
3 ఎకరాల భూపంపిణీ ప్రస్తావన ఏది?: వైఎస్ఆర్ సీపీ
హైదరాబాద్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ పార్టీ విస్మరిస్తోందని ఖమ్మం జిల్లా పినపాక వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం అసెంబ్లీలో గిరిజనులు, దళితులకు భూ కేటాయింపులపై వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకర్లతో మాట్లాడుతూ భూమి లేని పేద దళితులకు, గిరిజనులు మూడు ఎకరాలు కేటాయిస్తామన్న ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. భూపంపిణీ వివరాలను ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఆగస్ట్ 15న టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా దళితులకు భూపంపిణీ ప్రారంభించిందని, అయితే ఎంతమందికి పంపిణీ చేశారో చెప్పాలరన్నారు. అలాగే భూములతో పాటు సాగునీరు, కరెంట్, సాగునీరు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 3 ఎకరాల భూ పంపిణీపై ప్రస్తావన లేదన్నారు. మరోవైపు భూమి కోసం దళితులు, గిరిజనులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారని పాయం వెంకటేశ్వర్లు అన్నారు. దీనిపై సభలో ప్రభుత్వం నుంచి సమాధానం రాబడతామని చెప్పారు.