పాత పట్టాలకు పునర్జీవం | TDP Land Distributing In Election Time | Sakshi
Sakshi News home page

పాత పట్టాలకు పునర్జీవం

Published Wed, Mar 20 2019 3:11 PM | Last Updated on Wed, Mar 20 2019 3:11 PM

TDP Land Distributing In Election Time - Sakshi

పట్టాలు రద్దయిన స్థలంలో తిరిగి నిర్మాణాలు చేపట్టిన దృశ్యం

సాక్షి, ఆత్మకూరు (నెల్లూరు): ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని నెల్లూరు పాళెం సెంటర్‌ సమీపంలో జాతీయ రహదారి పక్కనే లక్షలాది రూపాయలు విలువగల ప్రభుత్వ భూమిని (రద్దయిన పట్టాల భూమి) టీడీపీ అభ్యర్థికి సహకరిస్తున్నారని అప్పనంగా కట్టబెట్టిన వైనమిది. వివరాలు.. ఆత్మకూరు పట్టణంలో  1999లో అప్పటి ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు టైలర్లకు ఇళ్ల నివేశన స్థలాలు సర్వే నంబర్‌ 1906లో పట్టాలు మంజూరు చేయించారు. సుమారు 108 మందికి ఈ పట్టాలు అందచేశారు. స్థలాలు పట్టణానికి దూరంగా ఉండటంతో పట్టాలు అందుకున్న వారెవ్వరూ  ఈ స్థలాల గురించి పట్టంచుకోలేదు. అనంతరం ఈ పట్టాలను రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే ఐదేళ్ల క్రితం ఆత్మకూరు మున్సిపాలిటీగా రూపాంతరం చెందడంతో ఆ స్థలాలకు డిమాండు పెరిగింది. ఈ క్రమంలో ఇటీవల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవడంతో  మైనార్టీలను ఆకట్టుకునేందుకు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తే తిరిగి పట్టాలు వచ్చేలా చేస్తామని వారికి ఆశ చూపారు. దీంతో అభ్యర్థివద్దకు వారందరినీ తీసుకుని వెళ్లి మంతనాలు జరిపారు. దీంతో ఆయన అంగీకారం తెలుపుతూ అధికారులతో మాట్లాడి ఆ స్థలాన్ని చదును చేసేందుకు తన ‘సహకారం’ అందించారు. అంతే సర్వే నంబరు1906లోని రెండు రోజుల వ్యవధిలో రేకుల గదుల ఏర్పాటు, ఇళ్ల నిర్మాణాల పనులు ఊపందుకున్నాయి.

దండకాలు షురూ..! 
అప్పట్లో ప్రభుత్వం పేదలైన టైలర్‌ కుటుంబాలకు నివేశన స్థలాలు మంజూరు చేసేందుకు పట్టాలు అందజేసింది. అయితే వారు అప్పట్లో నిర్మాణాలు చేపట్టక పోవటంతో అవి రద్దయ్యాయి. తిరిగి ఆ పట్టాలు పొందాలంటే ఒక్కొక్కరూ ఒక్కో పట్టాకు రూ. 2 వేల చొప్పున చెల్లించాలంటూ దళారులు దండకాలు చేపట్టారు. అప్పట్లో 108 మందికి పట్టాలు పంపిణీ చేస్తే ఇప్పుడు     అదే స్థలంలో 150 మందికి పైగా పట్టాల కోసం దళారులకు డబ్బులు చెల్లించటం విశేషం. దండకాల్లో భాగంగా నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ తరఫున పట్టాల కోసం నగదు చెల్లించటంతో అసలైన లబ్ధిదారులు విస్తు పోతున్నారు. 20 ఏళ్ల క్రితం టైలర్లుగా ఉన్న కొందరు మృతి చెందటం, కొందరు ఊరు విడిచి వెళ్లటం, కొంతమంది వివిధ ఉద్యోగాలలో చేరారు. వారి స్థానంలో కొత్త వారిని చేరుస్తామంటూ సదరు నాయకులు నగదు వసూలు చేశారు.

అసలైన పేదలకు అన్యాయం
అప్పట్లో టైలర్‌ వృత్తి చేస్తూ అనారోగ్యానికి గురై పక్షవాతం సోకి జీవనం కోసం సత్రం సెంటర్‌లో బడ్డీ బంకు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వ్యక్తి వద్ద రూ. 2వేలు డిమాండు చేయటంతో అతను ‘తండల్‌’కు తెచ్చి చెల్లించాడు. ఇదే క్రమంలో బస్టాండు సెంటర్‌లో ఏళ్ల తరబడి టైలర్‌ పని చేసి ప్రస్తుతం మంచంలో ఉన్న ఖాజా మస్తాన్, సత్రం సెంటర్‌లో టైలర్‌ పని చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న నజీర్‌ తదితరులు పేర్లు తొలగించారు. ఇలా ఇష్టారాజ్యంగా అసలైన లబ్ధిదారులను తొలగించి నగదు చెల్లించిన వారికి పట్టాలు మంజూరు చేసేందుకు దళారులు పూనుకోవటం పట్ల పేదలు మండి పడుతున్నారు. దళారులలో ఓ ప్రధాన వ్యక్తి రూ.2 వేలు చొప్పున చెల్లించిన వారికి చీటీలు వేసి డిప్‌ ద్వారా ఫ్లాట్‌ నంబర్‌ కేటాయించటం విశేషం.

ఆయన కేటాయించిన మేరకే ఫ్లాట్లు ఇస్తారని ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఉన్నతాధికారులు పరిశీలించి అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. ఈ విషయమై మండల తహసీల్దార్‌ విద్యాసాగరుడుని సంప్రదించగా ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టకపోవటంతో అవి గడువు తీరిన అనంతరం ప్రభుత్వ స్థలాల కిందే లెక్క. అక్కడ నిర్మాణాలు చేపడుతున్న విషయం తెలియటంతో సిబ్బందిని పంపి నిలుపుదల చేయించా. ఇప్పుడు మళ్లీ నిర్మాణాలు చేస్తుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement