
20 కుటుంబాలు.. 60 ఎకరాలు
నిరుపేద దళితులకు భూమిని పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆశయానికి గండిపడుతోంది.
ప్రహసనంగా దళితులకు భూ పంపిణీ
►భూమి కొనుగోలుకు జిల్లాకు రూ.24.5 కోట్లు విడుదల
►ఖర్చుచేసింది కేవలం రూ.1.55కోట్లు మాత్రమే
►భూ పంపిణీలో కూడా భారీ అక్రమాలు
సాక్షి, మహబూబ్‌నగర్ : నిరుపేద దళితులకు భూమిని పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆశయానికి గండిపడుతోంది. ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల భూమిని పంపిణీ చేయాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం నెరవేరేలా లేదు. భూపంపిణీ ప్రక్రియ కోసం జిల్లాకు రూ.24.50 కోట్లు విడుదల చేయగా ఇప్పటివరకు కేవలం రూ.1.52 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. తద్వారా కేవలం 20 కుటుంబాలకు 60 ఎకరాలు మాత్రమే పంపిణీచేశారు.
జిల్లాలో 7,08,954 మంది(2011 జనాభా లెక్కల ప్రకారం)ఎస్సీలు ఉన్నారు. జనాభాలో 17.5శాతం మంది ఉన్నారు. అయితే వీరిలో కేవలం మూడు శాతం మందికి మాత్రమే వ్యవసాయ సాగుభూములు ఉన్నాయి. మిగతా వారికి కూడా విడతల వారీగా భూ పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకనుగుణంగా జిల్లాకు పెద్దమొత్తంలో నిధులు కూడా మంజూరయ్యాయి. కానీ అధికారుల అలసత్వం కారణంగా భూ పంపిణీ ప్రక్రియ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
జిల్లాలో ఆగస్టు 15న మంత్రి కె.తారకరామారావు లాంఛనంగా ప్రారంభిస్తూ.. 12 మంది లబ్ధిదారులకు కూడా పట్టాలు అందజేశారు. ఆ తర్వాత మరో ఎనిమిది మందికి మాత్రమే భూ పంపిణీ చేశారు. మంత్రి ప్రారంభం తర్వాత ఐదునెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ పథకం ముందడుగు వేయడం లేదు.
మొక్కబడిగా మొదటి విడత
జిల్లాలో మొదటివిడతగా ఆరుగ్రామాల్లో మాత్రమే ఎస్సీలకు భూ పంపిణీ చేశారు. అయితే మొదటి విడతలో ఎంపికైన గ్రామాల్లోని ఒకటి మినహా అన్నీ కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలే కావడం గమనార్హం. కేవలం వడ్డేపల్లి మండలం కోయిలదిన్నె మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన సంపత్‌కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్న అలంపూర్‌లో ఉంది. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వు కావడం చేత అక్కడ భూ పంపిణీ చేపట్టినట్లు తెలుస్తోంది.
మరోవైపు జిల్లాలో ప్రధానంగా ఎస్సీల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో భూ పంపిణీకి అటవీచట్టాలు ప్రధాన అడ్డంకిగా మారాయి. ఎస్సీ జనాభా ఎక్కువగా అచ్చంపేట నియోజకవర్గంలో అటవీచట్టం(1 యాక్టు 1970 ప్రకారం) అమ్రాబాద్, అచ్చంపేట, బల్మూరు, లింగాల ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేయడానికి వీల్లేదు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ఎస్సీలు నిరాశకు లోనవుతున్నారు.
దళారుల దందా
దళితుల భూ పంపిణీలో దళారులు దగాకు గురిచేస్తున్నారు. ఓ వైపు భూ అమ్మకందారుల నుంచి, మరోవైపు లబ్ధిదారులైన నిరుపేద దళితుల నుంచి కూడా భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బుల వసూళ్లలో వీఆర్‌ఓలతో మొదలుకుని పైస్థాయి అధికారులు, చోటామోటా నాయకుల వరకు వాటాలు తీసుకుంటున్నట్లు బాధితులు చెబుతున్నారు.
అయితే ఈ విషయాలు బహిరంగంగా బయటకు చెప్తే ఊళ్లో ఎలాంటి సహాయ సహకారాలు అందవని హెచ్చరిస్తున్నారు. మరికొన్ని చోట్ల భూమి విలువను అమాంతం పెంచేసి.. దళారులు, అధికారులు కలిసి వాటాలు పంచుకుంటున్నారు.