15న లాంఛనంగా ప్రక్రియ ప్రారంభం: కేసీఆర్
భూమితోపాటు బోరు, మోటారు, ఏడాది సేద్యపు వ్యయం ఇస్తాం..
సాక్షి, హైదరాబాద్: దళితులకు మూడెకరాల చొప్పున భూ పంపిణీ ఒకేసారి పూర్తయ్యేది కాదని, అది నిరంతరం కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. అసలు భూమి ఏమాత్రం లేని నిరుపేదలకు ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. ఆగస్టు 15వ తేదీన కేవలం లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. అధికారులు, సిబ్బంది గాభరాపడాల్సిన అవసరం లేదని, నిదానంగా, పకడ్బందీగా కార్యక్రమం అమలు చేద్దామని సూచించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను వివిధ శాఖలకు కేటాయించకుండా కేవలం ఎస్సీ అభివృద్ధి శాఖకు చెల్లిస్తామని, ఆ నిధుల నుంచి భూమి కొనుగోలు చేస్తామని చెప్పారు.
ఈ సంవత్సరం వెయ్యి నుంచి రెండువేల కోట్లు ఖర్చు చేయడానికి కూడా సిద్ధమని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో జరిగిన అధికారుల సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 12 లక్షల మంది ఎస్సీలు ఉంటే..అందులో మూడు లక్షలు పట్టణాల్లో ఉన్నారని, తొమ్మిది లక్షల మంది గ్రామాల్లో ఉన్నట్లు చెబుతున్నారని, ఇందులో మూడు లక్షల మందికి అసలు భూమి లేదని ‘సెర్ప్’ సర్వే చెబుతోందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం తలపెట్టిన తాజా సర్వే తరువాత ఎంతమంది ఎస్సీలున్నారు.? ఎంత మందికి భూమి లేదన్న వివరాలు తేలుతాయని, అప్పుడు పకడ్బందీగా పథకం అమలు చేద్దామని చెప్పారు. తెలంగాణలో భూములను ఎకరా రెండు లక్షల నుంచి ఆరేడు లక్షల రూపాయల వరకు రైతులు విక్రయిస్తున్నారని, ముందుగా లక్షన్నర, రెండు లక్షలకు ఎకరా వచ్చే భూములు ఎన్ని ఉన్నాయన్న వివరాలు సేకరించి, ఆ భూములను కొనుగోలు చేసి, అసలు భూమి రైతులకు మొదట పంపిణీ చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
భూమితోపాటు వారికి బోరు, విద్యుత్ కనెక్షన్, మోటారుకు అయ్యే వ్యయంతోపాటు, ఒక ఏడాదిపాటు సేద్యానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఈ పథకం పదేళ్లు కొనసాగినా అభ్యంతరం లేదని.., లక్షన్నర, రెండు లక్షల మందికి భూమి పంపిణీ చేసి, వారిని రైతులుగా మారిస్తే గొప్ప విజయం సాధించినట్లేనని ముఖ్యమంత్రి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దళితులకు భూపంపిణీ పేరుతో రూ. 92 కోట్లు వ్యయం చేశారని, కేవలం 31 వేలమందికి 41వేల ఎకరాలను మాత్రమే పంపిణీ చేశారని ఆయన చెప్పారు.