పేదలకందిన భూమి
►మంత్రి ఈటెల చేతులమీదుగా 307 ఎకరాలకు హక్కులు
►రూ.8.42 కోట్లతో కొనుగోలు
►122 మంది దళిత మహిళలకు పట్టాలు
కరీంనగర్ :నిరుపేద దళితుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ పంపిణీ మొదటివిడత కార్యక్రమం పంద్రాగస్టు వేదికగా ప్రారంభమైంది. ఎన్నో అవాంతరాలు, అనేక అభ్యంతరాలు, సవాలక్ష నిబంధనల మధ్య అనుకున్న సమయానికి వీలైనన్ని గ్రామాల్లో భూములు కొనుగోలు చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. నెలరోజులకు పైగా శ్రమించిన అధికారయంత్రాంగం చేతులెత్తేస్తుందని భావించినా.. చివరకు ఒకట్రెండు రోజుల్లోనే ప్రక్రియకు తుదిరూపం తీసుకురావడం గమనార్హం. జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేతులమీదుగా 122 మందిదళితమహిళలకు 302 ఎకరాలకు సంబంధించిన పట్టాలు అందించారు.
ముకరంపుర : నిరుపేద దళిత కుటుంబానికి మూడెకరాలు కేటాయించాలని సర్కారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమానికి ఆది నుంచీ అవాం తరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఐదేళ్ల నుంచి సాగులో ఉన్న పట్టా భూములను కొందామ న్నా.. ‘బేరం’ కుదరకపోవడం, ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారులకు సరిపడా భూములు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ముందుగా మండలంలోని ఒక గ్రామాన్ని ఎంచుకుని లబ్ధిదారులను గుర్తించాలని భావిం చిన ప్రభుత్వం.. కొద్దిరోజులకు నియోజకవర్గానికో గ్రామాన్ని ఎంచుకోవాలని నిర్ణయించింది. అయినా వారికీ భూములు లభ్యం కాకపోవడంతో మొదటివిడతలో పరిమిత సంఖ్యలో లబ్ధిదారులను ఎంపికచేయాలని ఆదేశించింది.
ఈ మేరకు జిల్లాలో ఆరుగురి నుంచి తొమ్మిది మందిని హైదరాబాద్‌లోని గోల్కొండకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు పంపాలని సీఎం ఆదేశించారు. మరోవైపు జిల్లాలోనూ భూ పంపిణీ ప్రారంభించాలని ఆదేశించడంతో ఆగమేఘాలపై గురువారం రాత్రి నుంచి పొద్దుపొడిచే వరకూ క్షే త్రస్థాయి నుంచి ఉన్నతాధికారులు కసరత్తు వేగిరం చేశారు. నియోజకవర్గానికో గ్రామం పక్కనపెట్టి పట్టా భూములు ఎక్కడ లభిస్తే అక్కడే లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఇలా 12 నియోజకవర్గాల్లో 16 గ్రామాలను ఎంపిక చేసి 122 మందిని గుర్తించారు. వీరికి 307. 57 ఎకరాలు అందించేందుకు రూ.8,42,69,741 వెచ్చించారు.
ఇందులో ఆరు గ్రామాల్లో 53 మంది లబ్ధిదారులకు 117.71 ఎకరాల ప్రభుత్వభూమి, మిగిలిన 69 మందికి 10 గ్రామాల్లో 190 ఎకరాల పట్టా భూమిని రూ.8.42 కోట్లతో కొని లబ్ధిదారులకు అందించారు. మరోవైపు ఎంపిక చేసిన గ్రామాల్లో పట్టా భూములు ప్రభుత్వ ధరకు బేరం కుదరక పంపిణీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. విడతలవారీగా భూ పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. సాగుయోగ్యమైన భూములు అమ్ముకోవడానికి రైతులెవరూ ముందుకు రావడం లేదు. భూములన్న చోట అర్హులు లేకపోవడం.. ప్రభుత్వ నిబంధనల కిరికిరి కొనసాగుతుండడంతో ఈ ప్రక్రియ ఎంతటితో సరిపెడతారోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.