లోని పలు మీసేవా కేంద్రాల్లో జారీ
- పరిహారం సొమ్ము కొట్టేందుకు నేతల కుట్ర
ఇదో ‘ఐడి’యా
Published Tue, Jul 4 2017 11:53 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ:
– ఈ ఓటర్ గుర్తింపు కార్డు చూడండి. వర రామచంద్రపురం మండలం రాజుపేటకు చెందిన ఖండవల్లి శివాజీది. దరఖాస్తు చేసుకున్న రోజుల వ్యవధిలోనే ఓటర్ ఐడీ కార్డు వచ్చేసింది. ఇదొక్కటే కాదు టీసీలో (పుట్టిన తేదీ 2001ఫిబ్రవరి 10) ఉన్న ప్రకారం 18 సంవత్సరాలు నిండలేదు. కానీ...1998 జనవరి ఒకటో తేదీన పుట్టినట్టు చూపించి ఓటర్ ఐడీ కార్డు జారీ చేసేశారు.
ఒక్క శివాజీయే కాదు వీఆర్‌పురం, కూనవరం మండలాల్లోని అనేక మందికి ఈ రకంగా ఓటరు గుర్తింపు కార్డులు జారీ అయిపోయాయి. నిజానికైతే వీటిని నకిలీగా గుర్తించాలి. 18 సంవత్సరాలు నిండితేనే ఓటర్ గుర్తింపు కార్డు ఇవ్వాలి. కానీ ఇక్కడ అనేక మందికి వయస్సు తక్కువ ఉన్నప్పటికీ పుట్టిన తేదీలు మార్చి కార్డులు జారీ చేసేశారు. టీడీపీ నేతల కనుసన్నల్లో కొన్ని మీసేవా కేంద్రాలు ఈ రకమైన కార్డులు జారీ చేసేస్తున్నాయి. పోలవరం ముంపు గ్రామాల పరిహారం కోసం టీడీపీ నేతలు వేసిన ఎత్తుగడ ఇది.
.
దరఖాస్తు చేసిన ఒక్క రోజులోనే...
పోలవరం ముంపు మండలాలైన వీఆర్‌పురం, కూనవరం మండలాల్లోని మీసేవా కేంద్రాల్లో ఓటర్ ఐడీ కార్డులను బస్‌పాస్ తరహాలో దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే ఇచ్చేస్తున్నారు. రెవెన్యూ శాఖ ప్రమేయం లేకుండా ఓటర్ ఐడీ కార్డులను దరఖాస్తు చేసుకున్న రోజులోనే ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ మండలాల్లోని పలు గ్రామాలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ముంపునకు గురి కానున్నాయి. తొలివిడతగా వీఆర్‌పురం మండలంలోని పది గ్రామాల్లోను, కూనవరం మండలంలోని ఒక గ్రామంలో ఆర్‌అండ్‌ఆర్ సర్వే ప్రక్రియను అధికారులు చేపట్టారు. మిగిలిన గ్రామాల్లో కూడా ఈ సర్వే ప్రక్రియ త్వరలో జరగనుంది. 18 సంవత్సరాలు నిండిన యువతీ,యువకులను ఒక కుటుంబంగా గుర్తించి వారికి కూడా ప్యాకేజీ ఇవ్వనున్నారని ప్రచారం జోరుగా సాగుతున్న నేప«థ్యంలో పలువురు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మార్గంలో డబ్బులు చెల్లించి మీసేవ కేంద్రాల ద్వారా ఓటర్ ఐడీ కార్డులను పొందుతున్నారు.
.
ఒక్కరోజులోనే కార్డు సిద్ధం...
వాస్తవానికి 18 సంవత్సరాలు నిండిన యువతీ,యువకుడు నూతనంగా ఓటు గుర్తింపు కార్డు పొందాలంటే ముందుగా బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ) వద్ద ఫాం–6 దరఖాస్తు పూర్తి చేసి దానికి ఆధార్‌కార్డ్, రేషన్ కార్డు జిరాక్స్‌లతోపాటు చదువుకు సంబంధించి టీసీ జిరాక్స్‌ను కూడా జతపరచి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తును తహసీల్దార్ పరిశీలిస్తారు. రిమార్క్‌లు లేకుంటే ఆర్డీఓకు పంపిస్తారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత అనంతరం ఎలక‌్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో దరఖాస్తుదారుడికి ఒక ఓటర్ ఐడీని కేటాయిస్తారు. ఈ ప్రకియకు సుమారు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. కానీ ఇవేవీ కాకుండా ఇక్కడ కొన్ని మీసేవా కేంద్రాల్లో సుమారు రూ.500 నుంచి రూ.1000 తీసుకుని అక్రమంగా ఓటరు ఐడీ కార్డులు జారీ చేస్తున్నాయి. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 18 ఏళ్లు నిండిన యువతీ,యువకులకులు ఓటు హక్కు పొందేందుకు అర్హులు. కానీ వీఆర్‌పురం, కూనవరం మండలాలకు చెందిన పలువురు 18 ఏళ్లు నిండకపోయినా పోలవరం ప్యాకేజీ వర్తిస్తుందనే అత్యాశతో అక్రమంగా మీసేవా కేంద్రాల ద్వారా ఓటర్ ఐడీ కార్డులు పొందుతున్నారు. టీడీపీ నేతల కనుసైగల్లోనే ఇక్కడంతా జరుగుతోంది. ముఖ్యంగా వీఆర్ పురంలోని టీడీపీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తన బంధు గణమంతటికీ ఈ రకంగా కార్డులు సమకూర్చినట్టు తెలుస్తోంది. పరిహారం సొమ్మును కొట్టేసేందుకు నేతలు ఈ రకమైన కుట్రకు పాల్పడుతున్నారు.
ఆ కార్డులు చెల్లవు.
నిబంధనలకు విరుద్ధంగా మీసేవా కేంద్రాల ద్వారా ఓటర్ ఐడీ కార్డులు పొందారని నా దృష్టికి వచ్చింది. రెవెన్యూ శాఖ పరిశీలన లేకుండా ఓటర్ ఐడీ కార్డులు పొందడం నేరం. అక్రమంగా పొందిన కార్డులు ఆన్‌లైన్‌లో ఎంటర్ అయ్యే అవకాశం లేదు .ఇవి కేవలం స్థానికంగా సృష్టించినవి మాత్రమే. ఇలా పొందిన కార్డులను కొన్ని గుర్తించడం జరిగింది వాటిపై విచారణ చేపడుతున్నాం. బాధ్యులైన వారిపై చర్యలు చేపడతాం
–జీవీఎస్ ప్రసాద్ ,తహసీల్దార్, వీఆర్‌పురం.
Advertisement