
డీల్ కుదిరింది!
► ఇక కేసులు లేనట్టే!
► 467 సర్వే నంబర్ భూమి వ్యవహారం
► చక్రం తిప్పిన అధికార పార్టీ నాయకులు
జమ్మికుంట మండలం కొత్తపల్లి సర్వేనంబర్ 467 భూమి కబ్జా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కొలతలు వేసిన అధికారులు ఆరు గుంటల ప్రభుత్వ భూమిని గుర్తించి అందులో నిర్మాణాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇళ్లు కోల్పోయిన వారు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకుంటుందని ప్రచారమైనా... అధికార పార్టీ నాయకుల జోక్యంతో సయోధ్య కుదిరినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమి అని గుర్తించిన దాంట్లో నిర్మాణాలకు పరిహారం ఇచ్చేలా ఈ డీల్ కుదరడం గమనార్హం.
కొత్తపల్లి (జమ్మికుంట రూరల్) : కొత్తపల్లిలోని సర్వేనంబర్ 467లో ప్రభుత్వ భూమిలో కొందరికి భూ పంపిణీ చేయగా, మిగతా భూమి కబ్జా అవుతోందనే అధికారులకు గతంలో ఫిర్యాదులందాయి. ఎరుకల సంఘం వారు తమ సంఘ భవన నిర్మాణానికి 467లో స్థలం కేటాయించాలని కోరడంతో సర్వే అధికారులు కొద్ది రోజుల క్రితం కొలతలు వేశారు. 19 గుంటలు ప్రభుత్వ భూమి ఉంటుందని భావించగా, ఆరు గుంటలు మాత్రమే ప్రభుత్వ భూమి మిగిలి ఉందని లెక్కలు తేల్చారు.
ఈ ఆరు గుంటల స్థలంలో నిర్మించిన ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఇళ్లు కోల్పోయిన దళితులు స్థానిక దళిత నాయకుల సహకారంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు హుజూరాబాద్ డీఎస్పీ 467 సర్వేనంబర్ భూమి వ్యవహారంపై విచారణ జరిపారు.ఒక దశలో ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా విభజించి అమ్మిన వారిపై, దళితులకు నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతోపాటు ఆస్తినష్టం కేసులు నమోదవుతాయని ప్రచారం జోరుగా సాగింది.
ఈ క్రమంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన రియల్ వ్యాపారులు ఇళ్లు కోల్పోయినవారి సన్నిహితులు, బంధువుల వివరాలు సేకరించి సయోధ్య కుదర్చాలని అధికార పార్టీ నాయకులను రంగంలోకి దింపారు. ఇళ్లు కోల్పోయిన వారికి స్థలాలు ఇస్తూ, తిరిగి ఇళ్లు నిర్మించి, ఖర్చుల కోసం కొంత నగదు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. దీంతో ఇక పోలీసు కేసులు లేనట్టేననే ప్రచారం జరుగుతోంది. 467 భూమి వ్యవహారం పలు మలుపులు తిరుగుతుందని భావించిన తరుణంలో అందరి అంచనాలు తారుమారయ్యేలా సయోధ్య కుదిరినట్లు సమాచారం.
ఈ వ్యవహారాన్ని చక్కబెట్టినవారిలో ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన ఓ నాయకుడు, ఓ ఫోరం అధ్యక్షుడు మానేరు సమీప గ్రామ ఎంపీటీసీ సభ్యురాలి భర్తతోపాటు మరికొంత మంది నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నట్లు సమాచారం. అయితే 6 గుంటల భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా, బాధితులకు తిరిగి స్థలాన్ని ఎక్కడ నుంచి అప్పగిస్తారన్న సందిగ్ధం పలువురిలో నెలకొంది.