
విపక్షాల నిరసన గళం
దళితులకు భూపంపిణీలో అన్యాయంపై విపక్షాలు భగ్గుమన్నాయి.
► దళితులకు భూపంపిణీలో అన్యాయంపై ధ్వజం
► ఆత్మహత్యకు యత్నించిన బాధితులను పరామర్శించిన విపక్ష, ప్రజాసంఘాల నాయకులు
హైదరాబాద్ : దళితులకు భూపంపిణీలో అన్యాయంపై విపక్షాలు భగ్గుమన్నాయి. భూపంపిణీలో న్యాయం జరగలేదని ఎమ్మెల్మే రసమయి బాలకిషన్ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించిన బాధితులను వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు సోమవారం పరామర్శించారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి చెందిన మహంకాళి శ్రీనివాస్ (35), యాలాల పరశురాం(24) ఆదివారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన బాధితులు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
40 శాతం గాయాలకు గురైన శ్రీనివాస్ కిడ్నీలు పాడైపోయాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 48 గంటలు గడిస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు చెప్పారు. 35 శాతం గాయాలైన పరశురాం ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. మధ్యాహ్నం ఆస్పత్రికి వచ్చిన శ్రీనివాస్ భార్య తల్లి పోశవ్వ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితులను పరామర్శించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీమంత్రులు జీవన్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి మాజీ ఎంపీలు వి.హన్మంతరావు, పొన్నం ప్రభాకర్, మల్లు రవి ఆస్పత్రికి వచ్చారు.
సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీడీపీ నాయకులు రేవంత్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తడ్క జగదీశ్వర్‌గుప్త, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్, టీ మాస్ ఫోరం కన్వీనర్ జాన్‌వెస్లీ, ప్రజా గాయకురాలు విమలక్క, ప్రజా సంఘాల నేతలు గజ్జెల కాంతం, గోపాల్, జనార్దన్, శ్రీరాం నాయక్, రచయిత్రి సుజా త తదితరులు బాధితులను పరామర్శించారు. దళిత, ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఆస్పత్రి వద్ద పెద్ద ఎత్తున పోలీ సులు మోహరించారు. ఆస్పత్రి ఎదుట టీ మాస్ ఫోరం కార్యకర్తలు నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ప్రభుత్వంపై నేతల ఆగ్రహం
హామీలు నెరవేర్చాలి: భట్టి
ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ఎంత నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయో ఈ ఘటనలో బయటపడింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర మేల్కొని హామీలను నెరవేర్చాలి.
సీఎంపై కేసు పెట్టాలి: వీహెచ్
దళిత యువకుల ఆత్మహత్య ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలి. ఆయనపై కేసు నమోదు చేయాలి. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి ఇప్పుడు నెరవేర్చకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లంచాలు అడిగితే చెప్పుతో కొట్టమని సీఎం ప్రకటించారు. ముఖ్యమంత్రి మాటలు సినిమా డైలాగుల్లా ఉంటున్నాయి.
కేసీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయాలి: రేవంత్
దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బాధ్యుడిని చేస్తూ హత్యానేరం కింద కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాలి. దళితులపై దాడుల ఘటనల్లో బాధితులకు రూ.10 లక్షల పరిహారం, 3 ఎకరాల భూమి ఇవ్వాలి. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అవినీతిలో మునిగి తేలుతుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు గ్రామాలపై పడి లంచాలు వసూలు చేస్తున్నారు.
పరిహారం చెల్లించాలి: కోదండరాం
గ్రామ స్థాయిలో పరిపాలన కుప్పకూలిపోయిందనడానికి ఇదే నిదర్శనం. దీన్ని ఒక ఘటనగా తీసుకోకుండా పాలనాపరమైన లోపంగా గుర్తించాలి. ఎమ్మార్వో, ఆర్డీవో తదితర అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ బాధితులు తిరిగినా ఎక్కడా న్యాయం జరగలేదు. దీంతో ఆత్మహత్యకు యత్నించారు. ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం, భూమి అందించాలి. వారి వైద్య ఖర్చులను భరించాలి.
సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ: చాడ
బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి. కేవలం వీఆర్వోనే కాకుండా ఆర్డీవో, ఆపై స్థాయి అధికారులపై పూర్తి స్థాయి విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. అధికారులు భూమి ఉన్నవారినే భూపంపిణీకి ఎంపిక చేసి, ఇంచ్ భూమి లేనివారిని విస్మరించారు. ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లినా న్యాయం జరగకపోవడంతో దళిత యువకులు ఆత్మహత్యకు యత్నించారు.
రాజకీయ రాబందులే కారణం: తమ్మినేని
భూ పంపిణీలో ఎమ్మెల్యే, జడ్పీటీసీ అవినీతికి పాల్పడి అర్హులకు భూ పంపిణీలో చోటు లేకుండా చేశారు. రాజకీయ రాబందులే ఈ ఘటనకు కారణం. చిన్న, చిన్న అధికారులను బలి చేయకుండా రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేయాలి. మంగళవారం నుంచి టీ మాస్‌తో కలసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం.
ప్రభుత్వానిదే బాధ్యత: విమలక్క
పెట్టుబడి దారులకు, కార్పొరేట్ సంస్థలకు వందల ఎకరాలు దారాదత్తం చేస్తున్న ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామిలు విస్మరించి దళితులకు భూ పంపిణీ చేయడం లేదు. అందుకే ఈ ఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలి.
మూల్యం చెల్లించక తప్పదు: మంద కృష్ణ
కేసీఆర్ పాలనలో ఇప్పటివరకు 120 మంది దళితులను హత్య చేశారు, 50 మందిపై అత్యాచారం జరిగింది, 5 వేల మందిపై దాడులు జరిగాయి. దీనికి ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తాజా ఘటనపై ఈ నెల 5, 6వ తేదీల్లో మండల కార్యాలయాలను ముట్టడిస్తాం. 7వ తేదీన భూ పంపిణీపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ విడుదల చేస్తాం.
హామీలు విస్మరించారు: జగదీశ్వర్‌గుప్తా
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు అనేక హామీలు గుప్పించినా ఏ ఒక్కటి నెరవేర్చలేదు. దీంతో ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి. ఈ ఘటనలో హరీశ్‌రావు బంధువు జడ్పీటీసీ డబ్బు తీసుకుని అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలి.