సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు అధికార యంత్రాంగం ఆ దిశగా కార్యాచరణకు దిగింది. ఒకవైపు ఇళ్ల స్థలాలకు అవసరమైన భూములను గుర్తించడంతోపాటు మరోవైపు లబ్ధిదారుల గుర్తింపును కూడా సమాంతరంగా చేపట్టింది. వచ్చే ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాలని ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉండటంతో అధికార యంత్రాంగం పేదల ఇళ్ల స్థలాల కోసం అనువైన భూములను గుర్తించే పనిలో తలమునకలైంది.
ఇప్పటివరకు 10,674 గ్రామాల్లో 26,527.73 ఎకరాలు.. 72 పట్టణ ప్రాంతాల్లో 4,348.23 ఎకరాలు కలిపి 30,875.96 ఎకరాల భూములను అధికారులు గుర్తించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు పంపిణీ చేయడానికి అధికారులు లక్షల సంఖ్యలో వ్యవసాయ భూములను గుర్తించారు. ఇప్పుడు అదే తరహాలో వైఎస్ జగన్ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం భూములను గుర్తిస్తోంది. గత ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం భూములను గుర్తించకపోగా బడా పారిశ్రామికవేత్తల కోసం ఏకంగా పది లక్షల ఎకరాలతో భూ బ్యాంకును ఏర్పాటు చేసింది. పేదల విషయంలో గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి స్పష్టమైన తేడా కనిపిస్తోందని అధికార యంత్రాంగమే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
17.34 లక్షల మంది అర్హులు
రాష్ట్రంలో ఈ ఏడాది ఆగస్టు 26 నుంచి ఇంటింటికీ వెళ్లి గ్రామ, వార్డు వలంటీర్లు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఇళ్ల స్థలాలు లేని, ఇళ్లు లేని పేదలందరినీ గుర్తించారు. గత నెలాఖరుకు రాష్ట్రంలో మొత్తం కుటుంబాల సర్వేను వలంటీర్లు పూర్తి చేశారు. లబ్ధిదారుల వివరాలను ఆధార్ అనుసంధానం ద్వారా డూప్లికేట్ లేకుండా రియల్‌టైమ్ గవర్నెన్స్ చర్యలు చేపట్టింది. తద్వారా 24.83 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించింది. ఈ లబ్ధిదారుల అర్హతలు, తనిఖీల ప్రక్రియను తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ఏకకాలంలో కొనసాగిస్తున్నారు.
తనిఖీల అనంతరం ఇప్పటివరకు 12,84,611 మంది లబ్ధిదారులు ఇళ్ల స్థలాలకు అర్హులని తేల్చారు. వీరు కాకుండా 4,50,206 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి గుర్తించారు. ఇలా ఇప్పటివరకు 17,34,817 మంది లబ్ధిదారులను ఇళ్ల స్థలాలకు అర్హులుగా తేల్చారు. ఇంకా తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల తనిఖీల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 7లోగా ఇంకా ఎంత భూమి అవసరమనేది అధికారులు నిర్ధారించనున్నారు. అవసరమైన భూమిని వచ్చే ఏడాది జనవరి 25లోగా కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే లబ్ధిదారులందరికీ ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో మార్కింగ్ చేసి చూపిస్తారు. అంతేకాకుండా ఆ కుటుంబాల మహిళల పేరిట ఉగాది నాడు ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment