భీమవరం మండలంలోని గొల్లవానితిప్ప గ్రామంలో సీఏడీ భూముల్లో వరి సాగు చేస్తున్న దృశ్యం
భూములున్నా.. పంట పండించుకోవడం తప్ప.. వారికి ఎటువంటి హక్కులేదు. పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నా బ్యాంకుల్లో కుదవ పెట్టుకునే అవకాశం లేదు. దీంతో ఆ రైతుల పరిస్థితి అగమ్యగోచరం. అటువంటి సమయంలో భీమవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన గ్రంధి శ్రీనివాస్ వారికి అండగా నిలిచారు. ప్రభుత్వాన్ని ఒప్పించి సీఏడీ భూములకు పట్టాలు ఇప్పించారు. దీంతో అక్కడ సుమారు 1000 మంది రైతులకు మేలు కలిగింది. అటువంటి శ్రీనివాస్‌ను తాము ఎప్పటికీ మర్చిపోలేం అని రైతన్నలు చెప్పారు. మళ్లీ ఆయన్ని ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని వారంతా నడుం బిగించారు.
సాక్షి, భీమవరం (పశ్చిమ గోదావరి): భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలో సర్కార్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్(సీఏడీ)భూములు సుమారు 1532 ఎకరాలు ఉన్నాయి. వాటిని 1921 సంవత్సరం నుంచి గ్రామానికి చెందిన కొంతమంది పేదలు సాగుచేయడం ప్రారంభించారు. అడవి మాదిరిగా చెట్లు, చేమలు, రుప్పలతో అస్తవ్యస్థంగా ఉండే ఆ భూములను అప్పటి రైతులు ఎంతో కష్టపడి సాగుకు అనుకూలంగా మార్పుచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ భూములపై రైతులకు చట్టబద్ధంగా ఎటువంటి హక్కులేకపోయింది. ఆ భూములు మావేనని చెప్పడానికి వారి వద్ద ఎటువంటి ఆధారం ఉండేది కాదు. కనీసం తమ ఆడబిడ్డలకు పిల్లలకు కట్న కానుకలుగా ఇచ్చే అవకాశం లేకపోయింది. ఎంతోకాలంగా పట్టాలిప్పించాలని రైతులు అనేక మంది ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకున్నా ఫలితం శూన్యం. ఎంతో నిరాశలో ఉన్న రైతులకు 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన గ్రంధి శ్రీనివాస్ ఆశాదీపంగా కనిపించారు.
రైతులు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను గుర్తించిన ఆయన వెంటనే వారికి పట్టాలు ఇప్పించడానికి కృషి ప్రారంభించారు. 1532 ఎకరాల సీఏడీ భూముల్లో సుమారు 902 మంది రైతులకు 950 ఎకరాలకు పట్టాలు ఇచ్చి వారి కళ్లలో ఆనందాన్ని నింపారు. అయితే మిగిలిన భూములకు పట్టాలు ఇప్పించడానికి పదేళ్లుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు ఎటువంటి శ్రద్ధ చూపించలేదని విమర్శిస్తున్నారు. మళ్లీ శ్రీనివాస్ ఎమ్మెల్యే అయితే మిగిలిన భూములకు పట్టాలు వస్తాయని వారంతా నేడు ఆశగా ఉన్నారు.
మా కష్టం తెలిసిన మహనీయుడు శ్రీనివాస్
భీమవరం ఎమ్మెల్యేగా ఎంతోమంది పని చేశారు. కానీ రైతుల కష్టాలు ఎవరూ గుర్తించేవారు కాదు. గ్రంధి శ్రీనివాస్ గుర్తించి 950 ఎకరాలకు పట్టాలిచ్చి 900 మందికి పైగా రైతుల కళ్లలో ఆనందాన్ని చూసిన వ్యక్తి. మా వంశంలోని తరతరాలకు గుర్తుండిపోతారు.
–జి.వెంకట సుబ్బలక్ష్మి, మహిళా రైతు, గొల్లవానితిప్ప
రైతు బిడ్డ కనుకనే..
రైతులంటే రైతు బిడ్డ అయిన శ్రీనివాస్‌కు అభిమానం ఎక్కువ. రైతులు కనబడితే కారు ఆపి పలకరిస్తారు. ఇప్పటివరకు శ్రీనివాస్ లాంటి ఎమ్మెల్యేను చూడలేదు.
–మెంటే పల్లయ్య, రైతు, గొల్లవానితిప్ప
కట్నంగా ఇస్తున్నాం
పట్టాలు ఇవ్వక ముందు మా ఆడబిడ్డలకు భూమిని కట్నంగా ఇచ్చే అవకాశం ఉండేది కాదు. శ్రీనివాస్ చలువ వల్ల ఇప్పుడు కట్నాలుగా ఇస్తున్నాం.
–పాకల రంగారావు, రైతు, గొల్లవానితిప్ప
నాలుగు మెతుకులు తింటున్నాం
అప్పట్లో మా పొలానికి పట్టాలు ఏమి లేకపోవడంతో భూమికి విలువ ఉండేది కాదు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పట్టాలు ఇచ్చిన తరువాత భూమికి విలువ పెరిగింది. ఆయన దయవల్లే నాలుగు మెతుకులు తినగలుగుతున్నాం.
- గుద్దటి పెద్దిరాజు, రైతు, గొల్లవానితిప్ప
Comments
Please login to add a commentAdd a comment