కలల గృహాలకు కదలిక | AP Govt Distributes House Sites On 25th December | Sakshi
Sakshi News home page

కలల గృహాలకు కదలిక

Published Sun, Nov 22 2020 8:55 PM | Last Updated on Sun, Nov 22 2020 10:02 PM

AP Govt Distributes House Sites On 25th December - Sakshi

సాక్షి, అమరావతి : పేదల కలల గృహాలకు కదలిక వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడున్నరేళ్లలో 30 లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 15 లక్షల ఇళ్లు నిర్మించేందుకు గృహ నిర్మాణ సంస్థ అవసరమైన కసరత్తు ప్రారంభించింది. పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నందున సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా వస్తువులు కొనుగోలు చేయనున్నారు. 67.50 లక్షల టన్నుల సిమెంట్, 7.20 లక్షల టన్నుల ఇనుముతో పాటు పెద్ద ఎత్తున మెటల్, రంగులు (పెయింట్‌) అవసరం కావడంతో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా వాటిని సేకరించేందుకు అధికారులు విధి విధానాలు తయారు చేస్తున్నారు. డిసెంబర్‌ 25వ తేదీన ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో అదే రోజు ఇంటి మంజూరు పత్రాన్ని కూడా లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయనున్నారు. పట్టాలు మంజూరైన పేదలందరికీ గృహాలు నిర్మిస్తారు. నాణ్యమైన నిర్మాణ సామగ్రి, మార్కెట్‌ ధర కంటే తక్కువకు ఉత్పత్తిదారుల నుంచి లబ్ధిదారులకు అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. లే అవుట్‌ కాలనీల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు, మంచి నీరు, విద్యుదీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.
 
గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర  
ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించనున్నారు. లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా ప్రారంభం మొదలు వారి ఖాతాలకు బిల్లులు జమ అయ్యే వరకు గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించనున్నాయి. అందులో పని చేస్తున్న డిజిటల్, వెల్ఫేర్, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో పాటు వలంటీర్లు క్షేత్ర స్థాయిలో పని చేస్తారు.  

నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం 
ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వనుంది. నిర్మాణాలను పర్యవేక్షించే ఇంజినీర్లు, తాపీ పని చేసే వారికి ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. అందుకు గృహ నిర్మాణ సంస్థ ఇంజినీర్లకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చేలా తిరుపతి ఐఐటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు లేకుండా మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్ల వివరాలను ఇప్పటికే గ్రామ, పట్టణాల వారీగా సేకరించారు. ఇళ్ల నాణ్యతను ఎప్పటికప్పుడు టెక్నికల్‌ కమిటీ పర్యవేక్షిస్తుంది.   

సొంతంగా ఇల్లు నిర్మించుకుంటే పరికరాలు ఇస్తాం 
లబ్ధిదారులు సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు వస్తే వారి ఐరన్, సిమెంట్, బ్రిక్స్, తలుపులు, కిటికీలు తదితర పరికరాలు ఇస్తాం. నిర్మాణానికి అవసరమైన ఇసుక కూడా ఉచితమే. డిసెంబర్‌ 25న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పట్టాలు పంపిణీ చేసే రోజే 10 వేల మందికి ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వడమే కాకుండా వాటికి మ్యాపింగ్‌ చేస్తాం. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలందరికీ నిర్మిస్తాం.
- చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి

మొదటి విడత ఇళ్లు మంజూరు ఇలా
 

జిల్లా ఇళ్ల సంఖ్య
తూర్పు గోదావరి 2,40,100
కృష్ణా 1,75,939
విశాఖపట్నం 1,70,912
గుంటూరు 1,58,710
పశ్చిమ గోదావరి 1,54,855
చిత్తూరు 1,41,087
అనంతపురం 1,01,310
వైఎస్సార్‌ కడప 76,445
ప్రకాశం 70,990
కర్నూలు 58,738
శ్రీకాకుళం  56,608
విజయనగరం  51,767
నెల్లూరు 42,539

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement