
కర్రలతో రైతుల దాడి
11 మందికి గాయాలు
పోలీసులకు ఇరువర్గాల ఫిర్యాదు
బుచ్చెయ్యపేట : గున్నెంపూడి రెవెన్యూ పరిధిలో భూ వివాదం రెండు గ్రామాల రైతుల మధ్య చిచ్చురేపింది. ఆ గ్రామాలకు చెందిన రైతు లు బుధవారం ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో 11 మందికి తల, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి.
గున్నెంపూడి సర్వే నంబర్ 1లో గ్రామానికి చెందిన 16 మంది రైతులకు 22 ఎకరాల భూమిని ఆరో విడత భూ పంపిణీలో పట్టాలు అందజేశారు. దీంతో రైతులంతా ఇటీవల యూకలిఫ్టస్ మొక్కలు వేశారు. అయితే పక్కనున్న రావికమతం మండలం మట్టవానిపాలెంనకు చెందిన రైతులు ఈ మొక్కలు పీకుతుండడంతో గున్నెంపూడి రైతులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, అది కొట్లాటకు దారితీసింది. కర్రలతో దాడి చేసుకోవడంతో గున్నెంపూడికి చెందిన తుమ్మలపూడి సత్తిబాబు, గణేష్ తలపై తీవ్ర గాయాలవ్వగా.. తుమ్మలపూడి చినబాబుకు ఎడమ చేయి విరిగింది.
సెలపురెడ్డి సత్తిబాబు, స్వామి, ముచ్చకర్ల వెంకునాయుడు, తుమ్మలపూడి చినబాబు తలపై గాయాలయ్యాయి. అలాగే మట్టవానిపాలెంకు చెందిన అక్కిరెడ్డి అప్పారావు, దేవర పరిశెట్టి నాయుడు, కరణం చిననాయుడు, మామిడి అప్పారావు గాయాలపాలయ్యారు. వేలాది రూపాయిలు పెట్టుబడులు పెట్టి మొక్కలు నాటితే.. మట్టవానిపాలెం ఎంపీటీసీ రైతులతో కలిసి తమపై దాడి చేశారని గున్నెంపూడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేకలు మొక్కలు తింటే తమపై దాడి చేశారని మట్టవానిపాలెం రైతులు ఆరోపించారు. ఇరువర్గాలు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేయగా.. ఎస్‌ఐ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.