
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న పోలీసు పోస్టుల భర్తీపై అయోమయం నెలకొంది. అసలు పోలీసు నోటిఫికేషన్‌కు కొత్త జిల్లాలను ప్రాతిపదికగా తీసుకోవాలా?, పాత జిల్లాల ప్రాతిపదికనా..? అన్న దానిపై సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో 80 శాతం మంది పోలీసు సిబ్బంది ఆర్డర్ టు సర్వ్ కింద పనిచేస్తున్నారు. వారి బదిలీలపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికితోడు కొత్తగా నియామకాల అంశం తెరపైకి వచ్చింది.
పాత జిల్లాల పద్ధతికే డిమాండ్..
కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తోంది. పునర్విభజన వల్ల కొత్తగా ఏర్పడిన జిల్లాకు వేల సంఖ్యలో కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని భర్తీ చేసేందుకు ఇప్పుడు ప్రక్రియ మొదలు పెట్టాలని పోలీస్ శాఖ భావిస్తోంది.
అయితే ఇక్కడ కానిస్టేబుల్ పోస్టు జిల్లా క్యాడర్ పోస్టు కావడంతో కొత్త జిల్లా పరిధిలోని ఆశావహులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా పాత జిల్లాల హెడ్‌క్వార్టర్లు, వాటి శివారు ప్రాంతాలు, వాటి కింద రూరల్ ప్రాంతాల్లోని వారు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుం దని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర స్థాయి చేస్తారా?
కానిస్టేబుల్ పోస్టులను రాష్ట్ర స్థాయి పోస్టుగా చేస్తే ఎక్కడి వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనిపై పోలీస్ శాఖకు ఇప్పటివరకు స్పష్టత రాలేదని తెలిసింది. అదే విధంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త రేంజ్‌లు కూడా ఏర్పాటు చేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని వల్ల పాలన సులభతరం అవడంతో పాటు శాంతిభద్రతల పర్యవేక్షణ మరింత పటిష్టంగా ఉంటుందని భావిస్తున్నారు.
కొత్త రేంజ్‌లు ఏర్పాటు తప్పనిసరి అయితే కానిస్టేబుల్ పోస్టును రాష్ట్ర స్థాయి పోస్టుగా గుర్తించి వారి బదిలీలు, పోస్టింగులు రేంజ్‌ల పరిధిలోనే ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ రెండు అంశాలపై స్పష్టత వస్తే ఇక జిల్లాల వారీగా నోటిఫికేషన్ అనే వాదన అవసరం లేదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
నియామక ప్రక్రియ మారుస్తారా?
2015లో నూతన నియామక ప్రక్రియను పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ముందుగా ప్రిలిమ్స్ నిర్వహించి తదనంతరం ఈవెంట్స్, తుది దశలో ఎంపికైన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. అయితే ఇందులో ఈవెంట్స్‌పై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.
దీంతో నియామక ప్రక్రియను మార్చేందుకు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ నియామక ప్రక్రియను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. 1,600 మీటర్ల(మైలు) పరుగు పందెం పెట్టాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 800 మీటర్ల పరుగు పందెం ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.
వయోసడలింపుపై ప్రతిపాదన..
రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత నోటిఫికేషన్‌కు ప్రభుత్వం వయోసడలింపు కల్పించింది. ఓపెన్ కేటగిరీకి మూడేళ్లు, రిజర్వేషన్ కేటగిరీలకు ఐదేళ్ల చొప్పున సడలింపు కల్పించింది. ఈసారి కూడా వయోసడలింపు కల్పించాలని కొందరు నిరుద్యోగులు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పోలీస్ శాఖ నుంచి కూడా వయోసడలింపునకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే యోచన ఉన్నట్టు సమాచారం. మరోవైపు గతంలో రిజర్వేషన్ల అమలుపై పొరపాట్లు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది
Comments
Please login to add a commentAdd a comment