యాచారం: పేదలకు భూపంపిణీ చేయాలనే ప్రభుత్వ లక్ష్యం మంచిదే. అయితే హడావుడిగా పట్టాలు పంచేసి.. హద్దులు చూపకపోవడంతో చాలా మంది రైతులు లబ్ధిదారులుగా మారుతున్నారు తప్ప.. వారికి ఏ మాత్రం ప్రయోజనం ఉండడం లేదు. సుమారు 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం నుంచి పట్టాలు పొందిన రైతులకు తమ భూమి ఎక్కడుందో కూడా తెలిసే పరిస్థితి లేదు. అర్హులైన రైతులకు భూమి చూపించి, హద్దులు గుర్తించి, సర్వేయర్‌తో మ్యాప్ తయారు చేయించిన తర్వాతే పట్టాలివ్వాలి.
కానీ అలా చేయకపోవడం వల్ల వారంతా తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం దళితులకు భూపంపిణీలో భాగంగా సాగుకు యోగ్యమైన భూమిని మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇబ్రహీంపట్నం డివిజన్‌లోనే యాచారం మండలంలో మంతన్‌గౌరెల్లి గ్రామాన్ని ఎంపికచేసి అర్హులైనవారికి మూడెకరాల చొప్పున పంపిణీకి నిర్ణయించారు. గ్రామంలో అర్హులైన తొమ్మిది మంది రైతులను ఎంపిక చేశారు. గ్రామంలో దళితులకు భూపంపిణీ కింద సాగుయోగ్యమైన భూమిని పంపిణీ చేయడానికి అధికారులు నిర్ణయించడంపై నాడు పట్టాలు పొందిన లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. తమను కూడా ప్రస్తుత లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని వారంతా కోరుతున్నారు.
నేడు ఫిర్యాదుల బాట
యాచారం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం ఇరవై ఏళ్లుగా వందలాది పేద రైతులకు దాదాపు రెండు వేల ఎకరాలకు పైగా భూమిని పలుమార్లు భూపంపిణీ కింద పట్టాలిచ్చింది. అప్పట్లో అధికారుల తప్పిదంవల్ల కొన్ని గ్రామాల్లో సాగుకు యోగ్యంకాని భూముల్ని పంపిణీ చేశారు. మరికొన్ని గ్రామాల్లోనైతే భూముల్లేకుండానే రైతులకు పట్టాలిచ్చారు. అప్పట్లో పేద రైతులు భూములు లేకున్నా పట్టాలిస్తేచాలు అనే తరహాలో పట్టాలు తీసుకున్నారు. ఏళ్లు గడిచినా వారికి భూములు చూపించలేదు.
అధికారుల సర్వేలో పట్టాలు పొందిన రైతులకు భూములన్నట్లు రికార్డుల్లో నమోదై ఉంది. దీనివల్ల భూములు లేకున్నా వారు నేడు భూపంపిణీకి అర్హులు కాకుండా పోయారు. నేడు ప్రభుత్వం సాగు భూములనే పంపిణీ చేయాలనే యోచనతో ఉండడం వల్ల నాడు పట్టాలు పొందిన రైతులు నేడు ఫిర్యాదుల బాట పట్టారు. సోమవారం మంతన్‌గౌరెల్లి గ్రామానికి చెందిన 15మందికి పైగా రైతులు నాడు భూములు లేకుండా పట్టాలిచ్చిన పుస్తకాలను తీసుకొచ్చి అధికారులకు ఫిర్యాదు చేశారు.
అప్పట్లో తమకు పట్టాలు మాత్రమే ఇచ్చారనీ, భూము లివ్వలేదని వాపోయారు. నాటి పట్టాలు రద్దుచేసి ప్రస్తుతం భూపంపిణీ ఎంపిక అర్హుల జాబితాలో తమ పేర్లు కూడా నమోదు చేయాలని జెడ్పీటీసీ సభ్యుడు రమేష్‌గౌడ్, తహసీల్దార్ వసంతకుమారికి ఫిర్యాదు చేశారు. మంతన్ గౌరెల్లి గ్రామంలోనే కాకుండా మొండిగౌరెల్లి, నల్లవెల్లి, కొత్తపల్లి, తాడిపర్తి తదితర గ్రామాల్లో వందలాది మంది రైతులకు అప్పటి అధికారులు కేవలం పట్టాలు మాత్రమే ఇచ్చి భూమి చూపించలేదని ఆయా గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ వసంత కుమారిని సంప్రదించగా భూపంపిణీలో భూమి ఇవ్వకుండా పట్టాలిచ్చిన విషయమై వివరాలు సేకరిస్తామని అన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగు న్యాయం చేస్తానని అన్నారు.
పట్టా ఉంది.. భూమే లేదు!
Published Tue, Aug 5 2014 12:22 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM
Advertisement