అవిద్య, పేదరికం వల్లే అస్పృశ్యత | hareesh rao speech on ambethkar jayanthi | Sakshi
Sakshi News home page

అవిద్య, పేదరికం వల్లే అస్పృశ్యత

Published Fri, Apr 15 2016 2:23 AM | Last Updated on Fri, Aug 17 2018 8:11 PM

అవిద్య, పేదరికం వల్లే అస్పృశ్యత - Sakshi

అవిద్య, పేదరికం వల్లే అస్పృశ్యత

అంబేద్కర్ జయంతి సభలోమంత్రి హరీశ్‌రావు
71 మంది దళితులకు భూ పంపిణీ

సంగారెడ్డి టౌన్ : డాక్టర్ బీఆర్  అంబేద్కర్ చూపిన బాటలో నడవడమే ఆయనకు మనం అర్పించే నివాళి అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి  హరీశ్‌రావు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవిద్య, పేదరికం వల్ల అస్పృశ్యతకు గురవుతున్నారన్నారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకు ముందుకు స్థానిక జెడ్పీ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభ వద్దకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వెనుకబాటు తనాన్ని రూపుమాపడానికి ప్రభుత్వం కేజీ టు పీజీ పీజీ విద్యను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల కాస్మొటిక్ చార్జీలు పెంచుతామన్నారు. సాగుకు యోగ్యమైన 1236 ఎకరాల భూమిని 70 కోట్ల ఖర్చుతో జిల్లాలోని దళితులకు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో భూ పంపిణిలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు.  జిల్లాలో 11 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరయ్యాయన్నారు. ఈ సందర్భంగా123.39 ఎకరాల భూమిని 5.79 కోట్లతో 71 మంది దళితులకు పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ కింద ఒకరికి హోండా కారును, మరొకరికి కంకర యంత్రాన్ని అందజేశారు.

 మహిళా సంక్షేమానికి కృషి చేయాలి : కలెక్టర్
మహిళా సంక్షేమానికి అందరూ కృషి చేయాలని కలెక్టర్ రోనాల్డ్ రాస్ అన్నారు. అప్పుడే అంబేద్కర్ ఆశయం నెరవేరుతుందన్నారు. అంబేద్కర్ ఆశయాలు అన్ని కాలాల్లో ఆచరణీయమన్నారు. కల్యాణలక్ష్మి కింద 2848 కుటుంబాలకు రూ.51 వేల చొప్పున అందించామని వెల్లడించారు. కల్యాణలక్ష్మి నెల రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 27 వేల మంది పోస్టు మెట్రిక్ విద్యార్థులకు 25.65 కోట్లు, 20635 మంది ప్రీ మెట్రిక్ విద్యార్థులకు రూ.3.85 కోట్లు అందించామన్నారు.

50 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగిస్తున్న వారికి 92738 కుటుంబాలకు విద్యుత్ చార్జీల కింద 2.35 కోట్లు విద్యుత్ బోర్డుకు చెల్లించామని చెప్పారు. ఎస్సీలకు స్వయం ఉపాధి కింద ఇస్తున్న సబ్సిడీని 50 నుంచి 80 శాతానికి పెంచామన్నారు.  కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎంపీ బీబీ పాటిల్,  ఏజేసీ వాసం వెంకటేశ్వర్లు, డీఆర్వో దయానంద్, జెడ్పీ సీఈఓ అలుగు వర్షిణి, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, జెడ్పీటీసీ మనోహర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బీరయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 నాగవ్వకు అంబేద్కర్ అంటే అభిమానం
మిరుదొడ్డి: నిరక్ష ్యరాస్యురాలైన ఆ అవ్వ పేరు జోడోళ్ల నాగవ్వ. మండల పరిధిలోని కాసులాబాద్‌లోని 9వ వార్డు సభ్యురాలు. కూలీ నాలీ చేసుకోవడమే ఆమె వృత్తి. అక్షరం ముక్క రాకపోయినా ఆమెకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటే ఎంతో అభిమానం. ఆయన జయంతి, వర్ధంతి రోజున గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం ఆనవాయితీగా పెట్టుకుంది. గురువారం అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిసి అధికారులతో పాటు ఆమె దండ వేసి నివాళుర్పించింది. అంబేద్కర్ అంటే ఎందుకింత అభిమానం అని  ప్రశ్నించగా పెద్ద సారు అందరు మంచిగుండాలని గదేదో పెద్ద పుస్తకం (రాజ్యాంగం) రాసిండట. గాయిన పెట్టిన రిజర్వేషన్లతోనే నేను వార్డు సభ్యురాలిగా పోటీ చేసి గెలిచా అంటోంది.. అక్షరం ముక్క రాక పోయినా అంబేద్కర్‌పై అవగాహన కలిగిన ఈ నాగ వ్వను పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement