నిరుపేద దళితులకు మూడెకరాల భూపంపిణీలో మార్గదర్శకాలు మారిన నేపథ్యంలో... మండలానికో గ్రామం కాకుండా....నియోజకవర్గానికో గ్రామాన్ని ఎంపిక చేశారు. దీనికి ఓ ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. ఆర్డీఓలు ఉన్న చోట వారే ఆ నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తారు. ఎంపిక చేసిన గ్రామంలో వీలైనంత త్వరగా ‘‘ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, లేనిచోట ప్రత్యామ్నాయాలపై’’ ప్రత్యేక అధికారులు కసరత్తు చేస్తున్నారు.
నీలగిరి
దళితుల భూ పంపిణీ పథకంలో ఇటీవల ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. తొలుత చెప్పిన విధంగా మండలానికో గ్రామం కాకుండా.. నియోజకవర్గానికి ఒక గ్రామంలో మాత్రమే భూ పంపిణీ చేపట్టాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే భూ పంపిణీని అమలు చేసేందుకు కొత్త మార్గదర్శకాలు అధికారులకు ఓ పరీక్షగా తయారయ్యాయి. దీంతో ఇప్పటివరకు చేపట్టిన ప్రక్రియ అంతా కూడా మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తోంది.
భూముల కోసం అన్వేషణ
అధికారులు గ్రామాలను జల్లెడ పడుతున్నారు. ప్రభుత్వ భూములెన్ని ఉన్నాయి.. ఎంత మేర ఉన్నాయో లెక్కలు తీస్తున్నారు. ప్రభుత్వ భూములు లేకపోవడంతో అధికారులు ప్రైవేటు భూముల అన్వేషణ మొదలుపెట్టారు. ఆగస్టు మొదటి వారంలోగా ఈ ప్ర క్రియ అంతా పూర్తిచేసి స్వాతంత్య్ర దినోత్సవం రోజు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాల్సి ఉంది. దీంతో ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ఇప్పటికే 12 నియోజకవర్గాల్లో 12 గ్రామాలను ఎంపిక చేశారు. అయితే కోదాడ, నాగార్జునసాగర్, మునుగోడు నియోజకవర్గాల్లో రెండేసి గ్రామాలను ఎంపిక చేశారు. వీటిలో భూమి లభ్యతను బట్టి ఏదేని ఒక గ్రామం ఎంపిక అవుతుంది. ఆయా గ్రామాల్లో భూ ముల లభ్యతకు సంబంధించి అధికారులు దృష్టి సారించారు.
కొత్త మార్గదర్శకాలు..
కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రధానంగా భూ లభ్యతకు ప్రాధాన్యం ఇచ్చారు. గ్రామంలో ఎస్సీలు తక్కువగా ఉన్నప్పటికీ...ప్రైవేటు భూములు సాగుకు యోగ్యంగా ఉండేలా గుర్తించి ఖర్చును తగ్గిం చాలని పేర్కొన్నారు. దీనిపై బుధవారం జిల్లా అధికారులు పలుమార్లు చర్చించిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో సాగుకు యోగ్యమైన భూములను గుర్తించే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించారు.
లబ్ధిదారులకే నిర్ణయాధికారం..
మండల స్థాయిలో తహసీల్దార్ల ఆధ్వర్యంలో కొనుగోలు కమిటీ ఉంటుంది. కానీ గ్రామాల్లో ఎంపిక చేసిన లబ్ధిదారుల ఇష్టపూర్వకంగానే భూమిని గుర్తిస్తారు. భూముల ధర నిర్ణయించే విషయంలో కూడా లబ్ధిదారుల అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. ఆ గ్రామంలో ప్రభుత్వం నిర్ణయించిన భూముల ధరల ప్రకారం కొనుగోలు చేస్తారు. భూముల ధర నిర్ణయం ఖరారైన అయిన తర్వాత జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా గ్రామాల్లో సాగు చేసుకుంటున్న భూములను అమ్ముకునేందుకు ఎవరూ ఇష్టపడే పరిస్థితి లేదు. మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం ధర మూడింతలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములు లేని చోట ప్రైవేటు భూముల అన్వేషణ అధికారులకు కష్టంగా మారనుంది.
మారిన నిబంధనలు ఇవీ...
ఏడాదికి రూ.60 వేల ఆదాయం కలిగిన వ్యవసాయ కూలీకి ఎటువంటి భూములు లేనట్లయితే అర్హులు.
ఎంపికైన గ్రామాల్లో ప్రభుత్వ భూమి లేని పక్షంలో ప్రైవేటు భూమిని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి.
ఒక్కో ఎకరం ధర రూ.2 లక్షల నుంచి రూ. 3లక్షల వరకు నిర్ణయించారు. ఒకేచోట పది లేదా పదిహేను ఎకరాలు లభ్యమయ్యే పరిస్థితి ఉంటే వాటిని కొనుగోలు చేయాలి. దీనివల్ల లబ్ధిదారులు ఉమ్మడి వ్యవసాయం చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది.
అదీగాక కేంద్ర ప్రభుత్వ నుంచి అమలయ్యే ఇందిర జలప్రభ వంటి పథకాలను వీటికి వర్తింపజేసే వీలుంటుంది.
భూముల్లో నీటి వసతి, భూగర్భ జలాలు, భూసార పరీక్షలను వ్యవసాయ శాఖ, సంబంధిత శాఖలు నిర్వహించాలి.
నియోజకవర్గానికో గ్రామం
Published Fri, Aug 1 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 11:10 AM
Advertisement
Advertisement