
సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్ట నున్న గృహ నిర్మాణాల్లో ఎక్కడా లోపాలు ఉండరా దని, నాణ్యంగా ఉండాలని ఇంజనీరింగ్ సిబ్బందిని గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాల్లో కీలకంగా వ్యవహరించే ఇంజనీరింగ్ సిబ్బందితో మంగళవారం తాడేపల్లిలోని గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో సెమినార్ నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జి.యస్.నవీన్ కుమార్, చీఫ్ ఇంజనీర్ మల్లికార్జునరావు పలు సూచనలు చేశారు. నాణ్యతపై ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు ఈ నెల 26న సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నవరత్నాల అమలులో భాగంగా ప్రభుత్వం ఈ పథకాన్ని డిసెంబర్ 25న లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు మరోసారి స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన రోజే గృహ నిర్మాణాలు ప్రారంభించేలా యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
డ్యాష్‌బోర్డులో పురోగతి వివరాలు..
ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభించే సమయానికి లబ్ధిదారునికి గృహం మంజూరు పత్రంతోపాటు సీఎం సందేశం, పూర్తి వివరాలు అందించాలని ఉన్నతాధికారులు సెమినార్‌లో సూచించారు. డిసెంబర్ 25న సీఎం జగన్ పథకాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారని తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఐరన్, మెటల్, ఇసుక తదితరాలను లేఅవుట్ల సమీపంలోని గోడౌన్లలో భద్రపరిచేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్య మంత్రి ఆదేశాల ప్రకారం పూర్తి పారదర్శకంగా నిర్మాణాలు చేపట్టాలని, ఎక్కడా అవినీతికి ఆస్కారం ఇవ్వరాదని, ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డులో పొందు పరచాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment