పల్నాడు షో అట్టర్‌ ఫ్లాప్‌! | TDP Show Utter Flop In Palnadu | Sakshi
Sakshi News home page

పల్నాడు షో అట్టర్‌ ఫ్లాప్‌!

Published Sat, Sep 14 2019 9:41 AM | Last Updated on Sat, Sep 14 2019 9:46 AM

TDP Show Utter Flop In Palnadu - Sakshi

చలో ఆత్మకూరు పేరిట టీడీపీ ఆడిన నాటకం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో పార్టీ క్యాడర్‌ డీలాపడింది. కోడెల కుటుంబం అరాచకాలపై వరుసగా కేసులు నమోదవడం, అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల శివప్రసాదరావు తరలించుకోవడం, యరపతినేని సాగించిన అక్రమ మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తు వ్యవహారం నేపథ్యంలో పార్టీ మారేందుకు క్యాడర్‌ సిద్ధమైంది. ఈ స్థితిలో పార్టీని కాపాడుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. కుటుంబ కలహాలు, వ్యక్తిగత గొడవలను అధికార వైఎస్సార్‌ సీపీకి అంటగడుతూ రచించిన ఈ నాటకానికి ప్రజల నుంచి కనీస స్పందన కూడా కరువైంది.

సాక్షి, గుంటూరు: సార్వత్రిక ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితమై టీడీపీ ఘోర పరాజయం పాలైంది. గత ఐదేళ్లలో నాయకులు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కే–ట్యాక్స్‌లు, అసెంబ్లీ ఫర్నిచర్‌ దొంగలించడం, ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేయడం వంటి కేసుల్లో మాజీ స్పీకర్‌ కోడెల కుటుంబం కొట్టుమిట్టాడుతోంది. యరపతినేని అక్రమ మైనింగ్‌ కేసు విచారణలో సీబీఐ రంగంలోకి దిగబోతోంది. మాజీ మంత్రి ప్రత్తిపాటిని సైతం కేసుల భయం చుట్టుముడుతోంది. దీంతో పల్నాడు సహా, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్‌ బీజేపీలోకి జారుకోవడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. వంద రోజుల్లోనే ఎన్నికలకు ముందు అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజకమైన పాలన అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీలా పడ్డ క్యాడర్‌లో చలనం తీసుకురావాలంటే ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు, ఆ పార్టీ ముఖ్య నాయకులు నిశ్చయించుకున్నారు.

చలో ఆత్మకూరుతో నాటకం మొదలు...
నారా ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో చంద్రబాబు డైరెక్షన్‌లో ‘చలో ఆత్మకూరు’ అనే బ్యానర్‌తో టీడీపీ నాటకం మొదలు పెట్టింది. కుటుంబ కలహాలు, వ్యక్తిగత గొడవలు, గత ఐదేళ్ల పాలనలో అధికారం అండతో అరాచకాలకు పాల్పడి అధికారం కోల్పోవడంతో గ్రామస్తులు ఏం చేస్తారోనని భయపడి గ్రామాలను వదిలిన వారిని కుటుంబానికి రూ.10వేలు ఇస్తామని పునరవాస కేంద్రంలో పోగు చేశారు. పల్నాడులో అరాచకాలు, అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేపట్టారు. అయితే పల్నాడు ప్రాంత ప్రజలు బాబు దుష్ప్రచారాన్ని చూసి చీదరించుకున్నారు. ఇప్పటికే కోడెల, ప్రత్తిపాటి, యరపతినేని అరాచకాలకు పల్నాడు ప్రాంత ప్రతిష్టను దిగజార్చారని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో లేని అలజడులు సృష్టిస్తున్నారని చంద్రబాబుపై పల్నాడు ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు.

క్యాడర్‌లో చలనం లేని వైనం...
గత ఐదేళ్ల పాలనలో అధికారం అడ్డుపెట్టుకుని జిల్లాలో ఆ పార్టీ నాయకులు మట్టి నుంచి దేన్ని వదలకుండా దోచుకుతిన్నారు. దీంతో జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లకే ఆ పార్టీని జిల్లా ప్రజలు పరిమితం చేశారు. దీంతో క్యాడర్‌ ఎప్పుడో సర్దుకున్నారు. చంద్రబాబు చలో ఆత్మకూరు పేరుతో హైడ్రామాకు తెరలేపినా క్యాడర్‌లో ఎటువంటి చలనం రాలేదు. ఇప్పటికే టీడీపీ నాయకులు గత ఐదేళ్లలో చేసిన అరాచకాల కారణంగా గ్రామాల్లో క్యాడర్‌కు తల ఎత్తుకుని తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేస్తున్న డ్రామాకు మద్దతు పలికితే ఉన్న పరువు కూడా పోతుందని పల్నాడుకు చెందిన టీడీపీ శ్రేణులు చాలా వరకూ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

పల్నాడులో నవ్వులపాలు..
ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఏదో జరుగుతోందన్న వాదన లేవనెత్తి పల్నాడు ప్రాంతంలో నవ్వుల పాలయ్యామని ఆ పార్టీ ముఖ్యనాయకులు చర్చించుకుంటున్నారు. ఈ కార్యక్రమంతో కాస్తో కూస్తో ఉన్న క్యాడర్‌ కూడా పార్టీకి దూరమయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా లబ్ధి పొందిన వారు మాత్రమే చలో ఆత్మకూరుకు సిద్ధమయ్యారని, నిజమైన కార్యకర్తలు దూరంగా ఉన్నారనే చర్చలు నడుస్తున్నాయి. (చదవండి: ఆత్మకూరులో అసలేం జరిగింది?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement