పేదలంటే ప్రభుత్వానికి అలుసా!
పేదల ఇళ్లను కూల్చడం అన్యాయం
- ప్రజలకు మేలు చేయని ఎమ్మెల్యే రాజీనామా చేయాలి
- మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్
- బాధితులతో కలిసి రోడ్డుపై బైఠాయింపు
- న్యాయం చేయకుంటే ప్రజాసంఘాలతో పెద్ద ఎత్తు ఆందోళన చేస్తాం
జవహర్‌నగర్ : పేదలంటే ప్రభుత్వానికి అలుసుగా మారిందని, ఒక్క ఇంటిని కూల్చినా కేసీఆర్ ఫాంహౌజ్‌లో 100 ఇళ్లను నిర్మిస్తాం అని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్ఛన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్లార్) ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం జవహర్‌నగర్ గ్రామపంచాయతీ అంబేద్కర్‌నగర్‌లో రెవెన్యూ అధికారులు కూల్చిన ఇళ్లను పరిశీలించి వారి మద్దతుగా అంబేద్కర్‌నగర్ ప్రధాన ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేఎల్లార్ మాట్లాడుతూ.. ఉన్న గూడును కూల్చేసి వారిని రోడ్డున పడేయాలని ఆలోచించడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు.
జవహర్‌నగర్ భూములపై కోర్టులో కేసు నడుస్తుండగా.. ఇతర కంపెనీలకు ఎలా కేటాయిస్తారో.. ఏ విధంగా పేదల ఇళ్లను కూలుస్తారో కలెక్టర్ సమాధానం చెప్పాలన్నారు. పేద ప్రజలను రోడ్డున పడేయాలని ప్రభుత్వం ఆలోచిస్తే పార్టీలకతీతంగా ప్రజాసంఘాలు, అఖిలపక్ష నాయకులతో కలిసి ఉద్యమించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజలకు మేలు చేయలేని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధికి శంకస్థాపనలు చేసుకుంటూ ఫోజులివ్వడం తప్ప టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమిలేదన్నారు.
కార్యక్రమంలో శామీర్‌పేట జెడ్పీటీసీ బాలేష్, శామీర్‌పేట రైతు సహకార సంఘం చైర్మన్ పెంటారెడ్డి, ఎంపీటీసీలు మంజుల, యాదమ్మ యాదవ్, జైపాల్‌రెడ్డి, సుదర్శన్, మాజీ సర్పంచ్ శంకర్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల కోర్ కమిటీ సభ్యుడు గోనె మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ యువజన అధ్యక్షుడు బండకింది ప్రసాద్‌గౌడ్, మేడ్చల్ మహిళా నాయకురాలు రాగజ్యోతి, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌నగర్ అధ్యక్షుడు సదానంద్‌మాదిగ, జవహర్‌నగర్ ప్రధాన కార్యదర్శి బల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రవీందర్‌గుప్త, నాయకులు సిద్దులు యాదవ్, కుతాడి పెంటయ్య, గున్నారవి, కన్నయ్యరాజు, ఎరుకల వెంకటయ్య, అశోక్‌గుప్తా, ఐలయ్య,బొబ్బిలి యాదగిరి, అనిల్‌ముదిరాజ్, పాషామియా, కాలేషా, యాకయ్య, వాయేబ్, దుర్గిన్‌లతో పాటు అంబేద్కర్‌నగర్, బాలాజీనగర్ ప్రజలు పాల్గొన్నారు.