అభివృద్ధికి బాటలేద్దాం పేదరికాన్ని తరిమేద్దాం | kcr calls to pave way for development | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి బాటలేద్దాం పేదరికాన్ని తరిమేద్దాం

Published Mon, Feb 6 2017 1:39 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

అభివృద్ధికి బాటలేద్దాం పేదరికాన్ని తరిమేద్దాం - Sakshi

అభివృద్ధికి బాటలేద్దాం పేదరికాన్ని తరిమేద్దాం

జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలి
- పదేళ్ల తర్వాత మీ జిల్లా    ఎలా ఉండాలో ప్రణాళిక రూపొందించండి
- అనాథ పిల్లల బాధ్యత ఇక ప్రభుత్వానిదే..
- పది రోజుల్లో అసైన్డ్‌ భూముల సర్వే చేయాలి
- ఏడాదిలోగా కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాలు నిర్మించాలి


సాక్షి, హైదరాబాద్‌: ‘‘ప్రజలు ఓట్ల ద్వారా మాకిచ్చిన అధికారం... కలెక్టర్లుగా మీకు వచ్చిన అవకాశం.. అంతిమంగా ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలి. ఈ అవకాశం కొందరికే వస్తుంది. మనం కూడా వెయ్యేళ్లు బతకం. అందుకే అవకాశం ఉన్నప్పుడు కలకాలం నిలిచే విధంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి...’’అని సీఎం కేసీఆర్‌ అన్నారు. సమర్థ నాయకత్వం (ప్రొవైడింగ్‌ లీడర్‌ షిప్‌), ప్రజల్లో చైతన్యం(కౌన్సెలింగ్‌ ద పీపుల్‌), స్థానిక వనరుల గుర్తింపు(మ్యాప్‌ ద లోకల్‌ రిసోర్స్‌), ఆర్థిక వనరుల వినియోగం (ట్యాప్‌ ద వెల్త్‌ ) అనే నాలుగు ప్రాతిపదికలపై పనిచేయాలని జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ‘‘గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలి. ఎస్సీ, ఎస్టీలలో గుణాత్మక మార్పు రావాలి. బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయాలి. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను విజయవంతం చేయాలి. చిన్న జిల్లాల ఏర్పాటు ఫలితం ప్రజలకు అందాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులను అవగతం చేసుకోవాలి.

ప్రతి కుటుంబం జీవన స్థితి గతులను అధ్యయనం చేయాలి. పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించి వారికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలి. అంకితభావంతో పని చేస్తే అసాధ్యమేమీ కాదు. తెలంగాణ సాధనే అందుకు నిదర్శనం...’’అంటూ కలెక్టర్ల వెన్నుతట్టారు. ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌ ఎస్పీ సింగ్, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కనకయ్య, వెంకటేశ్వర్లు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, సీనియర్‌ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘కలెక్టర్లు బాగా పని చేస్తున్నారు. హాస్పిటళ్లు, హాస్టళ్లు సందర్శిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తే అనుకున్న లక్ష్యాలను తొందరగా అందుకుంటామనే నమ్మకం నాకున్నది’’అని ప్రశంసించారు. సమావేశంలో సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..

పదేళ్ల తర్వాత మీ జిల్లా
మీ జిల్లాకు ప్రణాళిక తయారు చేయండి. ఇప్పుడు మీ జిల్లా ఎలా ఉంది? పదేళ్ల తర్వాత ఎలా ఉండాలో మ్యాప్‌ రూపొందించండి. దాని ప్రకారం మనం పని చేద్దాం. వివిధ రంగాలకు సంబంధించి పదేళ్ల ప్రణాళిక రూపొందించాలి.

ప్రత్యేక కార్యక్రమాలు.. ప్రత్యేకాధికారులు
బీసీల అభివృద్ధి, కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీఎంవోలో ప్రత్యేకాధికారులను నియమిస్తాం. గొర్రెలు, చేపల పెంపకంతో ఆయా కుల వృత్తులకు అవసరమైన చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సెలూన్లు, హైజనిక్‌ లాండ్రీల ఏర్పాటు, ఇతర కుల వృత్తులకు సంబంధించిన కార్యక్రమాల రూపకల్పన జరుగుతోంది. సెలూన్ల పరిస్థితి మారాలి. గ్రామాల్లో చెట్ల కింద, బండల మీద కూర్చోబెట్టి కటింగ్, షేవింగ్‌ చేసే పరిస్థితి పోవాలి. హైజనిక్‌ సెలూన్లు రావాలి. ప్రభుత్వం వాటికి ఆర్థిక సాయం అందిస్తుంది. మానవ వనరులను గుర్తించి ప్రోత్సహించాలి. జనగామ–పెంబర్తిలో నగిషీ కళాకారులు, కరీంనగర్‌ పిలిగ్రీ ఆర్ట్స్‌లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వారున్నారు. ప్రతీ ప్రాంతంలో ప్రత్యేక నైపుణ్యమున్న మానవ వనరులను ప్రోత్సహించాలి.

గొర్రెలను మనమే ఎగుమతి చేయాలి
రాష్ట్రంలో 25 లక్షల మంది యాదవులున్నారు. గొర్రెల పెంపకంలో వారికి అపారమైన అనుభవముంది. కానీ ప్రతీ రోజూ 500 లారీల గొర్రెలు రాష్ట్రానికి దిగుమతి కావడం బాధాకరం. మన రాష్ట్రమే గొర్రెలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థితికి రావాలి. నీటి ప్రాజెక్టులు, కొత్త బ్యారేజీలు, రిజర్వాయర్లు, చెరువులు చేపల పెంపకానికి ఉపయోగించాలి.

జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీల ప్లాన్‌
రాష్ట్ర జనాభాలో 16-17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు, 50 శాతం మహిళలు ఉన్నారు. ఎస్సీలను ఊరికి దూరంగా ఉంచారు. ఎస్టీలను తండాలు, గూడెంలకు పరిమితం చేశారు. మహిళలను వంటింటికి పరిమితం చేశారు. 75 శాతం మందిని ఉపయోగించుకోవట్లేదు. ఇంత పెద్దమొత్తంలో మానవ వనరులను ఉపయోగించుకోని దేశం ప్రపంచంలో మనదొక్కటే. ఈ రుగ్మతను పోగొట్టాలి. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం. నిధులను క్యారీ ఫార్వర్డ్‌ చేసే అవకాశం కల్పిస్తాం. జిల్లాల వారిగా ఎస్సీ, ఎస్టీ ప్లాన్‌ సిద్ధం చేయాలి. బడ్జెట్‌ ప్రవేశ పెట్టేలోగా ప్రతిపాదనలు పంపించండి. గ్రామాలకు వెళ్లినపుడు కలెక్టర్లు కచ్చితంగా దళితవాడలు, ఎస్టీ తండాలను సందర్శించాలి.

మళ్లీ మన ఊరు–మన ప్రణాళిక
మన ఊరు–మన ప్రణాళిక కార్యక్రమాన్ని మరోసారి నిర్వహించాలి. గ్రామాల్లో ఎవరెవరి పరిస్థితి ఎలా ఉంది? వారికి ఏ అవసరం ఉంది? అనే విషయాలపై వివరాలు సేకరించాలి. దశల వారీగా అందరి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు తయారు చేయాలి. లబ్ధిదారులను ఎంపిక చేయడానికి లాటరీ పద్ధతిని అనుసరించాలి.

‘క్లీన్‌’గ్రామాలకు అవార్డులు
గ్రామాల్లో ‘క్లీన్‌ ద విలేజ్‌’అనే కార్యక్రమం చేపట్టాలి. కూలిపోయిన ఇళ్ల శిథిలాలు, ముళ్లపొదలు, చెత్తా చెదారం తొలగించాలి. పాడుపడ్డ బావులను, బోరు గుంతలు పూడ్చేయాలి. పరిశుభ్రతలో ఉత్తమంగా నిలిచిన గ్రామాలకు ‘కలెక్టర్‌ అవార్డు’పేరిట నగదు బహుమతి ఇవ్వాలి. దళిత కాలనీలు, గిరిజన తండాలకూ అవార్డు ఇవ్వాలి. గ్రామాల్లో ‘పవర్‌ డే’నిర్వహించాలి. వంగిన స్తంభాలు, వేలాడే తీగలను సరిచేయాలి. ప్రతీ గ్రామంలో డంపింగ్‌ యార్డుకు అవసరమైన స్థలం గుర్తించాలి.

పది రోజుల్లో అసైన్డ్‌ భూముల సర్వే
అసైన్డ్‌ ల్యాండ్స్‌ వివరాలు సేకరించాలి. అవి ఏ స్థితిలో ఉన్నాయి. ఎవరి వద్ద ఉన్నాయనే వివరాలతో పది రోజుల్లో సర్వే పూర్తి కావాలి. గ్రామాల్లో కమతాల ఏకీకరణ జరగాలి. అసైన్డ్‌ భూములు అన్యాక్రాంతమైతే వాటిని స్వాధీనం చేసుకుని, నిరుపేదలకు అందించాలి. అసైన్డ్‌ భూముల్లో వ్యవసాయం సాగేలా చూడాలి. సాదాబైనామాల ద్వారా పట్టాలిచ్చే కార్యక్రమం త్వరగా ముగించాలి.

పది రోజుల్లో కారుణ్య నియామకాలు
కారుణ్య నియామకాలు పది రోజుల్లో చేపట్టాలి. భార్యా భర్తలు ఒకేచోట పని చేసేలా బదిలీలు చేయాలి. రిటైరైన రోజు ఉద్యోగులను ప్రభుత్వ వాహనంలో ఇంటి దగ్గర దించి రావాలి. బాగా పని చేసిన అధికారులను గుర్తించి తగిన బహుమానం ఇవ్వాలి.

కలెక్టర్ల వద్ద రూ.5 కోట్లు
ప్రతి కలెక్టర్‌ వద్ద రూ.5 కోట్ల చొప్పున పెడతాం. వారి దృష్టికి వచ్చే సమస్యలను తక్షణం పరిష్కారం చేసేందుకు ఈ డబ్బు వినియోగించాలి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించాలి. ఏడాదిలోగా అన్ని జిల్లాల కార్యాలయాలు, పోలీస్‌ కార్యాలయాల నిర్మాణం పూర్తి కావాలి. అనాథ పిల్లల సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వమే స్వీకరించాలి. వారికి ప్రత్యేక స్కూళ్లు ఏర్పాటు చేసి మంచి విద్య, వసతి కల్పించాలి. కుటుంబంలో మరొకరికి ఆసరా పెన్షన్‌ వచ్చినప్పటికీ... అదే కుటుంబంలోని బీడి కార్మికులకు భృతి ఇవ్వాలి. జిల్లాల్లో ఒంటరి మహిళలను గుర్తించి, వారికి భృతి అందించాలి. వెటర్నరీ సైన్స్‌ చదివిన గ్రాడ్యుయేట్లకు వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించి పశు సంవర్ధక శాఖను బలోపేతం చేయాలి.

నిర్మాణాల వేగం ‘డబుల్‌’కావాలి
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో వేగం పెరగాలి. స్థానికంగా ఇళ్లు కట్టే వారితోనే నిర్మాణం చేయించండి. ప్రతీ గ్రామంలో శ్మశాన వాటికలు నిర్మించాలి. వాటికి ‘వైకుంఠధామం’అనే పేరు పెట్టాలి. రోడ్డు మీద గుంతలుండకుండా చర్యలు తీసుకోవాలి. గుంతలు పూడ్చకుంటే సంబంధిత అధికారిపై చర్య తీసుకోవాలి. హరితహారం మొక్కలను రక్షించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

పక్క రాష్ట్రాల నుంచి గొర్రెలు కొనాలి
జిల్లాల సరిహద్దులోని రాష్ట్రాల నుంచి గొర్రె పిల్లలను కొనుగోలు చేయాలి. తెలంగాణలో కొనవద్దు. కరీంనగర్‌ ఎల్‌ఎండీ వద్ద ఫిషరీస్‌ కాలేజీ ఏర్పాటుకు స్థలం గుర్తించాలి. వరంగల్‌ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. జనగామలో ఆత్మరక్షణ కోసం మహిళలకు సామూహిక శిక్షణ ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. కేంద్ర ప్రాయోజిత పథకాలను బాగా ఉపయోగించుకోవాలి. బీడీ కార్మికులు, నేత కార్మికులకు ఇళ్లు కట్టించే పథకం కింద కేంద్రం నుంచి నిధులు తేవడానికి ప్రతిపాదనలు పంపాలి. స్కూళ్ల యూనిఫారాలు స్థానిక దర్జీలే కుట్టేలా చూడాలి.

ఆ నైపుణ్యం ఐఏఎస్‌లకు కూడా ఉండదు!
‘‘గొర్రెలన్నీ ఒకే తీరుగ కనిపిస్తాయి. కానీ ప్రతి గొర్రెను ప్రత్యేకంగా గుర్తించే నైపుణ్యం యాదవులకుంటుంది. ఏదైనా గొర్రె అనారోగ్యంతో బాధపడితే దాన్ని గుర్తించి వైద్యం చేయిస్తడు. ఇతరులు కూడా తమ గొర్రె పిల్లలను మేపడానికి యాదవులకు ఇస్తారు. ఈ గొర్రె పిల్లలు పెద్దయినంక అది ఎవరిదో గుర్తించి వారికి అందజేస్తారు. అనుభవమే వారికి చదువు. అలాంటి నైపుణ్యం ఐఏఎస్‌ చదివిన వారికి కూడా ఉండదు’’అని సీఎం కేసీఆర్‌ సరదాగా చెప్పడంతో సదస్సులో నవ్వులు పూశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement